- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అలా అయితేనే మనుగడ
అనంత విశ్వంలో భూమి మీద తప్ప మరో చోట జీవం ఉన్నట్లుగా ఇప్పటివరకు ఆధారాలు లేవు. భూమి మీద ప్రస్తుతం దాదాపు పది కోట్ల జాతుల జీవరాశులు ఉన్నాయని అంచనా. ఇప్పటివరకు 17 లక్షల జాతులను మాత్రమే మన శాస్త్రవేత్తలు గుర్తించారు. కోట్లాది జీవజాతులలో మూడింట రెండు వంతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. మానవ తప్పిదాలు, ఇతర కారణాలతో రోజురోజుకు అంతరించిపోయే జాతుల జాబితాలో నిత్యం కొత్తవి చేరుతున్నాయి.
జీవ జాతులు అంతరించిపోవడం అనేది మన ఉనికికే ప్రమాదం. ఎందుకంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ప్రాధాన్యం ఉంది. వీటిలో ఏ జాతి కనుమరుగు అయినా ఆహార గొలుసుకి విఘాతం కలిగి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అనేక జాతుల వినాశనానికి కారణమవుతాయి. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉన్న సమతుల్యతను కాపాడేందుకు జీవవైవిధ్యం ఎంతో అవసరం. పెరుగుతున్న జనాభా, కాలుష్యం, వాతవరణం, మనుషుల దురాశ వలన జీవవైవిధ్యానికి ముప్పు పొంచి ఉంది. అడవుల నరికివేత, మైనింగ్, రసాయన మందులు పర్యావరణం మీద ప్రభావం చూపుతున్నాయి. భూగ్రహం మీద మనుషులకే కాదు, పంచభూతాలకు, జీవజాతులకు హక్కు ఉంది. అందుకే ఐక్యరాజ్యసమితి 1993 నుంచి ఏటా మే 22 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 'జీవ వైవిధ్య దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. ఈ ఏడాది 'పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను పునరుద్ధరించుకోవడం' అనే థీమ్‌తో నిర్వహించుకోబోతున్నాం.
జనాభా పెరుగుదలతో
ప్రపంచ జనాభాలో ఆరో వంతు మన దేశంలోనే ఉంది. మన దేశ జనాభాలోనూ వైవిధ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జన్యుపరంగా, భాషాపరంగా, సాంస్కృతికపరంగా లెక్కగడితే సుమారుగా 133 కోట్లకు పైగా ఉన్న జనాభాలో 2 వేలకు పైగా వివిధ జాతులకు చెందిన వారున్నారు. వీరి భాషలు, మాండలికాలూ సుమారు 1,652 వరకూ ఉంటాయి. జీవవైవిధ్యపరంగా మన దేశంలో 350 క్షీరదాలు ప్రపంచంలో 7.6 శాతంగా, పక్షులలో 1,224 జాతులు 12.6 శాతంగా, 197 ఉభయచరాలు 4.4 శాతంగా, 408 రకాల సరీసృపాలూ 6.2 శాతంగా, 2,546 జలచరాలు 11.7 శాతంగా, 15,000 పుష్పజాతి మొక్కలు 6 శాతంగా, ఏషియా సింహం, బెంగాల్ పులి,రాబందులు మొదలైనవి 172 2.9 శాతంగా ఉన్నాయి. ఒకప్పుడు దట్టంగా ఉండే అడవులలో దాదాపు 45 శాతం ఇప్పటికే అంతరించిపోయాయి. పచ్చని మొక్కలు ఎక్కువగా ఉండి, వాటిని తినే జంతువులు, కీటకాలూ ఉండాలి. వీటిని తినే పెద్ద జంతువులూ ఉండాలి అప్పుడే ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది.
వృక్ష జాతులకూ ముప్పు
మొక్కలలో ప్రతి 27 సంవత్సరాలకు ఒక జాతి అంతరించిపోతోంది. సముద్రాల మధ్య ఉన్న ద్వీపాలలో సామూహికంగా అంతరించిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలలో అడవులను నాశనం చేయడం, మానవులు కొత్త భక్షక జీవులను ప్రవేశ పెట్టడం, కలుపు మొక్కల వలన ఈ తీవ్రత పెరుగుతోంది. 1600 వ సంవత్సరం నుండి 1900 సంవత్సర మధ్య కాలంలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక జాతి అంతరించిపోయిందని తెలుస్తోంది. 1900 సంవత్సరం నుంచి సగటున ఏటా ఒక జాతి అంతరించిపోతున్నది. గత 400 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 120 క్షీరదాల జాతులు, 225 పక్షి జాతులు అంతరించిపోయాయి.
ప్రపంచంలో కనిపించే వేర్వేరు మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు వాటిలో ఉండే జంతువులు, ఎడారులు, అడవులు, మెట్ట భూములు, కొండలు, కోనలు, సరస్సులు, నదులు, వాగులు, వంకలు, పంట భూములు, గాలి, నీరు, నేల అంతా జీవవైవిధ్యంలోని ముఖ్య భాగాలే. వీటన్నిటి మధ్య ఉండే సమన్వయం ఫలితంగా మానవజాతి ప్రశాంతంగా పురోగమిస్తుంది. ఓజోన్ పొర ఒక గొడుగులా మనలను కాపాడుతుంది. ఇది బలహీనమవడంతో ప్రకృతిలో ఎన్నో ప్రమాదకర మార్పులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఓజొన్ పొర దెబ్బ తినకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి. వన్యప్రాణులను, సమస్త జీవ జాతులనూ ఆదరించాలి. చెరువులు, నదులు, అడవులు సహా సహజ పర్యావరణాన్ని కాపాడుకోవాలి.
(నేడు ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం)
నరేందర్ రాచమల్ల
99892 67462