చేనేత: మన వారసత్వం.. మానవాళి వస్త్ర నాగరికత

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-06 23:16:13.0  )
చేనేత: మన వారసత్వం.. మానవాళి వస్త్ర నాగరికత
X

కంటికి ఇంపైన రంగురంగుల వస్త్రాలు, చీరలు, వాటిని నేసే నైపుణ్యం మన వారసత్వం, దేశానికి గర్వకారణం. చేనేత నిత్య సుందరం. నిత్య నూతనం. సంప్రదాయమే కాక, మారుతున్న అభిరుచులకి, జాతీయ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకి అనుగుణంగా తమ కళను, నైపుణ్యాన్ని మార్చుకుంటూ వస్తున్నారు చేనేత కళాకారులు. ఆగస్ట్ 7 చారిత్రాత్మకమైన రోజు, 1905లో ఆ రోజు కలకత్తాలో స్వదేశీ ఉద్యమo ప్రారంభమైంది, విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ, చేనేత మొదలైన దేశీయ ఉత్పత్తులను తిరిగి పునరుద్ధరించి, ప్రజలు భారతీయ జాతీయతను పెంపొందించుకోవాలన్నదే స్వదేశీ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. చేనేత పరిశ్రమకి ప్రభుత్వ చేయూతనందిస్తూ 2015 ఆగస్ట్ 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవం’ గా ప్రకటించింది.

చేనేత చరిత్ర

సింగారమనే దారంతో మగ్గంపై మమకారంతో నేసిన సిరిసిల్ల చీరలు. గొల్లభామ గోరంచు చీరలు, గద్వాల్ చీరలు, పట్టు పంచెలు, పోచంపల్లి పోగు చీరలు ,కొత్తపల్లి తువ్వాళ్ళు రాజోలీ రగ్గులు. వరంగల్ డర్రీలు వెంకటగిరి చేనేత వెలుగులు ధర్మవరం ధరల చీరలు మీ చేతి నుండి జాలువారిన చేనేత కళాఖండాలే మానవాళికి వస్త్రాన్ని అందించిన నాగరికత. ఆరు గజాల చీర నేసి అగ్గిపెట్టెలో అమర్చిన ఘనత వస్త్ర వైవిధ్యానికి, ఒడుపెరిగిన శ్రామికశక్తికి మమేకత. వస్త్ర వైభవానికి, నేతన్నల గౌరవానికి ప్రత్యేకత. భారత సంస్కృతీ సంప్రదాయాలకి నిలువెత్తు సమర్పిత స్వదేశీ ఉద్యమ చిహ్నంగా చరఖా నిలిచిపోయింది. స్వాతంత్య్ర ఉద్యమానికి ఖద్దరు ఇంధనమై ముందుకు సాగింది. చేనేత వృత్తి కాదు ఒక నినాదం.. మనం ధరించే వస్త్రం ఒక స్ఫూర్తి.. స్వదేశీ నినాదానికి ప్రతీక.. నలుమూలల ఎగిరే ఆత్మ గౌరవ పతాక..

అగ్గిపెట్టెపై ఆరుగజాల చీర

అగ్గిపెట్టే ఇమిడిపోయే ఆరుగజాల చీరను నేసిన కళానైపుణ్యం నేతన్నది. ప్రపంచానికి మగ్గంపై నేసిన అద్భుతాలను పరిచయం చేసిన ఘనత భారతీయ నేతన్న సొంతం. తరతరాలుగా చేనేత కుటుంబాలలో వారసత్వ కళగా ఇది కొనసాగుతోంది. కుటుంబ సభ్యులంతా కలిసి మగ్గాల మీద బట్ట నేస్తుండడం మనకు కనిపిస్తుంది. ప్రముఖ చేనేత కేంద్రాలలోని గ్రామాలలో, మొత్తం గ్రామప్రజలంతా నేతపనిలో నిమగ్నమై ఉంటారు. భారత దేశంలో దాదాపు 150 చేనేత కేంద్రాలు ఉన్నాయని అంచనా. ఉపాధి విషయంలో వ్యవసాయం తరువాత చేనేతది రెండవ స్థానం, కుటీర పరిశ్రమల కింద కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత పరిశ్రమ. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70లక్షల మందికి పైగా ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది, వీరు మగ్గాల మీద నేసిన వస్త్రాలు, దేశం మొత్తం వస్త్రాల ఉత్పత్తిలో 20% పైగా ఉంటాయి. ప్రపంచ చేనేత వస్త్రాలలో 90% పైగా భారతదేశంలో నేయబడతాయి. నూలు, కాటన్, సిల్క్, పట్టు, ఇతర సహజంగా ఉపలబ్ధమయ్యే నార, పీచులతో అద్భుతమైన వస్త్రాలు తయారు చేస్తారు మన చేనేత కళాకారులు. మన తెలుగు రాష్ట్రాల్లోనే 15కి మించి చేనేత కేంద్రాలు ఉన్నాయి.

ముఖ్యమైన సమస్యలు

చేనేత పరిశ్రమ సమస్యలు పవర్లూమ్ ఫ్యాక్టరీ ఉత్పత్తి మొదలైన తరువాత చేనేత పరిశ్రమ కుంటుపడింది. అనేక లోటుపాట్ల కారణంగా చేనేత కుటుంబాలకి గిట్టుబాటు ధర లభించట్లేదు. ముడి సరుకు అందుబాటులో లేకపోవడం – దారం, నూలు, చెట్ల పూల రంగులు కొనుగోలు చేయడానికి ఎంతో దూరాలు వెళ్ళాల్సిరావడం. ముడిసరుకు ధరలు పెరుగుదల, కాటన్, సిల్క్, జనప ధరలు పెరగడం; ఎరువులు పురుగు మందులు, రసాయనాల ధరలు పెరగడం వల్ల కాటన్ ధరలు విపరీతంగా పెరిగాయి. చేనేత రంగంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు లేవు. ఎన్నో ప్రాంతాల్లో పరిశ్రమ కనీసావసరాలైన స్థలం, నీళ్ళు, విద్యుత్తు కూడా అందుబాటులో ఉండవు. చేనేత పరిశ్రమ ఉత్పత్తులకు పేటెంట్ లేకపోవడం వల్ల రక్షణ లేదు, అన్ని సంప్రదాయ డిజైన్లు అనుకరించి నకళ్లు చేస్తున్నారు. నేతన్నకు, నేతన్నల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘శ్రీకారం చుట్టింది.. నేతన్నకు చేయూత నివ్వటం ద్వారా జిలుగు వెలుగుల చీర శిల్పం మళ్ళీ కొత్త సొగసులని సంతరించు కుంటుందని ఆశిద్దాం.

(నేడు జాతీయ చేనేత దినోత్సవం)

వి. సుధాకర్

99898 55445

Advertisement

Next Story