తొలి తెలుగు సినిమా పాట ఏదో తెలుసా?

by Ravi |   ( Updated:2024-07-15 09:42:46.0  )
తొలి తెలుగు సినిమా పాట ఏదో తెలుసా?
X

1931, అక్టోబర్ 31, శనివారం దీపావళి రోజున కాళిదాస్ సినిమా విడుదలైంది. ఈ కాళిదాస్ సినిమా తొలి తమిళ్ష్ & తెలుగు సినిమా. దక్షిణ భారతదేశ భాషల్లో తొలి టాకీ. (తమిళ్ష్‌ లో కాళిదాసా, తెలుగులో కాళిదాసు) ఈ సినిమాలో తమిళ్ష్ & తెలుగు సంభాషణలు, పాటలు ఉన్నాయి. ఈ సినిమాలో నాయిక టి.పి. రాజలక్ష్మి తమిళ్ష్ సంభాషణలు, నాయకుడు కంకాళ రావు తెలుగు సంభాషణలు చెబుతారు. ఇంపీరిఅల్ మూవీ టోన్ పతాకంతో ఈ సినిమాను నిర్మాత అర్‌దేశిర్ ఈరానీ నిర్మించారు. సినిమాకు దర్శకుడు హెచ్.ఎమ్. రెడ్డి.

తమిళ్ష్‌తో తీద్దామనుకుని..

ఆలమ్ ఆరా 1931లో మనదేశంలో వచ్చిన తొలి టాకీ. ఈ సినిమా నిర్మాత అర్‌దేశిర్ ఈరానీ ఆలమ్ ఆరా తరువాతి ప్రయత్నంగా ఈ కాళిదాస్ తమిళ్ష్-తెలుగు సినిమాను నిర్మించారు. మొదట్లో తమిళ్ష్ సినిమాగా తీద్దామనుకున్నారు. కానీ నాయకుడి పాత్ర చేసిన తెలుగు వ్యక్తి కంకాళ రావుకు తమిళ్ష్ ఉచ్చారణ రాకపోవడంవల్ల అతడి సంభాషణలు తెలుగులో ఉండేట్టు చేశారు. ఈ కాళిదాస్ సినిమాలో రెండు తెలుగు పాటలు ఉన్నాయి. ఆరు తమిళ్ష్ పాటలు ఉన్నాయి. తమిళ్ష్ పాటలను బాస్కర దాస్ రాశారు. తెలుగు పాటలు ఎవరు రాశారో తెలియ రాలేదు.

పాటే చరిత్రను పట్టించిందా?

ఈ సినిమా విషయంలో ఉన్న ఒకే ఒక్క ఆధారం, ఋజువు ఈ సినిమా పాటల పుస్తకం మాత్రమే. ఆ పాటల పుస్తకంలో పాటల రచయిత పేర్లు, ఇతర వివరాలు పొందుపర్చలేదు. ఈ సినిమాకు సంబంధించిన పాటలు రికార్డ్‌లపై రాలేదు. కాళిదాస్ సినిమాలో నాయకుడు పాత్రధారి పీ.జీ. వెంకటేసన్ అని వికీపీడిఅ తెలియజేస్తోంది. ఆ సమాచారం తప్పు. ఆక్స్‌ఫడ్‌ ఎన్‌సైక్లోపీడిఅ ఆవ్(ఫ్) ఇండిఅన్ సినిమా పుస్తకం కూడా ఈ సినిమా నాయకుడు వెంకటేసన్ అన్న పెనుదోషాన్నే చెబుతోంది. పీ.జీ. వెంకటేసన్ ఈ సినిమాలో ఒక సహాయక పాత్ర చేశారు. నాయకుడుగా కాదు. పైగా పీ.జీ. వెంకటేసన్ తమిళ్ష్ వ్యక్తి, తమిళ్ష్ గాయకుడు కనుక ఆయనకు తమిళ్ష్ రాకపోవడం అన్న సమస్య ఉండదు.

ఈ కాళిదాస్ సినిమాలో 4వ పాట తెలుగు పాట. అదే తొలి తెలుగు సినిమా పాట. ఈ పాట

పల్లవి: ఎంతరా నీదాన ఎందు పోదునే

చింత విడువజాల శ్రీరామ


అనుపల్లవి: అంతకారుని చెంత చేరితిని

మందుడై, చేకొనగ లేదా


చరణం: జేష్టుడు శివునికి పూజ్యుడు లక్ష్మణా

దేహియై కొలువ లేదా

కాళిదాస్ సినిమాలో 7వ పాటగా మరో తెలుగుపాట చోటు చేసుకుంది. ఆ పాట


పల్లవి: సుర రాగ సుధా రసయుక్త

భక్తి స్వర్గ భావనమురా ఓ మనసా


అనుపల్లవి: పరమానందమనే సుమములపై

ఒక భేదము తేవకే ఓ మనసా


చరణం: మూలాధారాన మాత మేరువుడై

ముదంబున మోక్షమురా

కోలాహల సప్తస్వర శుకముల

గురుతే మోక్షమురా ఓ మనసా

తమిళ్ష్ లిపిలో తెలుగుపాట

పాటల పుస్తకంలో తమిళ్ష్ లిపిలో ఉన్న తెలుగు పాటలు ఇవి. సినిమాలో పాడబడిన తెలుగు వినిపించినంత మేరకు తమిళ్ష్ లిపిలో నమోదు చెయ్యబడింది. భాష నైజం కారణంగా తెలుగు పదాలు తమిళ్ష్ భాషలో సరిగ్గా ఆమరే అవకాశం లేదు. తమిళ్ష్ లిపిలో ఉన్న ఈ తెలుగు పాటలు సరిగ్గా లేవు. ఇక్కడ ఈ వ్యాస రచయిత సినిమా పాటల పరిశీలకుడు వోలేటి శ్రీనివాసభానుతో కలిసి వీలైనంత మేరకు సాహిత్యాన్ని పసిగట్టడం జరిగింది. ఈ ప్రయత్నంలో సాహిత్యపరంగా కచ్చితత్వం సాధ్యపడలేదు.

పాక్షిక తెలుగు టాకీ సినిమా

1932 ఫెబ్ర్అరి(ఫిబ్రవరి) 6న సంపూర్ణమైన తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద విడుదలయింది. ఆ సినిమాలోని పాట "వింతాయెన్ వినన్ సంతసమాయెనుగా దేవేంద్ర, సంతసమాయెనుగా సురనాథా..." తొలి తెలుగు సినిమా పాటగా పరిగణించబడుతోంది. ఈ భక్తప్రహ్లాద సినిమా కన్నా ముందు 1931, అక్టోబర్ 31, శనివారం దీపావళి రోజున విడుదలైన కాళిదాస్ పాక్షికంగా తొలి తెలుగు టాకీ ఔతుంది. ఈ కాళిదాస్ సినిమాలో వచ్చిన తెలుగు పాటలు తొలిసారిగా తెలుగులో వచ్చిన సినిమా పాటలు ఔతాయి. వాటిల్లో "ఎంతరా నీదాన ఎందుపోదునే..." పాట సినిమాల్లో వచ్చిన తొలి తెలుగు పాట లేదా తొలి తెలుగు సినిమా పాట ఔతుంది.

గమనిక: తొలి తెలుగు సినిమా పాట విషయంలో ఈ సరైన ఆవిష్కారానికి తిరుగులేని ఆధారంగా పాటల పుస్తకాన్ని అందించినవారు 83 ఏళ్ల చెన్నై వాస్తవ్యులు టి. సంతాన కృష్ణన్. సంతాన కృష్ణన్ సినిమా పాటల పరిశోధకుడు, చరిత్రకారుడు. తెలుగు సినిమా పాట తరపున మనసా, వాచా ఆయనకు కృతజ్ఞత. గమనిక: ఆక్స్‌ఫడ్‌ ఎన్‌సైక్లోపీడిఅ ఆవ్(ఫ్) ఇండిఅన్, ఇంపీరిఅల్, తమిళ్ష్, వికీపీడిఅ, ఆలమ్ ఆరా, అర్‌దేశిర్ ఈరానీ వంటి పదాలను ఇంగ్లిష్, తమిళ్ అసలు ఉచ్చారణ ప్రకారం తీసుకోవడమైనది.

రోచిష్మాన్

94440 12279

Advertisement

Next Story

Most Viewed