- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాలెం కాలేజీనే మాయం చేశారు!
చదువులకంటే మంచితనం మాత్రమే కలిగిన సుబ్బయ్య అనే సామాన్యుడు 1964లో పాలెం గ్రామంలో ఓరియంటల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో వందలాది పాఠశాలలు, కళాశాలలు, అనేక విశ్వవిద్యాలయాలకు తెలుగు ఉపాధ్యాయుల, అధ్యాపకుల కొరత తీర్చి ఎంతో సేవ చేసింది. 1980లలో ప్రభుత్వ ఓరియంటల్ కళాశాలగా మారిన పాలెం కళాశాలను 3 దశాబ్దాల లోపే మాయం చేసేశారు. తెలుగు భాషపై మక్కువ గలవాడని పేరొందిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కాలేజీని సూర్యాపేటకి తరలించే పనికి తెగబడ్డారు. పదేళ్లపాటు ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో పిల్లల సంఖ్య తగ్గిపోయింది. పిల్లలు లేని కాలేజీ అని ముద్రవేసి కాలేజీనే తీసేశారు. ఇది ఆ కాలేజీ మూత కాదు. తెలుగు చదువుల మీద తెలుగు చదువుల భవిష్యత్తు మీద తీవ్రమైన దాడి.
...............................
1964లో పాలెం గ్రామంలో ఓరియంటల్ కాలేజీ ఏర్పాటు ఒక అసాధారణ విషయం. పదవీ దాహం కానీ, ఆర్జన వ్యామోహం కానీ లేని పది మంది విద్యావంతుల సమాజంగా మన సమాజం భాసిల్లాలని సుబ్బయ్య గారు సంకల్పం తీసుకుని పని చేయడం వల్ల ఈ పని సాధ్యం అయింది.
అలా వచ్చిన పాలెం కాలేజీని..
పాలెం ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సుబ్బయ్య గారు చదువుల కన్నా మంచితనం మాత్రమే కలిగిన మనిషి. ఆయన తనకు చదువు లేదని కుంగిపోలేదు. అనేకులు చదువుకోగల పలు విద్యా సంస్థలను కలగన్నారు. ప్రతి పల్లెలో, ప్రతి బడిలో తెలుగు చదువుకున్న ఉపాధ్యాయులు వుండాలి అని చర్చలు చేశాడు. ఆయన ఏదైనా విషయం చర్చకు తీసుకున్నాడు అంటే ఆ చర్చకు ఒక రూపం వచ్చే దాకా కష్టపడేవారు. అనేక మందిని కదిలిస్తూ ఫలితం సాధించి చూపేవాడు.
అట్లా వచ్చి చేరిందే పాలెం ఓరియంటల్ కళాశాల. అట్లా సాధించి తెచ్చిన ఆ కళాశాల మాకు తెలుగు చదువులు చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాలలో వందలాది పాఠశాలలు, కళాశాలలు, అనేక విశ్వవిద్యాలయాలకు తెలుగు ఉపాధ్యాయుల, అధ్యాపకుల కొరత తీర్చి ఎంతో సేవ చేసింది. ఈ ఓరియంటల్ కళాశాల ఏర్పాటు జరిగే నాటికే పాలెం గ్రామంలో 1950లో ఉన్నత పాఠశాల, ఆర్ట్స్, సైన్స్ కళాశాల ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంస్థలలో పనిచేసే అధ్యాపకులు, విద్యార్థులతో పాలెం గ్రామం కళ కళ లాడుతూ ఉండేది. ఇది స్వార్థం లేకుండా అవధులు లేని త్యాగానికి కట్టుబడి పని చేసినందువల్ల సాధ్యం అయినపని.
తెలుగు చదువుల భవితపై దాడి
1980లలో ఈ కళాశాల నాటి విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీనివాసరావు చొరవతో ప్రభుత్వ ఓరియంటల్ కళాశాలగా మారింది. ఉన్నత పాఠశాల కాక ఆర్ట్స్ & సైన్స్ కళాశాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ప్రజలు, విద్యార్థులు, అధ్యాపకులు దీంతో విద్యా సంస్థలు బాగుపడుతాయి అనుకున్నారు. కాల క్రమంలో చాలా కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు బోధన ప్రాధాన్యతను తగ్గించి వేసింది. ఓరియంటల్ కాలేజీలలో తెలుగు చదువుకున్న వారితో సమానంగా ఐచ్చికంగా ఒక గ్రూపుగా తెలుగు చదువుకున్న వారికి కూడా పదోన్నతి కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఆర్థిక విధానాల వెల్లువలో విద్యారంగంలో వచ్చిన మార్పులు చేర్పులు సామాజిక శాస్త్రాల, స్థానిక భాషల అధ్యయన అవసరాన్ని దెబ్బ కొట్టాయి. ఒక మారుమూల గ్రామంలో ఓరియంటల్ కాలేజీ అవసరం కొనసాగవలసిన అవసరం ప్రభుత్వానికి అర్థం కాలేదు అనే చెప్పాలి. పాలెం ఓరియంటల్ కాలేజీలో తొలుత ఎంట్రెన్స్ కోర్స్ తీసేసి పది చదువు కోకుండా వదిలేసిన పిల్లల పై చదువుకు అవకాశం లేకుండా చేశారు. తరువాత పీడీసీ అంటే డీఓఎల్ బందు చేశారు. ఆ తర్వాత బీఏఎల్ కోర్సుకు ఒక కాలేజీ ఎందుకు అని దాన్ని సైన్స్ కాలేజీలో కలిపి చాలా గొప్ప పని చేశాం అనుకున్నారు.
కాలేజీ లాభాల మార్కెట్ కాదు
ఓరియంటల్ కాలేజీ తెలుగు భాషను ప్రత్యేకంగా అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కాలేజీ. అవసరం అయితే ఆ అధ్యయనాన్ని వివిధ దేశాల స్థానిక భాషల అధ్యయన పద్ధతి పరిశీలించి అభివృద్ధి పరిచి నడిపే చర్యలు తీసుకోవచ్చు. తెలంగాణ భాష యాసల అధ్యయనం కోసం పరిశోధనల స్థాయిలో కూడా అభివృద్ధి చేయవచ్చు. ఇదేమీ ఆలోచించకుండా ఓరియంటల్ కాలేజీని మాయం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత తెలుగు భాష పట్ల మక్కువ గల తొలి ముఖ్యమంత్రి ఈ గ్రామీణ కళాశాల ప్రగతికి చర్యలు తీసుకుంటాడని అందరూ ఆశ పడ్డారు. అది ఎండమావిలా తేలిపోయింది. లాభాలు నష్టాల కోణం తప్ప మరో ప్రజానుకూల దృష్టి లేని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ కాలేజీని సూర్యాపేటకి తరలించే తప్పుడు పనికి తెగబడ్డాడు. పది సంవత్సరాల పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. పిల్లలు చేరడం తగ్గిపోయింది. పిల్లలు లేరు కాబట్టి లెక్చరర్ల అవసరం లేదని, ఏకంగా కాలేజీ తీసేశారు. ఇది ఆ కాలేజీ మూత కాదు. తెలుగు చదువుల మీద తెలుగు చదువుల భవిష్యత్తు మీద తీవ్రమైన దాడి.
ప్రభుత్వ పాఠశాలల విధ్వంసం
ఇలాంటి అనేక కారణాల వల్ల చంద్రశేఖర్ రావు ఓడిపోయారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పాలెం విద్యా సంస్థల వజ్ర ఉత్సవాలు జరుగుతున్న సమయంలో పూర్వ విద్యార్థులుగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎంతో ముందు చూపుతో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన తెలుగు విద్యా సంస్థలను బతికించకపోగా గొంతు నులిమి వేయడం తెలంగాణ తరహా విధ్వంసం అయిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పాలెం ఓరియంటల్ కాలేజీ కోసమే కాదు మొత్తంగా తెలుగు భాష అధ్యయనం, అధ్యాపనం, పరిశోధన, అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. తెలుగు భాషను, తెలుగు విద్యా సంస్థలను కాపాడుకోలేమా! గత ప్రభుత్వంలోని విద్యుత్ మంత్రి దెబ్బకు పాలెం నుండి తరలించిన ఓరియంటల్ కాలేజీని తిరిగి తెప్పించి న్యాయం చేయండి.
ఎం. రాఘవాచారి
పాలమూరు అధ్యయన వేదిక
94907 03857