పత్తాలేని స్వామిత్వ పథకం!

by Ravi |   ( Updated:2024-07-31 00:30:14.0  )
పత్తాలేని స్వామిత్వ పథకం!
X

ఈ పథకం ద్వారా గ్రామకంఠంలో (ఆబాది) ఉన్న ఇళ్లను అన్నింటినీ, వాటి చుట్టుపక్కన ఉన్న ఖాళీ స్థలాలనూ కొలిచి పక్కాగా మ్యాప్ రూపొందించి వ్యవసాయ భూములకు పట్టా పాస్ బుక్‌లు ఉన్నట్టే యజమానుల గృహాలకు కూడా పట్టాలు ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. దీనివలన గ్రామకంఠంలో ఉన్న ఆస్తి తగాదాలు తొలగిపోయి యజమానులకు పూర్తి ఆస్తి హక్కులు, పట్టాలు పొందడం వలన ఆ ఆస్తి పట్టాల ద్వారా బ్యాంకులో లోన్లు కూడా సులభంగా పొందొచ్చు.

నేటికీ నిజాం కాలం సర్వేనే..

దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం సమగ్రంగా అమలు జరుగుతుంది. తెలం గాణలో కూడా పైలట్ ప్రాజెక్టు కింద గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా "ఇంటింటి సర్వే" పేరుతో కామారెడ్డి, ఆదిలాబాద్, జనగామ, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాలలో చేపట్టి తూతూ మంత్రంగా సర్వే చేశారు. వ్యవసాయ భూముల సమగ్ర భూ సర్వే (డిజిటల్ ల్యాండ్ సర్వే) మాదిరిగా ఈ స్వామిత్వ పథకాన్ని కూడా గత ప్రభుత్వం అటకెక్కించడంతో గ్రామకంఠం భూములలో ఇప్పటికీ అనేక భూ సమస్యలు ఉన్నాయి.

నిజాం కాలంలో సర్వే చేసి గీసిన గుండమే ఇప్పటికీ గ్రామకంఠంగా ఉన్నది. కానీ ఆ పరిధి దాటి వ్యవసాయ భూములలో అనేక గృహాలు వెలిశాయి. గ్రామ పరిధి విస్తరించింది. నాలా కన్వర్షన్ చేయకుండానే వ్యవసాయ భూములలో బీడి కార్మికులకు గత ప్రభుత్వాలు గృహ నిర్మాణం కోసం ప్లాట్స్ కేటాయించారు. ధరణి పోర్టల్ పుణ్యమా ఇప్పటికీ అవి మళ్లీ అగ్రికల్చర్ భూములుగా పట్టాలు, ఆపైన రైతుబంధు కూడా వచ్చి అనేక వివాదాలకు ఆజ్యం పోశాయి. గ్రామకంఠంలో ప్రభుత్వ భూములకు ఇప్పటికీ రక్షణ లేదు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.

ప్రజాస్వామ్య దేశం పార్లమెంటరీ వ్యవస్థలో ద్వంద్వ (కేంద్ర - రాష్ట్ర) ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలకు పోకుండా ప్రజా ప్రయోజనాలు ఉన్న పథకాలు రూపొందించి అమలు చేయాలి. కానీ తెలంగాణలో గత పదేళ్ల ప్రభుత్వ పాలనలో ఆ ధోరణి కనిపించలేదు. ప్రస్తుత ప్రభుత్వం అయినా ఈ పథకాన్ని అమలు చేసి గ్రామీణ ప్రాంత ప్రజల ఆస్తులు సర్వే చేసి పకడ్బందీ ఆస్తి హక్కులు కల్పించాలి. అప్పుడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది.

బందెల సురేందర్ రెడ్డి,

మాజీ సైనికుడు

83749 72210

Advertisement

Next Story