పురుషులది ఇంత చీప్ మెంటాలిటీనా?

by Ravi |   ( Updated:2024-08-02 01:16:23.0  )
పురుషులది ఇంత చీప్ మెంటాలిటీనా?
X

ఒక పాకిస్తాన్ సంతతి అమెరికన్ యువతి, తన విడాకులపై బహిరంగంగా సంబరాలు చేసుకోవడం దక్షిణాసియా వ్యాప్తంగా వాదవివాదాలకు, భూషణ, దూషణలకు దారితీసింది. ఈ మధ్య ఆడవాళ్లు ఉద్యోగాలు 'వెలగబెడుతున్నారట', అందుకనే మగపిల్లలకి కష్టాలు. వాళ్ల తల్లిదండ్రులకి బాధలు, అణుకువ లేని ఆడపిల్లల తల్లిదండ్రులు. పిల్లలు వద్దనుకుని ఇప్పటి అమ్మాయిలు బరితెగించడం... అంటూ దారుణమైన భాషను వాడుతూ ఆమెను దూషిస్తున్నారు. అమ్మాయిల సాధికారత పట్ల, తమ కాళ్లపై తాము నిలబడగలిగిన వారి ఆత్మస్థైర్యం పట్ల విపరీతమైన అక్కసుతో వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్, పాక్ వంటి దేశాల్లో ఇంత విషపూరితమైన పురుషులు ఉన్నారా? అని ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది.

shehroz అనే పాకిస్తా‌న్ మూలాలున్న అమెరికా యువతి. వయసు 32 ఏళ్లు. పూర్తి పేరు షెహ్రోస్ నూర్ మొహమ్మద్ అమెరికాలో స్టోర్ నడుపుతున్నారు. మిస్ సౌత్ ఏషియా వరల్డ్ 2024 పోటీని గెలుచుకున్న ఘనత ఆమెది. తొమ్మిదేళ్లుగా తాను భరించిన వైవాహిక బంధం నుండి, విడాకుల ద్వారా విముక్తి పొంది.. డైవోర్స్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ వీడియోలో ఆమె అమెరికాలో జరిగిన “విడాకుల పార్టీ”లో బాలీవుడ్ పాటకు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. 'మీ విడాకులకు అభినందనలు' అంటూ ఆ పార్టీలో బెలూన్‌లు కూడా వేలాడ దీశారు. దాంతో షెహ్రోస్ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో భారతీయ, పాకిస్తానీ పురుషులు వికృతమైన కామెంట్లు చేశారు. ఈ యువతి ఎంత వేదన అనుభవించిందో కనీస ఊహ కూడా లేని వాళ్లు.. అనామకులు ఆమెపై బూతులతో కామెంట్ల దాడి మొదలుపెట్టారు. వాస్తవానికి షెహ్రోస్ ఇంతవరకూ ఎప్పుడూ పాకిస్తా‌న్‌లో కనీసం అడుగుపెట్టలేదు. తనపై కామెంట్ల దాడిని భరించాక, భారత్, పాక్ పురుషుల్లో ఇంత వెనుకబడిన మనస్తత్వాన్ని ఊహించలేదని ఆమె ఆశ్చర్యపోయింది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పురుషులు ఎవరు అంటే భారతీయ మగాళ్లే అని అంటున్నారామె.

వదిలించుకున్న వాడు లక్కీ పర్సనా?

షెహ్రోస్ తన విడాకులపై సంబరాలను జరుపుకున్నందుకు దక్షిణాసియా వ్యాప్తంగా పలువురు విమర్శించారు. వెక్కిరించారు. దూషించారు. బూతులతో సత్కరించారు. “మీరు విడాకుల వేడుకలు ప్రారంభిస్తే, ప్రజలు పెళ్లి చేసుకోవడానికి భయపడతారని, గర్వించదగిన ఒంటరి తల్లుల సంఖ్య ఇప్పటికే పెరుగుతోంది. పిల్లలకు తండ్రి లేకపోవడం బాధాకరం, ”అని రాశారు. 'ఆమెను విడిచి పెట్టిన వ్యక్తికి చాలా అభినందనలు' అని ఒకరు వ్యాఖ్యానించారు. 'ఆమెను వదిలించుకున్న వ్యక్తి ఎంత అదృష్టవంతుడు' అని మరొకరు రాశారు. 'ఆడవాళ్లకు విడాకులు ఆటలాగా తయారయ్యాయి, ముప్పై ఏళ్ల దాకా ఉద్యోగాలు చేసుకుంటూ స్వేచ్ఛగా ఉన్నవాళ్లు పెళ్లిళ్లలో ఇమడలేరు' అని మరొకరు విషం కక్కాడు.

శిక్షించే అధికారం మీకెవరిచ్చారు?

విమర్శలకు ప్రతిస్పందనగా షెహ్రోస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస కథనాలను పోస్ట్ చేసింది. స్త్రీలపై హింసకు పాల్పడటానికి పురుషులను అనుమతించే శిక్షా సంస్కృతిని దుయ్యబట్టింది. 'ఇస్లాం పేరుతో తమ భార్యలను, సోదరీమణులను, కుమార్తెలను చంపడాన్ని ప్రశం సించే దేశంలోని పురుషుల నుండి ఈ వ్యాఖ్యలు రావడం హాస్యాస్పదంగా ఉంది' అని ఆమె రాసింది. 'మీరు వాచ్యంగా ఒక స్త్రీని దయనీయంగా చూస్తారు, కొట్టడం, వేధించడం, దుర్వినియోగం చేయడం, హింసించడం మీకు సహజమైన విషయాలు' అని పేర్కొంది.

సంబరాలు చేసుకుంటేనే మారతారు..

నేను ఎన్నో ఎదురుదెబ్బలను అధిగమించానని, దుర్వినియోగ వివాహాల నుండి బయటపడటానికి తన వీడియో మరింత మంది మహిళలను ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నానని షెహ్రోస్ ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడాలని ఎక్కువ మంది సంబరాలు చేసుకోవడం ప్రారంభిస్తే, అది సంబంధం అయినా, ఉద్యోగం అయినా లేదా వివాహం అయినా ఈ రకమైన ఆలోచనలు మారవచ్చని నేను భావిస్తున్నాను. నేను ఎదురుదెబ్బలు తిన్నాను. అయితే ఇతర వ్యక్తులు బయటకు వచ్చి ఈ రకమైన ఉద్యమంలో పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను’ అని ఆమె మీడియాతో చెప్పారు.

మహిళ విడాకులకు కారణమెవ్వరు?

ప్రతికూల వ్యాఖ్యలు ఉన్నప్పటికీ, షెహ్రోస్‌కి మహిళల నుండి బారీ మద్దతు లభించింది. ఆమె చేసిన వ్యాఖ్యను పలువురు మహిళలు సమర్థించారు. మహిళలు చీటికీ మాటికీ, ప్రతి చిన్నకారణానికి ప్రస్తుతం విడాకులు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ఎవరికీ రక్షణ కల్పించని, అందించని, మంచి చేయని, అహంభావాన్ని పెంచి, స్త్రీల పట్ల ద్వేషాన్ని పెంచుకునే ఈ మురికి, అసహ్యకరమైన, దుర్భాషలాడే పురుషులే ఈ రోజుల్లో విడాకులు తీసుకోవడానికి కారణం అని ఒక మహిళ పేర్కొన్నారు. ఎక్కువ మంది వ్యక్తులు బయటకు వచ్చి, 'ఆంక్షలు లేని' సంబంధాలకు మద్దతు ఇవ్వాలి. ఉన్నత స్థాయిని అందుకోవడానికి మహిళలు చేసే ప్రయత్నాలను అడ్డుకునే దేని నుండి అయినా బయటకు వెళ్లడం సరైందేనని తెలుసుకోవాలి' అని మరో మహిళ వ్యాఖ్యానించారు.

మగాళ్లు మారకపోతే.. అనుభవిస్తారు

ఈనాటి అమ్మాయిల తల్లిదండ్రులకు హ్యాట్సాఫ్. దయచేసి ఏది ఏమైనా మీ పిల్లలకు సపోర్ట్ సిస్టమ్‌గా ఉండండి. ప్రాణాలు పోవడం కన్నా, విడాకులు తీసుకోవడం బాధాకరం కానే కాదు. అమ్మాయిలను అత్తమామల సేవల కోసం పెళ్లి చేసుకోకండి. ఆమె చదువు, ఉద్యోగం, ఆమె కెరీర్ ఆమెకు ముఖ్యం.. పిల్లలు కావాలనుకున్నా, వద్దనుకున్నా పూర్తిగా ఆమె వ్యక్తిగతం. ముందు స్త్రీలను సాటి మనుషులుగా, వ్యక్తిత్వం ఉన్నవాళ్లుగా చూడడం నేర్చుకోండి.. భారతీయ, దక్షిణాసియా దేశాల పురుషుల, అబ్బాయిల తల్లిదండ్రులు తమ తిరోగమన మనస్తత్వం ఇంకా మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో ఇంకా అనుభవిస్తారు' అని షెహ్రోస్ ముక్తాయించారు. తన పోస్ట్‌లో వస్తున్న వికృతమైన వ్యాఖ్యలను చూస్తూ విసిగిపోయిన షెహ్రోస్.. Most Toxic men in the world అంటే Indian Men అని అంటున్నారు. మనం ఇకనైనా మారదామా?

ప్రత్యూష

79893 74301

Advertisement

Next Story

Most Viewed