- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొత్తుల వల్ల ఎవరికెంత లాభం!
ఏపీలో వైసీపీ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే ఉమ్మడి లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. దానికి అనుగుణంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చక్కటి రాజకీయ పరిణితిని ప్రదర్శిస్తున్నారు. దీంతో సరికొత్త రాజకీయ పునరేకీకరణకు పునాది పడనుంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో శుభపరిణామమే అవుతుంది. ఇప్పటికిప్పుడు పొత్తు పొడవకపోయినా ఎన్నికల సమయానికి అందరూ కలిసి పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. దానికి తగ్గట్లే ప్రతిపక్షాల అడుగులు ముందుకు పడుతున్నాయి. అధికారికంగా పొత్తులపై ఎవరూ ప్రకటించకపోయినప్పటికీ పొత్తులు మాత్రం ఖాయంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తూ, వ్యక్తి స్వేచ్ఛను హరిస్తూ పౌర హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంది.
బీజేపీతో పొత్తు వలన వచ్చే లాభం..
వైసీపీ ప్రభుత్వంతో రాష్ట్రానికి ఎలాంటి మేలు లేదని బాహటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర శ్రేయస్సును కోరి భావసారూప్యం కలిగిన వ్యక్తులు, పార్టీలు ఒక తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించారు. ప్రతిపక్షాలు జట్టుగా పోటీచేస్తే ఓటమి తప్పదని వైసీపీ కలవరపడుతోంది. అందుకే దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని రెచ్చగొడుతున్నారు. విడివిడిగా పోటీ చేయడమా, జట్టు కట్టడమా అనేది ఆయా పార్టీల అంతర్గత వ్యవహారం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తాయనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఈ కలయిక రాష్ట్ర ప్రజల్లో ఉన్న అభద్రతాభావాన్ని, భయాన్ని పోగొట్టి నైతిక స్థైర్యం నింపుతుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఓట్ల చీలికల వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించి, ఈసారి అది పునరావృతం కాకూడదని రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దీనికోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవ చూపి తన వంతుగా అనేక సందర్భాల్లో బీజేపీతో సంప్రదింపులు జరిపారు. దీనికోసం రోడ్ మ్యాప్ అడిగారు. బీజేపీ నుంచి సరైన స్పందన రానప్పటికీ పవన్ కల్యాణ్ ఎక్కడా తన వంతు ప్రయత్నం ఆపలేదు. కర్ణాటక ఎన్నికల్లో ఎదురైన ఓటమితో బీజేపీ కళ్లు తెరచి ఒక మెట్టు దిగినట్టుంది.
బీజేపీతో పొత్తు వలన వచ్చే నష్టం..
బీజేపీ జాతీయపార్టీ అయినప్పటికీ ఏపీలో దాని ప్రభావం అంతంత మాత్రమే. కానీ బీజేపీతో పొత్తు వలన ఎన్నికల సమయంలో జగన్ అధికార దుర్వినియోగానికి అడ్డుకట్టపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల కమిషనర్ అక్రమాలను నిరోధించే ప్రయత్నం చేశారు. కానీ ఎన్నికలలో జరిగే దౌర్జన్యాలను, రిగ్గింగ్‌లను, బలవంతపు ఏకగ్రీవాలను, అభ్యర్థులపై దాడులను నిలువరించలేకపోయారు. దీంతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో కలిసి ముందుకు సాగాలనుకుంటున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.
రెండోవైపు బీజేపీతో పొత్తు వలన ఎంత ప్రయోజనం ఉందో అంతకంటే రెట్టింపు నష్టం కూడా ఉంది. ముస్లీం మైనార్టీ ఓట్లకు భారీగా గండిపడే ప్రమాదం ఉంది. అలాగే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందనే భావన ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన దానికంటే బీజేపీ ఓటమి పట్ల పార్టీలకతీతంగా ఎక్కువమంది సంతోషించారు. రాజధాని లేని రాష్ట్రంగా చేశారని మాట్లాడటం తప్ప చేతల్లో బీజేపీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా ఆర్-5 జోన్ లో ఆఘమేఘాలపై 47 వేల ఇళ్లు మంజూరు చేయడంతో పాటు రూ.750 కోట్లు నిధులు సమకూర్చారు. అలాగే రుణపరపతిపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఆంధ్రప్రదేశ్‌ను రుణాల ఊబిలో నెట్టేందుకు తమవంతు సహకారాన్ని అందించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని వ్యవస్థలు జగన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేలా బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యవహరిస్తోందనే భావన రాష్ట్ర ప్రజానీకంలో ఉంది. ఆంధ్రాలో లిక్కర్ స్కామ్‌తో పోలిస్తే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చాలా చిన్నది. ఇక్కడ రూ.42 వేల కోట్ల భారీ కుంభకోణం లిక్కర్ స్కామ్ జరిగింది. కానీ ఇక్కడ ఎలాంటి కేసులు లేవు. ఇలాంటి భారీ స్కామ్‌లపై స్పందించకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి?
టీడీపీకే తలనొప్పులు..
ఇటీవల ఉత్తరాంధ్ర, రాయలసీమలో రెండు రోజుల వ్యవధిలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించి, వైసీపీ పాలనపై దుమ్మెత్తిపోస్తూ ముప్పేట దాడి చేశారు. రైతు ఆత్మహత్యలపై, రాష్ట్రం విద్రోహ శక్తులకు, భూకబ్జాలకు అడ్డాగా మారిందని. ఫార్మా, మైనింగ్ రంగాల్లో దోపిడీ జరిగిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ వైసీపీ నుంచి ఎలాంటి స్పందనా లేదు. కానీ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో రజనీకాంత్ చంద్రబాబును పొగిడితే, దీనిని రాద్దాంతం చేస్తూ రాష్ట్ర మంత్రులు, వైసీపీ నాయకులు తీవ్రమైన పదజాలంతో రజనీకాంత్‌పై దుమ్మెత్తి పోశారు. ఒకవైపు బీజేపీ వైసీపీకి సహకారాన్ని అందిస్తూ.. మరోవైపు ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశం అర్థం కావడం లేదు. రాష్ట్రం ఇన్ని కుంభకోణాలు చేస్తుందని విమర్శించే మీరు. అప్పుల రూపంలో కోట్లాది రూపాయలు ఎందుకు సమకూరుస్తున్నారు. వీటన్నింటిని పరిశీలించినప్పుడు బీజేపీ నిజస్వరూపం తేటతెల్లమవుతోంది. ఏపీ ప్రజలకు బీజేపీ పట్ల ఇంత అసంతృప్తి, అపనమ్మకం ఉన్నప్పుడు ఎలా కలిసి ముందుకు సాగుతారు ఇవన్నీ తెలుగుదేశం, జనసేన ముందున్న సవాళ్లు. పైగా పొత్తు కుదిరితే సీట్ల సర్దుబాటు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. మిత్రపక్షాలకు కేటాయించే సీట్లల్లో నాలుగేళ్లు తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్‌ల రూపంలో సమయాన్ని, ఆర్ధిక వనరులను వెచ్చింది అధికార పక్షంపై పోరాటం చేశారు. పొత్తు కుదిరితే వాళ్ళని ఎలా బుజ్జగిస్తారు.
పొత్తుల్లో హేతుబద్ధత లేకపోతే..
నిజానికి బీజేపీకి రాష్ట్రంలో ఒక్క శాతం సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. ఇప్పటికే తటస్థులు ఆ రెండు పార్టీల పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కానీ ఈ పొత్తు వలన మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లలో వైసీపీకి పోయే ప్రమాదం ఉందని టీడీపీలోని ఒక వర్గం వాదిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు పొత్తులు ఎందుకని సీట్లు ఆశిస్తున్న కొంతమంది నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య ఎలా నెట్టుకురాగలరనేది రాజకీయ విశ్లేషకులకు అంతుబట్టడం లేదు. చంద్రబాబు చాణక్యం ఎంత వరకు పనిచేస్తుందో వేచి చూడాలి.
గత ఎన్నికల్లో బీజేపీతో కలవకపోవడం ఎంత తప్పో.. ఇప్పుడు అంతే. బీజేపీ, వైసీపీ ఎత్తుగడల్లో తెలుగుదేశం, జనసేన పావులుగా మారకూడదు. మోడీ దత్తపుత్రుడు జగనేనని స్వయంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు గుర్తుచేసుకోవాలి. దొంగ ఓట్లు, నకిలీ మద్యం, అవినీతి డబ్బే ఎన్నికల్లో జగన్‌కు అస్త్రాలు కాబోతున్నాయి. ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారు. దానికి తగ్గట్లు తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు వ్యవహరించాలి. పదేపదే నిర్ణయాలు మార్చుకున్నా, స్థిరమైన ఆలోచనలు లేకపోయినా, పొత్తుల్లో హేతుబద్ధత లోపించినా ప్రత్యర్థికి లాభం చేకూరుతుంది. అందుకే పొత్తులపై ఆచితూచి అడుగులు వేయాలి. ఎవరితో కలవాలి, ఎవరితో కలవకూడదనేది తెలుగుదేశం పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
మన్నవ సుబ్బారావు
గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్
99497 77727