- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల మనిషి జనార్దన్ రెడ్డి
స్వాతంత్య్ర సమరయోధులు రాంమనోహర్ లోహియా భావజాలానికి ఆకర్షితుడైన సోషలిస్టు అతడు. దేశంలో సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చిన లోకమాన్య జయప్రకాష్ నారాయణ మార్గదర్శనంలో మరో సోషలిస్ట్ నేత జార్జిఫెర్నండెజ్‌తో కలసి నడిచిన ఉద్యమకారుడు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ సందర్భంగా అజ్ఞాత జీవితాన్ని, జైలు జీవితాన్ని గడిపిన ప్రజాస్వామిక వాది. 1969లో తొలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో జైలు జీవితాన్ని అనుభవించిన ప్రాంతీయవాది కూడా... ఆయనే పరిపాటి జనార్ధనరెడ్డి.
విద్యార్థి నాయకుడిగా
హుజురాబాద్ పాత తాలూకా (ప్రస్తుతం వీణవంక మండలం) లోని పోతిరెడ్డిపేట (కల్లుపల్లి) గ్రామానికి చెందిన పరిపాటి జనార్దన్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ.చదువు పూర్తి చేశాక, సోషలిస్ట్ నేత రాంమనోహర్ లోహియా రచనలను అధ్యయనం చేయడం ప్రారంభించారు. స్వయానా సోదరులైన పరిపాటి ఉమ్మారెడ్డి అందించిన ప్రేరణతో ఆయన దృష్టి రామ్ మనోహర్ లోహియా వైపు మళ్ళింది.
ప్రగతిశీల భావాలు కలిగిన ఉన్న పరిపాటి జనార్దన్ రెడ్డి జమ్మికుంట ప్రాంతంలోని భూస్వాములకు వ్యతిరేకంగా 1960 దశకంలోనే అప్పటి యువతరాన్ని సమీకరించి అనేక పోరాటాలను చేశారు. అప్పటి యువజన నాయకుడు, జమ్మికుంట సర్పంచ్ గా పనిచేసిన ఎర్రంరాజు కృష్ణంరాజు, ఉప్పల్ గ్రామానికి చెందిన పుల్ల ఏలియాలు జనార్దన్ రెడ్డికి అండగా నిలిచారు. 1962లో కమలాపూర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన కె.వి.నారాయణరెడ్డి సహకారంతో జనార్ధనరెడ్డి, కృష్ణంరాజులు జమ్మికుంటలో ఆదర్శ ప్రైవేటు డిగ్రీ కళాశాల (ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ఏర్పాటులో క్రియాశీల పాత్రను పోషించారు. 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో హుజూరాబాద్ తాలుకా తెలంగాణ ప్రజాసమితి నాయకునిగా ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఉద్యమంలో భాగంగా పలు పర్యాయాలు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు.నేను కూాడా ఆనాటి విద్యార్థి నాయకుడిగా ఆయనతో పాటు జైలు జీవితాన్ని గడిపిన వారిలో ఉన్నాను.
అతిపిన్న వయస్సులోనే హుజురాబాద్ పంచాయతీ సమితి అధ్యక్షునిగా ఎన్నికై రాజకీయ రంగ ప్రవేశం చేసిన జనార్దన్ రెడ్డి ఆ రోజుల్లో చరిత్రను సృష్టించారు. ఆయన రెండు పర్యాయాలు హుజురాబాద్ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. పరిపాటి జనార్దన్ రెడ్డి 1972 లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుండి అధికార కాంగ్రెస్ అభ్యర్థి కె.వి.నారాయణరెడ్డి పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టారు.
రాజకీయాలకు దూరమయ్యి..
పరిపాటి జనార్దన్ రెడ్డి ఆనాటి సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకుడు జార్జ్ ఫెర్నాండజ్‌కు అత్యంత సన్నిహితులలో ఒకరుగా వున్నారు. 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమెర్జెన్సీని ప్రకటించడంతో జార్జ్ ఫెర్ణాండజ్‌తో పాటు, కమలాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న జనార్దన్ రెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి, కొద్ది రోజుల తర్వాత అరెస్టై జైలు జీవితాన్ని గడిపారు. ఎమర్జెన్సీని ఎత్తివేసిన తర్వాత విడుదలైన జనార్దన్ రెడ్డి 1977లో కొత్తగా ఏర్పాటైన హన్మకొండ లోకసభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి పి.వి.నరసింహారావు పై పోటీచేసి ఓడిపోయారు.1978 లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేసి గెలుపొంది రెండోసారి అసెంబ్లీకి వెళ్లారు. తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన పెనుమార్పులతో జనార్దన్ రెడ్డి క్రమంగా రాజకీయాలకు దూరమౌతూవచ్చారు.
అనంతరం హుజురాబాద్ కేంద్రంలో గ్రామ నవ నిర్మాణ సమితి పేర ఒక స్వచ్ఛంద సంస్థను, జమ్మికుంటలో హిందూ కుష్టు నివారణ కేంద్రాన్ని, ఆ తర్వాత జమ్మికుంటలోనే కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించి వందలాది మంది యువతీ, యువకులకు ఉపాధిని కల్పించారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జమ్మికుంట ప్రాంతంలోని రైతాంగానికి శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణుల చేత చైతన్యాన్ని అందిస్తుండటం గమనార్హం. జనార్దన్ రెడ్డి చివరి వరకు కృషి విజ్ఞాన కేంద్రంతో మమేకమై వున్నారు.
పౌరహక్కుల నేత కె.జి.కన్నభిరాన్‌తో కలసి పౌరహక్కుల ఉద్యమంలోను, ప్రొ. కేశవరావు జాదవ్ గారితో కలసి మలిదశ తెలంగాణ ఉద్యమంలోను జనార్దన్ రెడ్డి తన భాగస్వామ్యాన్ని అందించారు. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన పరిపాటి జనార్దన్ రెడ్డి తన 87 ఏళ్ల వయస్సులో 2022 మార్చి 28న కన్నుమూశారు. ఆయన జ్ఞాపక చిహ్నంగా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ నేడు ఆవిష్కరించనున్నారు.
ఆవునూరి సమ్మయ్య
98491 88633