ధరణి పోర్టల్ అక్రమాల నివేదిక ఎక్కడ

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-06 22:30:28.0  )
ధరణి పోర్టల్ అక్రమాల నివేదిక ఎక్కడ
X

నిజాం నవాబుల పాలన, పెద్ద మనుషుల ఒప్పందంతో ఆంధ్ర పాలకుల అరవై ఏళ్ళ దోపిడీకి గురై ఎట్టకేలకు విముక్తిపొందిన తెలంగాణలో రెవిన్యూ వ్యవస్థలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిపడేశారు. 2018లో ల్యాండ్ రికార్డు అప్డేట్ ప్రోగ్రామ్‌తో ఒకవైపు రెవిన్యూ ఉద్యోగులు అద్భుతంగా పని చేశారని ప్రశంసిస్తూ, ఇంకోవైపు రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ధర్మఘంట పేరుతో VRO లు అవినీతిపరులు అనే ముద్ర వేసి ధరణి పోర్టల్‌ని, కొత్త రెవెన్యూ ROR చట్టం 2020ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. కేవలం రెండేళ్ల కాలంలో ధరణి పోర్టల్‌లో లోపాలు చట్టంలో లొసుగులు వెలుగుచూశాయి. అమాయక రైతులు తహసిల్దార్ కార్యాలయం నుండి సీసీఎల్ఎ వరకు చెప్పులు అరిగేలా తిరిగినా పరిష్కారం అయ్యేది కాదు.

ధరణిపై శ్వేతపత్రం రావాలి

ఇలాంటి పరిస్థితులలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ని బంగాళాగతంలో కలిపి, ప్రభుత్వ భూములలో జరిగిన అవకతవకలను వెలికి తీసి అక్రమార్కులను జైలుకు పంపుతామని చెప్పడం జరిగింది. 2014 జూన్ 2న ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, కాందిశీకుల భూములు (ఎవాక్యు ప్రాపర్టీ), వక్ఫ్ బోర్డు, సర్ఫేకాజ్, ఎండోమెంట్, ఫారెస్ట్, అటవీ, చెరువులు, కుంటలు, అసైన్డ్, నోషన్ ఖాతా, శ్రీ శ్రీ పేరున ఉన్న భూములు ఎన్ని గత పదేళ్ల ప్రభుత్వ పాలనలో పైన తెలిపిన భూములు, GO 59 ద్వారా అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూములు ఎన్ని అనే వివరాలపై అసెంబ్లీ సమావేశాల్లో శ్వేత పత్రం విడుదల చేయలేదు. పదేళ్ల పాలనలో ప్రభుత్వ భూములు పప్పు బెల్లం లాగ పార్టీ ఆఫీసుల కోసం కేవలం 100- రూపాయలకు గజం కేటాయించుకున్న చరిత్ర గత ప్రభుత్వంది కానీ స్వాతంత్ర సమరయోధులకు, మాజీ సైనికులకు ఎక్కడ కూడా భూమి ఇచ్చిన దాఖలాలు లేవు.

ఫార్మ్ హౌస్‌ల మాటేంటి?

కోకాపేటలో రాజ్ పుష్ప కంపెనీ కొనుగోలు చేసిన 100 కోట్లకు ఎకరం భూమి నుండి కుల సంఘాలకు, వివిధ NGOలకు, 33 జిల్లాలలో ప్రభుత్వ భూములలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అసైన్డ్ భూములలో ఏర్పాటు చేసిన లేఅవుట్ల భూములు సహా అన్ని వివరాలతో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయలేదు. ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తుంగలో తొక్కి ఫార్మ్ హౌస్‌లు వెలిశాయి. గత ప్రభుత్వం హెటిరో సంస్థ సాయి సింధు ట్రస్టుకు ఖానమెట్‌లో 15 ఎకరాలు కేటాయించిన భూమిలో ఈ ప్రభుత్వం తిరిగి కేటాయించిన తీరు మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఓపెన్ ప్లాట్, వ్యవసాయ భూమి కొనుగోలు చేయలేని పరిస్థితి తెచ్చింది గత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వ భూములలో జరిగిన అక్రమాలను ప్రజల ముందు ఉంచి వారిపై కఠిన చర్యలు తీసుకొని నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది.

బందెల సురేందర్ రెడ్డి,

మాజీ సైనికుడు

83749 72210

Advertisement

Next Story