దేశంలోనే పెద్ద ఓడరేవు..

by Ravi |   ( Updated:2024-08-04 00:30:58.0  )
దేశంలోనే పెద్ద ఓడరేవు..
X

ప్రధానమంత్రి ‘గతి శక్తి’ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని దహను తాలూకాలో ఉన్న వాధవన్ వద్ద కొత్త మేజర్ ఓడరేవు నిర్మాణానికి 2024 జూన్ 19న భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాధవన్ పోర్ట్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే జాతీయ రహదారులు, ప్రస్తుత రైలు నెట్‌వర్క్‌కు, రాబోయే డెడికేటెడ్ రైల్ ఫ్రైట్ కారిడార్‌కు రైలు అనుసంధానానికి సంబంధించిన ప్రతిపాదనను కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ ఓడరేవు ప్రపంచంలోని అతిపెద్ద సముద్ర సముదాయాల్లో ఒకటిగా మారుతుంది. ఈ ఓడ రేవు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభమైతే దేశ సరుకు, రవాణా సామర్థ్యం గణనీయంగా పెరగడమే కాకుండా, పెరిగిన వాణిజ్య కార్యకలాపాలు, ఉద్యోగ కల్పన ద్వారా దేశ ఆర్థిక వృద్ధి ఊపందుకుంటుంది.

ప్రాజెక్టు వివరాలు..

భారత ప్రభుత్వం ఆమోదం లభించడంతో జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్‌పీఏ), మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు (ఎంఎంబీ) సంయుక్త భాగస్వామ్యంలో సంవత్సరానికి 298 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో రూ.76,220 కోట్ల వ్యయంతో వాధవన్ ఓడరేవు రెండు దశల్లో పూర్తి కానుంది. ఈ నిర్మాణాన్ని స్థానికులు, రైతులు, మత్స్యకారులు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్న తరుణంలో, ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ నిబంధనలకు అనుగుణంగా స్థానిక ప్రజల జీవనోపాధికి లేదా ఇతర అంశాలకు విఘాతం కలగకుండా ప్రాజెక్టు కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. జల రవాణా మంత్రిత్వ శాఖ ఒక పక్క ఇప్పటికే దేశంలో ఉన్న ఓడరేవులను ఆధునీకరిస్తూనే మరో పక్క కొత్త ఓడరేవులు నెలకొల్పేందుకు అవిశ్రాంతంగా పాటుపడుతోంది. దహను జిల్లాలో జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్న ఆందోళనలు పెల్లుబుకుతున్న సమయంలో ఓడరేవు నిర్మాణాన్ని ముందు ప్రతిపాదించినట్లుగా సముద్రపు ఒడ్డున కాకుండా, 4 నుండి 6 కిలోమీటర్లు సముద్రం లోపలికి జరుపనున్నారు. దీని వలన ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ కూడా గణనీయంగా తగ్గుతుంది.

ఓడరేవు నిర్మాణంతో..

ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నష్టపోయే ప్రతి కుటుంబానికి పునరావాస ప్రయోజనాలను అందించే ఏర్పాట్లను జేఎన్‌పీఏ చేపడుతోంది. కొత్త ఓడరేవు ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగాను, ఆరు వేల మందికి పరోక్షంగాను ఉపాధి లభించే అవకాశముందని, పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయిన తర్వాత లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా. దేశంలోని పెద్ద ఓడరేవులలో సరుకు రవాణా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4.55 శాతం వృద్ధి రేటుతో 819 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది. మన దేశంలో ప్రస్తుతం 12 పెద్ద ఓడరేవులు, 205 మధ్య , చిన్న ఓడరేవులు ఉన్నాయి. కాగా, వాధవన్ ఓడరేవు నిర్మాణంతో పెద్ద ఓడరేవుల సంఖ్య 13కు చేరనుంది. దేశంలోని మొత్తం పోర్టుల సామర్థ్యాన్ని 2047 సంవత్సరానికి 10,000 మిలియన్ టన్నులకు పెంచాలన్న భారీ లక్ష్యాన్ని జల రవాణా మంత్రిత్వ శాఖ నిర్దేశించుకున్నట్లు తెలిపిన నేపథ్యంలో వాధవన్ మేజర్ పోర్టు నిర్మాణం ఒక ఆశావహ ముందడుగు అని భావించవచ్చు.

యేచన్ చంద్ర శేఖర్

మాజీ రాష్ట్ర కార్యదర్శి

ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ

88850 50822

Advertisement

Next Story

Most Viewed