- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మానవీయ విలువలతో కట్టిపడేసే చిత్రం
తెలుగు సినిమా పరిశ్రమ కలల్ని అమ్ముకుంటూ బతికేస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాలు.. సృజన మిస్సయిన కళ. పబ్లిసిటీ కోసం మరలా విపరీతమైన ఖర్చు.. నెలరోజుల హంగామా ఆ తర్వాత ప్రజలు మర్చిపోతారు. ఇలాంటి సినిమాల నేపథ్యంలో, ఒక తంగలాన్, ఒక 35 చిన్న కథ కాదు, ఒక వాళై నిరాశతో ఉన్న ప్రేక్షకులకు ఊపిరిని అందిస్తాయి. ఈ దారిలో వచ్చిన మంచి డబ్బింగ్ చిత్రం 'సత్యం సుందరం'.
పెళ్లిలో ముఖం చూపించేసి, గిఫ్ట్ ఇచ్చేసి రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చేస్తా అనుకొని అయిష్టంగానే స్వగ్రామానికి బయలుదేరిన సత్యం ఆత్మీయ బంధనాలలో ఎలా ఇరుక్కున్నాడు? ఆ ఆత్మీయ అనుబంధానికి ఎలా చలించిపోయాడు? ఈ చిత్రం చూస్తే తప్ప మనకి అర్థం కాదు.
చలింపజేసిన ఆత్మీయబంధాలు..
నగర జీవితాల్లో బిజీ అయిపోయిన మనిషి, మెల్లమెల్లగా నాటకీయతలకు అలవాటు పడిపోయిన మనిషి ఆత్మీయత అనేది ఒకటి ఉందని మరిచిపోయే వింత పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. మనిషిలోని మనిషి కనిపించడం లేదు. మనిషి తప్పిపోయాడు అనే పోస్టర్ అల వాటు అయింది. డబ్బు తప్ప, సంపద తప్ప నాలుగైదు ప్లాట్లు తప్ప, విలాసాలు తప్ప కుటుంబ బంధాలూ, బాంధవ్యాలూ, ఆత్మీయతలూ మరి ఇంకేమీ అవసరం లేని ఒక కొత్త రకమైన జీవితం ఈ ప్రపంచీకరణ మనకు అందించింది. ఏదో ఒకరకంగా నైతిక విలువలను గాలికొదిలేసి ధనం పోగు చేసుకోవడం, విపరీతంగా ఆ డబ్బును ప్రదర్శన చేయడం..ఇలా సంతృప్తి, సౌందర్యం లేని, అసహజమైన జీవిత విధానం అలవా టు చేశారు పెట్టుబడిదారులు. ఫలితంగా, సున్నితమైన మానవ సంబంధాలు మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. ఆ ర్థిక సంబంధాలు వాటిమధ్యకి జొరబడ్డాయి. మొత్తం మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేశాయి. డబ్బు విలువల ముందు అన్నీ బలాదూర్. విజయానికి కూడా నిర్వచనాలు మారిపోయాయి. ఎంత పోగేసుకుంటే అంత గొప్పవాడు. ఎన్ని తప్పుడు పనులు చేస్తే అంత గొప్పవాడు. ఇలా తప్పుడు విలువలు నిజమైన విలువలుగా యువతకు అందుతున్నాయి. ఇందులో కూడాఆనందం దొరక్క చివరికి సారాయి, మత్తు మందు, పోర్న్ కూడా దరికి చేరింది.
సత్యం ఎదుర్కొన్న 'సత్యం' ఇది కాదు
అత్యంత మానవీయ అనుబంధాలతో కట్టిపడేసే పలకరింపులను సత్యం ఎదుర్కొంటాడు. తనను అంతగా ఆరాధించే, తనను బావా అని ప్రేమతో పిలుస్తూ గుండె ను తడిచేసే, అంతగా ప్రేమించే ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు గుర్తుకు రాడు. తమ కుటుంబం ఆస్తి తగాదాలతో ఆ గ్రామాన్ని శాశ్వతంగా విడిచిపెట్టినప్పుడు స్థలం చాల క తన సైకిల్ని అక్కడే విడిచి పెట్టేస్తారు. ఆ సైకి ల్ జ్ఞాప కాలు కూడా సత్యానికి గుర్తు లేవు. కానీ, సుం దరం ఆ సైకిల్ని అపురూపంగా చూసుకుంటాడు. అదే తన జీవి తాన్ని మార్చిందని అనుకుంటాడు. ఇది విని స త్యం నోట మాట రాదు. ఆ సైకిల్‌ను వారు ఆ రాత్రి నడు పుతూ అద్వితీయమైన ఆనందాన్ని అనుభవిస్తారు. రెండే రెండు పాత్రలతో చిత్రం మొత్తం ఎంత అద్భుతంగా నడుస్తుంది?
స్త్రీల పాత్రలకు ప్రణమిల్లాల్సిందే..!
మధ్య మధ్యలో అత్యంత ఆత్మీయతను అందించిన స్త్రీ పాత్రలు కనిపిస్తాయి. గొప్ప ప్రేమని వ్యక్తపరుస్తాయి. ఈ సినిమాలో తెలుగు సినిమాలలో ఉండే పెద్ద పెద్ద డైలాగ్స్ లేవు. మనం రియల్ లైఫ్‌లో ఎలా ఉంటామో, ఎంత సహజంగా మాట్లాడతామో, ఏ టోన్ లో మాట్లాడతామో ఇదీ అంతే. నగరాల్లో ఎంత డబ్బు సంపాదించినా ఈ ఆత్మీయతలు ఎక్కడ లభిస్తాయి? ఈ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఏ రెస్టారెంట్ లో, ఏ సినిమా హాల్లో ఇంత మహత్తరమైన మానవ ప్రేమ మనకు లభిస్తుంది?
భావోద్వేగాల పరాకాష్ట
సత్యం సుందరం ఒక మంచి చిత్రం. కుటుంబం మొత్తం చూడదగ్గ మానవతా విలువల్ని అర్థం చేసే మంచి చిత్రం. కొన్ని అసహజమైన సన్నివేశాలు విడిచి పెడితే... చిత్రం మనకు సమయం తెలీనివ్వదు.. ఆ ప్రేమలో, ఆ ఆత్మీయతల మధ్య మనం కూడా అలా వారితో పాటు నడుచుకుంటూ మైమరచి పోతాం. అరవింద్ స్వామి, కార్తీ నిజంగా నటనలో జీవం పోశారు. బావా అని అత్యంత ప్రేమతో వేల సార్లు పిలిచిన ఆ వ్యక్తి ఎవరు? ఆ ప్రేమ ఎవరిది? ఆ ఆత్మీయత ఎవరిది? సత్యంకు అర్థం కాదు.... అడగలేడు... ఫీలవుతాడని. ఆ భావంతో తను పరిగెత్తుకుంటూ పారిపోయినప్పుడు సత్యం పడ్డ మానసిక వేదన చూసి తట్టుకోలేకపోతారు ప్రేక్షకులు. ఇక చిత్రం చూడాల్సిందే.. ఉద్వేగాలను అనుభవించాల్సిందే.
సినిమా: సత్యం సుందరం
నిర్మాత: జ్యోతిక, సూర్య
దర్శకత్వం: సి. ప్రేమ్ కుమార్
స్ట్రీమింగ్ : నెట్‌ఫ్లిక్స్
కేశవ్
ఆర్థిక సామాజిక విశ్లేషకులు,
98313 14213