- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఫిరాయింపుల చట్టం అమలవ్వదా?
ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా వివిధ స్థాయిలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. రాజకీయ పార్టీల ద్వారానే ఎన్నికల ప్రక్రియ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది. ఒక రాజకీయ పక్షం తరఫున ఎన్నికైన శాసన సభ్యులు అధికారం కోసం రాజకీయ విలువలు పాటించకుండా అవకాశవాదంతో పార్టీలను తరచుగా మారడం ఫిరాయించడం వల్ల రాజకీయ అస్థిరత్వం, ప్రజాభిప్రాయం వమ్ము కావడం జరుగుతుంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో అనేక ప్రయత్నాలు జరిగాయి.
అధికారంలో ఉన్న పార్టీలోకి..
2014లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీ, బీఎస్సీ, టీడీపీ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. నాటి ఆ పార్టీల పరిస్థితే నేటి బీఆర్ఎస్ పార్టీకి ఎదురైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 119 నియోజక వర్గాలలో కాంగ్రెస్ 65 స్థానాలు, బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలవగా కంటోన్మెంట్ స్థానం ఖాళీ అవ్వడంతో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. జూన్- జూలై మాసంలో మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించినది. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఎమ్మెల్యేలే కాక ఎమ్మెల్సీలు ఆరుగురు ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ నాయకులందరూ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీలో ఉండాలని ఆర్థికపరమైన పనుల కొరకు, ఆస్తుల రక్షణ, వివిధ కారణాలతో తమ కింది స్థాయి కార్యకర్తల అభిప్రాయం సేకరించకుండానే పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది.
పార్టీ ఫిరాయింపుల చట్టం
1967వ సంవత్సరంలో నాలుగవ లోకసభలో పెండేకంటి వెంకటసుబ్బయ్య మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల చట్టంపై ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. 1985వ సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టం రూపొందించడం జరిగింది. దీనిని 10వ షెడ్యూల్లో చేర్చిరు. 2003వ సంవత్సరంలో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని సవరణలతో 2004 నుండి ఈ చట్టం అమలులోకి వచ్చింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక రాజకీయ పార్టీలో మొత్తం శాసన సభ్యులలో 2/3వ వంతు సభ్యులు వేరుపడి మరొక పార్టీలోనికి చేరినా, స్వతంత్రంగా వేరొక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నా.. అలాంటి వారికి ఈ చట్టంలోని అనర్హతలు వర్తించవు. అయితే, లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ స్పీకరు, రాష్ట్ర విధానసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్, విధాన పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లు తమ పదవికి రాజీనామా చేసినా లేదా పదవీకాలం ముగిసిన తరువాత వేరొక పార్టీలోకి చేరినప్పటికీ వారి సభ్యత్వం రద్దు కాదు. ఈ ఫిరాయింపులను ఫ్లోర్ క్రాసింగ్, కార్పెట్ క్రాసింగ్, పార్టీ హాపింగ్, వాకా జంపింగ్ అని కూడా అంటారు.
ఈ చట్టంలోని లోపాలు, ప్రయోజనాలు..
ఈ చట్టం ద్వారా రాజకీయ సుస్థిరత సాధించవచ్చు, అవకాశవాద, అధికారిక పూరిత రాజకీయాలను అరికట్టవచ్చును. రాజకీయ పార్టీలలో అవినీతి అనైతిక ప్రవర్తనలను దీని ద్వారా నిరోధించవచ్చు. లోపాల విషయానికి వస్తే ఈ చట్టం సభ్యుల స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ, నిరసన హక్కును హరిస్తుంది. సభాధ్యక్షుల నిర్ణయం రాజకీయ పక్షపాతంతో కూడుకొని ఉండవచ్చు. మూకుమ్మడి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. సభాధ్యక్షులు పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులు వచ్చినప్పుడు తమ నిర్ణయాన్ని వెలువడకుండా మితిమీరిన కాలయాపన చేస్తున్నారు.
కోర్టు తీర్పు కేశం మేఘ చంద్ర సింగ్, సచిన్ పైలెట్ కేసు 2020 పార్టీ ఫిరాయింపుల చట్టంలో సభాధ్యక్షులు పార్టీ ఫిరాయింపు అనర్హత ఫిర్యాదులపై మూడు నెలల్లో తమ తీర్పు చెప్పాలని, నిర్ణయించి అధికారాన్ని సభాధ్యక్షులు కాకుండా స్వతంత్ర ట్రిబ్యునల్‌కి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా వెల్లడించింది. అయితే తెలంగాణలో నేడు విచ్చలవిడిగా జరుగుతున్న ఫిరాయింపుల పర్వాన్ని అడ్డుకునే శక్తి ఫిరాయింపుల చట్టానికి ఉందా అనేది పెద్ద ప్రశ్న.
డా.తూము విజయ్ కుమార్
94927 00653
- Tags
- defection law