అనాథలుగా విచారణ ఖైదీలు!

by Ravi |   ( Updated:2023-04-28 00:46:20.0  )
అనాథలుగా విచారణ ఖైదీలు!
X

పేదోడు జైళ్ళలోనూ పేదోడే! కోర్టు వాయిదాకు పోలీసులు అతన్ని తీసుకుని వచ్చినప్పుడో లేదా ఎన్నడైనా జైలుకు ములాకాత్‌కు వెళ్ళినపుడు మాత్రమే కుటుంబ సభ్యులు అతికష్టం మీద ఎప్పుడైనా వారిని కలుస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఇది కూడా సాధ్యం కాదు! ఆర్థిక స్తోమత లేనందున, ఎక్కువ శాతం అక్కడికి వెళ్లి జైల్లో ఉన్న తమ వారిని కలువరు. 95 శాతం ఇలాంటి పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగం, అసమానతలు, ఆకలి అనేదే కుటుంబాలలో అశాంతికి కారణం అవుతుంది. వారి చేత చిన్న చిన్న తప్పులను చేయించి నిందితులను చేస్తుంది. దేశాన్ని, దేశ సంపదను లూటీ చేసిన వారు, బ్యాంకులను లక్షల కోట్లు ముంచిన కార్పొరేట్‌లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీల అండ దండలతో దేశం విడిచి పరార్ అయిపోతారు. వారికి ఎన్ఓసీ దొరికి విదేశాల్లో పౌరులుగా మారిపోతారు.

ష్యూరిటీలు ఇవ్వలేని పరిస్థితి

గౌతమ్ అదానీ లాంటి వారు 12 లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడినా వారి మీద ఈగ వాలకుండా ప్రధాని లాంటి వారు చూసుకుంటారు! పుష్కలంగా రాజకీయ అండదండలు లభిస్తాయి. కానీ పొట్టకూటి కోసం చిన్న చిన్న, తప్పులు చేసి కేసుల్లో ఇరుక్కునే వారి పరిస్థితి కడు దీనంగా ఉంటోంది. నెలలు, ఏండ్ల తరబడి వారికి బెయిల్ దొరికినా జమానతు (పూచికత్తు) లభించని పరిస్థితి ఉంది. భారతదేశంలోని 391 జిల్లాల్లోని జైళ్లలో సామర్థ్యానికి మించి 150 శాతం, 709 జిల్లాల్లో 100 శాతం ఖైదీలతో జైళ్లు నిండిపోయి ఉన్నాయి. 2021 లెక్కల ప్రకారం అండర్ ట్రయల్స్‌లో 95 మందికి న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేసినప్పటికి వారికి ష్యూరిటీలు (జమాతులు) లభించక ఏండ్ల తరబడి జైళ్లలోనే ఉండిపోతున్న పరిస్థితి ఉంది. 16 రాష్ట్రాలలో 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో పై పరిస్థితి ఉన్నది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారం దేశంలోని అండర్ ట్రయల్‌కు చెందిన 77 శాతం ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారు. ఇందులో 68శాతం అండర్ ట్రయిల్స్‌లో చదువు లేదు. వీరంతా నిరక్షరాస్యులు. 8వ తరగతి వరకు, ప్రైమరీ వరకే స్కూల్‌కు వెళ్లిన వారు ఇందులో ఉన్నారు. జైళ్లలో వీరి కనీస హక్కులు సైతం హరించుకుపోతున్నాయి. సుదీర్ఘకాలం పాటు చిన్న చిన్న కేసులలో జైల్లో ఉండిపోవడం, పేదరికం పొట్ట కూటి కోసం వారిని నేరాల వైపుకు నెట్టి వేయడంతో వీరు కడుదీనమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

80 శాతం ఖైదీలకు నో బెయిల్

2021 రిపోర్ట్ ప్రకారం 80 శాతం అండర్ ట్రయల్ ఖైదీలను జైళ్లలోనే ఉంచేశారు. జమానతు లేదు, కేసు కొట్టేస్తేనే బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కేసులు త్వరితగతిన పరిష్కారం కావు. ఇందులో బీహార్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడ 140 శాతం, కన్నా అధిక సంఖ్యలో ఖైదీలు జైల్లో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో 185 శాతం ఖైదీలు జైళ్లలో కెపాసిటీకి మించి బందీలుగా ఉన్నారు. 200 ఖైదీలకు వారిలో మార్పు తీసుకొచ్చే ఒక అధికారి ఉండాలి, అలాగే 500 ఖైదీలకు ఒక మానసిక రోగ నివారణ వైద్యుడు ఉండాలి. మొత్తంగా ఖైదీల్లో మార్పు తెచ్చే అధికారులు 2770 మందికి గాను 1391 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో 886 మందే విధులు నిర్వహిస్తున్నారు. మహిళా ఖైదీల స్టాఫ్ కొరత తీవ్రంగా ఉంది. ప్రతి 30 మంది ఖైదీలకు ఒక ప్రభుత్వ న్యాయవాది ఉండాలి. 2020లో జిల్లాల సంఖ్య 1306 కాగా అది 2021లో పెరిగి 1319 అయ్యింది. జిల్లాల్లో‌ని జైళ్లలో ఖైదీల పరిస్థితి కడు దీనంగా ఉంటుంది. జైళ్లలో ఉంటున్న వారి ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది.

పేదరికంతో ఆర్థిక, సామాజిక అసమానతలతో పేదలు బతుకు బండి లాగుతూ ఉంటారు. ఎన్నికలప్పుడు వారు నివసిస్తున్న మురికివాడల్లోకి వచ్చి, మసి బట్టల్లో ఉన్న వారి పిల్లలను ఓట్ల కోసం ముద్దాడే నేతలు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం కనబడితే పలకరింపు కూడా ఉండదు. దళితులు, ముస్లింలు, ఆదివాసీలు, ఇలా పీడిత, తాడితులే ఎక్కువ శాతం చిన్న చిన్న కేసులలో ఇరుక్కున్న వారిలో ఉన్నారు. వీరి కేసులను కనీసం త్వరితగతిన పరిష్కారం అయినా చేయాలి. లేదా సెల్ఫ్ బాండ్ (సొంత పూచికత్తు) పైన అయినా విడుదల చేయాలి. ఉపాధి అవకాశాలు అసలుకే లేవు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి తొమ్మిదేండ్లు దాటినా ఫలితం లేదు. ఈలెక్కన పీఎం నరేంద్ర మోడీ ఇప్పటికే 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఈ తొమ్మిది ఏండ్లలో కనీసం 18 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. దేశ జనాభా 142 కోట్లు అయింది, 80 కోట్లు ఉన్న పేదల సంఖ్య ఏక కాలంలో 84 కోట్లు కానుందని అంచనా ఉంది. అసమానతలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. అధిక ధరలు వల్ల దేశంలో కోట్లాది కుటుంబాల బడ్జెట్ భారీగా పెరిగింది. ఏక కాలంలో ఆదాయం సగటున 30 శాతం తగ్గింది. దేశం ఏమైపోతుంది మనం ఎటుపోతున్నాం. జైళ్లలో మగ్గుతున్న నిరుపేద అండర్ ట్రయల్స్‌ను కాపాడి వారికింత ఉపాధి చూపండి పీఎం మోదీజీ. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చాలామంది విచారణ ఖైదీలుగా ఉన్నారు! వారి స్థితిగతుల మీద కూడా విచారణ జరగాలి.

ఎండి.మునీర్

సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్

9951865223

Advertisement

Next Story

Most Viewed