- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చలనచిత్ర గానానికి ఒరవడి... మొహమ్మద్ రఫీ
మొహమ్మద్ రఫీ ఒక నిరుపమానమైన భారతదేశ చలనచిత్ర నేపథ్యగాయకుడు. భగవద్దత్తమైన ప్రతిభావంతమైన గాత్రం (God gifted voice) అనీ, ఒక బహుముఖ ప్రజ్ఞ ఉన్న గాయకుడు (A versatile singer) అనీ విశ్వ సంగీతంపై పట్టు ఉన్న ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడు సలీల్ చౌదరి ఒక సందర్భంలో రఫీ గురించి చెప్పారు. ఇవి సలిల్ మాటలు మాత్రమే కావు. మనదేశంలో 99శాతం చలనచిత్ర సంగీత దర్శకుల చింతన కూడా. అవును రఫీ భగవద్ దత్తమైన, ప్రతిభావంతమైన గాత్రంతో బహుముఖ ప్రజ్ఞ ఉన్న ఉత్కృష్టమైన గాయకుడు అన్నది అనుభవైక సత్యం. రఫీ అత్యున్నతమైన చలనచిత్ర నేపథ్య గాయకుడు. పర్వీన్ సుల్తానా వంటి హిందూస్థానీ శాస్త్రీయ సంగీత గాయకులు సైతం రఫీని ఉన్నతమైన గాయకునిగా ప్రశంసించారు. 2012లో ఇంగ్లిష్ న్యూస్ చానల్ CNN IBN దేశంలోనే గొప్ప గాత్రం ఏదని దేశవ్యాప్త బహిరంగ అభిప్రాయ సేకరణ జరిపితే రఫీని దేశం ఎన్నుకుంది. రఫీ 1980లో మరణించారు. ఆయన పోయిన 32 ఏళ్ల తరువాత కూడా దేశం ఆయన్ను గొప్ప గాయకునిగా నిర్ణయించింది! అదీ రఫీ. అదే రఫీ. (ఆ చానల్ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది రఫీ పోయాకే పుట్టుంటారు!)
Rounded even clear resonance voice ఆయనది. గండు తుమ్మెద ఝంకారం(honey- bee - buzz)లాంటి గాత్రం వారిది. అరుదైన, విశేషమైన గాత్ర సంపద ఆయనది. Verve ఉన్న గాత్రం ఆయనది. మనదేశంలో భావాన్ని దాటి మనోధర్మం (mood) గానం చేసిన తొలిదశ చలనచిత్ర గాన కళాకారుడు రఫీ. తలత్ మహ్మూద్ మనదేశానికి fine singing ను అందించారు. ఆ మూలకాన్ని అందిపుచ్చుకుని రఫీ super fine singing ను మనందరికీ అందించారు. దేశానికే ఆనందాన్నిచ్చారు. ఆయన తన తరువాత గాయకులందరికీ ఆదర్శమయ్యారు. శ్రేష్ఠమైన చలనచిత్ర గానానికీ రఫీ ఒక ఒరవడి. ఆయన చలనచిత్ర గానానికి బడి. రఫీ కన్నా ఉన్నతమైన చలనచిత్ర గాయకుడు మనదేశంలో ఆయన తరువాత రాలేదు. ఒక సందర్భంలో సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహ్మాన్ రఫీ లాంటి గాత్రం మనకిప్పుడు లేదు అని అన్నారు. మన్నాడే ఒక మహోన్నతమైన గాయకుడు. ఆ మన్నాడే ఒక సందర్భంలో తన రెండు కళ్లు మూసుకుని, ధ్యానంలో అన్నట్టుగా చెయ్యెత్తి రఫీ కన్నా ఉన్నతమైన గాయకుడు లేనే లేడు అని అన్నారు. రఫీ గాయకులకే గాయకుడు. Spirited and animated singing రఫీ చేసినది. మన ఘంటసాలకు రఫీలోని ఆ flavor పట్టుబడలేదు. గాయకులు పి.బి. శ్రీనివాస్, కె.జె. ఏసుదాస్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంలు రఫీని అవగతం చేసుకోగలిగారు. ఆ అభినివేశం ఈ ముగ్గురు గాయకుల గానంలో తెలియవస్తూంటుంది. అందుకే వాళ్లు ప్రాంతీయ ఎల్లలు దాటి గొప్ప గాయకులుగా రాణించగలిగారు. విశిష్టమైన గాయకులు మెహ్ది హసన్ కన్నా కూడా చలనచిత్ర గానం పరంగా రఫీయే గొప్ప!
రఫీ గాత్ర నైజం, గాన విస్తృతి, ప్రతిభా వైశాల్యం భారతదేశ చలనచిత్ర సంగీతాన్నీ, గానాన్ని ఎంతో పరిపుష్టం చేసింది. సంగీత దర్శకులకు దొరికిన వరం రఫీ. రఫీ లేకపోయి ఉంటే భారతదేశ చలనచిత్ర సంగీతం బాగా పరిమితమైపోయి ఉండేది. రఫీ ఉన్నందువల్లే నొ(నౌ)షాద్, శంకర్-జైకిషన్, మదన్‌మోహన్, రోషన్, ఎస్.డి. బర్మన్, ఆర్.డి.బర్మన్, కల్యాణ్‌జీ-ఆనంద్ జీ, ఒ.పి.నయ్యర్, సలీల్ చౌదరి, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ వంటి సంగీతదర్శకులు గానాద్భుతాల్ని సృష్టించగలిగారు. ఖయ్యాం, రవి, జయదేవ్, చిత్రగుప్త వంటి సంగీతదర్శకులకూ పెద్దగా రాణించని ఇఖ్బాల్ ఖురేషీ, గణేశ్, ఉషాఖన్నా, జి.ఎస్.కొహ్లీ, ఫ్రాంక్ ఫెర్నాండెస్, సి.అర్జున్, బాబుల్, దత్తారాం, స్నేహల్ భట్కల్, ఒమి-సోనిక్ వంటి ఇతర సంగీత దర్శకులకు కూడా కొన్ని పాటల్ని గొప్పగా పాడారు రఫీ.
రఫీ చలన చిత్ర గాయకుడవడానికి ముందు లాహోర్‌లో మెహ్‌ఫిళ్లలో పాడేవారు. తరువాత బొంబాయి చేరుకున్నారు. 1944లో పెహ్లేఆప్ అన్న సినిమాలో నొ(నౌ)షాద్ సంగీతంలో రఫీ తన తొలి హిందీ సినిమా పాట హిందూస్థాన్ కే హం మై, హిందూస్థాన్ హమారా పాడారు. ఇంతకు ముందు 1942లో లాహోర్ లో ఉంటున్నప్పుడే శ్యాంసుందర్ సంగీతంలో గుల్ బలోచ్ అన్న పంజాబీ సినిమాలో జీనత్ బేగంతో కలిసి గోరియా ని హీరియే ని అన్న పంజాబీ పాట పాడారు. ఆ సినిమా కూడా 1944లోనే విడుదలయింది. (ఈ పాట 78 Rpm రికార్డ్ వి.ఎ.కె. రంగారావు గారి దగ్గర ఉంది) ఈ పంజాబీ పాటే ముందు విడుదలయింది. దాని తరువాత రఫీ లాహోర్‌ను విడిచి బొంబాయి చేరుకున్నారు. రఫీ చేసిన తెలివైన పని పాకిస్తాన్ విడిపోయాక అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవడం. కొంతమంది కళాకారులు పాకిస్తాన్‌కు వెళ్లి వాళ్ల బతుకుల్ని పోగొట్టుకున్నారు.
అలనాటి గాయకులు, కె.ఎల్. సైగల్‌ను అనుసరించే వారు. కానీ రఫీపై మొదట్లో గాయకుడు జి..ఎమ్. దురానీ ప్రభావం ఉండేది. తర్వాత తలత్ మహమూద్ ద్వారా వచ్చిన మెరుగైన, తీర్చిదిద్దినట్టుండే (fine singing) గానాన్ని రఫీ ఆకళింపు చేసుకున్నారు. 1949లో వచ్చిన దులారీ సినిమాలో నౌషాద్ సంగీతంలో సుహానీ రాత్ ఢల్ చుకీ... పాటతో రఫీ super fine singing మొదలైంది. Intonation, modulation, mood, ఇవి గానంలో ఈ పాట ద్వారా భారతదేశంలో పొటమరించాయి. మామూలు రఫీ ఈ పాట తర్వాత ఉన్నతమైన గాయకుడు రఫీ అయ్యారు. ఆ తర్వాత వేలకొద్దీ పాటలు పాడారు రఫీ. తెలుగు, తమిళ, కన్నడ భాషలతో సహా ఇతర భారతీయ భాషల పాటలు పాడారు. రెండు ఇంగ్లీష్ పాటలు కూడా పాడారు. శంకర్-జైకిషన్ హిందీ సినిమాలకు చేసిన బాణీల్లో ఆ ఇంగ్లీష్ పాటలుంటాయి. రఫీ చివరి పాట లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతంలో ఆస్ పాస్ సినిమా (1981) లో తు కహీ ఆస్ పాస్ హె దోస్త్.
అన్నీ కలుపుకుని 5,200 పై చిలుకు పాటలు పాడారు రఫీ. (అన్ని వేలు, ఇన్ని వేలు అని మనం వింటున్నది తప్పు) గజళ్లు పాడారు. లలిత గీతాలు పాడారు. (సజ్జాద్ హుస్సైన్ సంగీతంలో రఫీ పాడిన ఒక అరుదైన హీర్ నా దగ్గర ఉంది) భజన్ లు పాడారు. నందలాల్ భజన్‌లు రఫీ చాలా గొప్పగా పాడారు. ఆ భజన్‌లను విన్న వాళ్లు కొందరు రఫీ పోయాక నేరుగా వైకుంఠానికి చేరతాడు అని అనుకునేవారట. ఎన్. టి. రామారావు సినిమా అక్బర్ సలీం అనార్కలి (1979)లో 'తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులాగా నవ్వుతుంటే ఏం చేయను' అన్న సి. నారాయణరెడ్డి తెలుగు గజల్‌ను రఫీ పాడారు. అనుభవించి పాడేవారు రఫీ. సాహిత్యంలో ఏముందో దాన్ని హృదయానికి తీసుకుని గాత్రం ద్వారా మేలైన గానంగా మలిచేవారు. తెలుగు ఆపై ఇతర భాషల పాటలు పాడుతున్నప్పుడు అవి తెలియని భాషలు కాబట్టి ఆ భాషల సాహిత్యం ఆయన హృదయంలోకి వెళ్లేది కాదు. అందువల్లే రఫీ పాడిన ఇతర భాషల పాటలు అంతగా బావుండవు.
Balance, స్వరసమం (తాళ సమం కాదు) రఫీ గానంలో విశేషాంశాలు. గాత్రాన్ని స్వరంలో నిండుగా నింపి స్వరాన్ని సంపూర్ణంగా అందించే వారు రఫీ. Intensity of renditon రఫీలో మరో విశేషాంశం. రఫీ గాత్ర , గానాలలో ఒక మార్మికమైన ఔన్నత్యం ఉంది. దైవీ గానం (divine singing) చేశారు రఫీ. Spirited - singing, animated - singing అన్నవి రఫీతోనే మొదలయ్యాయి మనదేశ చలన చిత్రాల్లో.
గండు తుమ్మెద ఝంకారంలా ఉంటుంది ఆయన గాత్రం అని చెప్పుకున్నాం. రోషన్ చేసిన బర్సాత్ కి రాత్ సినిమాలో జిందగీ భర్ నహీ భూలేగీ పాటలోనూ, విత్రలేఖా సినిమాలోని మన్ రే తు కా హే న ధీర్ ధరే... పాటలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. మరో ఉదాహరణ శంకర్ జైకిషన్ సంగీతం చేసిన సంగం సినిమాలో ఏ మేరా ప్రేమ్ పత్ర్... పాట. మరో ఉదాహరణ ఓ.పి. నయ్యర్ సంగీతంలో బహారే ఫిర్ భి ఆయేంగీ సినిమాలో ఆప్ కే హసీన్ రుఖ్ పె అజ్ నయా నూర్‌హై... ఇలా ఇంకొన్నీ ఉన్నాయి. అనుభూతి- గానం కదా రఫీ గానం... బైజుబావ్ రా సినిమాలో నౌషాద్ చేసిన (భగ్ వాన్) ఓ దునియా కే రఖ్ వాలే... పాట ఆయన అనుభూతి-గానానికి ఒక మేలైన మచ్చుతునక. ఒక కచేరిలో ఆ పాటను సినిమా కోసం పాడినదానికన్నా ఎక్కువ శ్రుతిలో పాడారట.
శంకర్ జైకిషన్ చేసిన బసంత్ బహార్ సినిమాలో దునియా న భాయే... అంటూ శాస్త్రీయ సంగీత ఫణితి రఫీ పాడింది అమోఘం. శంకర్ జైకిషన్ రాత్ ఔర్ దిన్ సినిమాలో చేసిన ఫూల్ సె చెహ్ రా పాట శాస్త్రీయ సంగీత ఛాయతో రఫీ పాడిన మరో అద్భుతం. ఇలా ఎన్నో పాటల్ని ఎంతో ఘనంగా పాడారు రఫీ.
1977లో హమ్ కిసీ సే కం నహి సినిమాలో ఆర్.డి. బర్మన్ సంగీతం లో పాడిన క్యాహువా తేరా వాదా పాటకు జాతీయ ఉత్తమ గాయకుడు పురస్కారాన్ని అందుకున్నారు రఫీ. 1948లో గాంధీ స్మారక గీతం పాడినందుకుగానూ అప్పటి ప్రధాని నుంచి రజతపతకం అందుకున్నారు. 1967లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు రఫీ. 1924 డిసెంబర్ 24 న పుట్టిన రఫీ 1980 జూలై 31 వెళ్లిపోయారు.
బాగా చిన్నప్పటి నుంచి నేను మహమ్మద్ రఫీ అభిమానిని. ఆయన గాత్రం, గానాల్ని విన్నప్పుడల్లా కాదు తలచుకున్నప్పుడల్లా నాకు పులకరింత వస్తూంటుంది. రఫీని విన్న తరువాత నేను ఎదుగుతున్న కొద్దీ ఎందరో దేశ దేశాల (అంతర్జాతీయ) గాయకుల్ని విన్నాను. 1920ల నాటి Paul Robeson నుంచీ ఈనాటి Ed Sheeran వరకూ వచ్చి నిలిచిన గానాన్ని వింటూ వస్తున్నాను. చాల మంది ఉన్నతమైన గాయకులకు నేను అభిమానిని. అయినా ఇప్పటికీ రఫీ అంటే నాకుండే పులకింత కాసింతైనా తగ్గలేదు. వయసుతో ఎన్నో మార్పులు వచ్చాయి నాలో. కానీ రఫీ విషయంలో నేను మారలేదు.
రఫీ వర్ధంతి సందర్భంగా వారినిలా స్మరించుకుంటున్నాను.
భారతదేశ చలనచిత్ర గానంలో రఫీ ఒక శకం. అద్భుతమైన, అపూర్వమైన, ఆశ్చర్యకరమైన, అమోఘమైన, అద్వితీయమైన, ఆనందమైన పాటగా మనసులో, మస్తిష్కంలో, మట్టిలో, మనలో నిలిచిపోయారు మొహమ్మద్ రఫీ.
రోచిష్మాన్
94440 12279