సంస్మరణ:తెలంగాణ పోరు బిడ్డ 'ఠాణు'

by Ravi |
సంస్మరణ:తెలంగాణ పోరు బిడ్డ ఠాణు
X

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం' అంటూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయం అది. ఈ పోరాటంలో లంబాడీల పాత్ర కూడా వీరోచితమే. పోరాటం జరుగుతున్న సమయంలో రజాకార్లు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఉద్యమకారులు ఊరికి దూరంగా ఉన్న లంబాడి తండాలలో తలదాచుకునేవారు. లంబాడీలు సైతం ఉద్యమకారులకు అండగా నిలిచి ఆశ్రయం కల్పించేవారు. ఉద్యమకారుల జాడ వెతుక్కుంటూ రజాకార్లు, పోలీసులు తండాలపై దాడి చేసి లంబాడీ మహిళలను, పిల్లలను నానా రకాలుగా హింసించేవారు. వారి భయానికి పురుషులు అడవిలో దాక్కునేవారు. ఎంత హింసించినా ఉద్యమకారుల జాడ మాత్రం చెప్పేవారు కాదు. ఆ జాతికి చెందినవాడే తెలంగాణ విముక్తి పోరాట యోధుడు ఠాణునాయక్.

దొరల దోపిడీకి వ్యతిరేకంగా

నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా, నేటి జనగామ జిల్లాలోని విసునూరు గ్రామానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మాపురం పరిధి పడమటి తండాలో హాము, మంగ్లీబాయి దంపతులకు నాలుగవ సంతానంగా జాటోత్ ఠాాణు నాయక్ జన్మించాడు. జాటోత్ హాము నాయక్ ఆధ్వర్యంలో పడమటి తండా లంబాడీలు దాదాపు ఎనభై ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఠాణునాయక్‌తోపాటు కుటుంబంలోని మహిళలు, చిన్న పిల్లలు సైతం తమ వంతు పాత్ర పోషించారు.

ఠాణునాయక్ మాతృమూర్తి ధీశాలి మంగ్లీబాయి కారం పొడి, రోకళ్లను ఆయుధాలుగా మలుచుకొని రజాకార్లను తండా నుంచి తరిమి కొట్టింది. దీంతో ఆగ్రహం చెందిన పోలీసులు, గుండాలు కలిసి ఠాణునాయక్ కుటుంబాన్ని అంతం చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ, విఫలమయ్యారు. చివరికి ఠాణునాయక్ మూడవ అన్న సక్రు నాయక్ గుండాలకు పట్టుబడ్డారు. ఆయనను జైలులో వేసి నరకయాతన చూపించి, చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దోడైనా జోద్యా నాయక్, కొద్దిరోజులలో రెండో అన్న సోమ్లా‌నాయక్‌ను రజాకార్లు పట్టుకొని చిత్రహింసలు పెట్టారు. అయినా ఠాణునాయక్, వారి కుటుంబ సభ్యులు అదరక, బెదరక కష్టనష్టాలకు సైతం లెక్కచేయక రైతాంగ పోరాటానికి అండగా నిలిచారు.

వెంటాడి, వేధించి, చంపి

జనగామ తాలూకాలో విస్నూరు రామచంద్రారెడ్డి, పుస్కూర్ రాఘవరావు, కడారి నరసింహారావు, బాబు దొర వంటి భూస్వాములు ఈ ప్రాంత ప్రజలను పీడించేవారు. దొరల దోపిడీకి వ్యతిరేకంగా లంబాడీలు ఏకం కావడం, నిజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరు సాగించడంతో వీరిని అణిచివేయడానికి నిజాం సైన్యాలు, రజాకార్లు, పోలీసులతో కలిసి దొరలు కుట్రలు పన్నారు. పోరాటానికి దన్నుగా ఉన్న అత్యంత ధైర్యశాలి, బలవంతుడు అయిన ఠాణునాయక్‌ను సజీవంగా బంధించేందుకు గాలింపు ముమ్మరం చేశారు. అయినా, అతని జాడ తెలుసుకోలేకపోయారు.

చివరికి ఓ ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు జాటోత్ ఠాణునాయక్ మొండ్రాయి సమీపంలోని నీలి బండ తండాలో శత్రువుల చేతికి చిక్కాడు. వారు ఠాణునాయక్‌ను విపరీతంగా హింసించారు. ఆయన అన్నింటిని ఓర్చుకున్నాడు ఠాణు ధైర్యం సైన్యాధికారులకు అబ్బురపరిచింది. అలా హింసించి, హింసించి ఆయనను రామవరం దేశ్‌ముఖ్ కఠారు నర్సింగరావు ఎడ్లబండికి కట్టించి, ఈడ్చుకుంటూ వచ్చి తండావాసులు చూస్తుండగా ఠాణునాయక్‌ను 1950, మార్చి 20వ తేదీన కాల్చి చంపారు. అలా ఠాణునాయక్‌ ఓ గొప్ప వీర పోరాట యోధుడిగా వీర మరణం పొందాడు. ఆయన తమ్ముడు దర్గ్యా, మరో పోరాటయోధుడు నల్లా నరసింహులను ఓ కేసులో అరెస్టు చేసి మరణ శిక్ష విధించారు. అది యావజ్జీవ కారాగార శిక్ష గా మార్చబడింది.

(నేడు జాటోత్ ఠాణు నాయక్ 72వ వర్ధంతి)

లకావత్ చిరంజీవి నాయక్

కేయూ, వరంగల్

99630 40960



Next Story