- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలుపెరుగని రథసారథికి భారతరత్న
భారతీయ జనతా పార్టీ భీష్ముడు, రాజకీయ కురువృద్ధుడు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ సుదీర్ఘ ప్రస్థానంలో దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. కరడు గట్టిన దేశ భక్తుడిగా, హిందుత్వవాదిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన అద్వానీ, తన సహచరుడైన మహానేత వాజ్‌పేయీ అడుగుజాడల్లో సిసలైన ప్రజాసేవకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ ప్రభంజనంలోనూ కమలదళానికి ఊపిరులు ఊది, సిసలైన సారథిగా కార్యకర్తలు, ప్రజల హృదయాల్లో స్థిరపడిపోయారు.
లాల్ కిషన్‌చంద్ అద్వానీ... ఈ పేరు వింటే గౌరవం, భక్తి, వినయం, సంప్రదాయం అన్నీ ఒక్కసారిగా కలుగుతాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పులకించి పోతారు. వాజ్‌పేయి తర్వాత బీజేపీలో అద్వానీకే అంత సముచిత గౌరవం లభించింది. నిబద్దత, అంకితభావంతో పాటు వేలెత్తి చూపలేని నిరాడంబరమైన ఉన్నత వ్యక్తిత్వం ఆయనది. 1927లో ఇప్పటి పాకిస్థాన్ సింథ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో అద్వానీ జన్మించారు. ఎల్‌కె అద్వానీ తండ్రి శ్రీ కిషించంద్ మరియు తల్లి జ్ఞానీదేవి. ఆయన సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. అతని ప్రారంభ విద్య కరాచీలో సాగింది. తరువాత లాహోర్‌లో చదువుకున్నారు. అనంతరం ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. దేశ విభజన సమయంలో భారత్‌కు ఆయన కుటుంబం వలస వచ్చింది.
బాల్యం నుంచే ఆరెస్సెస్‌తో అనుబంధం
సంఘ్ సిద్ధాంతాలంటే అద్వానీకి ప్రాణం. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులోనే ఆయన ఆరెస్సెస్‌లో చేరారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే ఆరెస్సెస్‌తో అనుబంధం ఉంది. 1947లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. అయితే, ఆరెస్సెస్‌తో ఆయన ప్రయాణం అనుకోకుండానే జరిగింది. తన స్నేహితుని ద్వారా తాను ఆరెస్సెస్‌లో చేరారు. అలా ప్రారంభమైన తన జీవితం.. సంఘ్‌కు అంకితమైంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జన్ సంఘ్‌లో చేరారు. 1957లో వాజ్‌పేయీ సహా జన్‌సంఘ్ ఎంపీలకు సహాయకారిగా ఉండేందుకు ఢిల్లీకి రమ్మని పిలవడం వల్ల అద్వానీ హస్తినలో అడుగు పెట్టారు. 1960లో ఋషి సిద్ధాంతాలతో నడిచిన ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్టుగా చేరిన అడ్వానీ 'నేత్ర' అనే కలం పేరుతో సినిమా వ్యాసాలను కూడా రాసేవారు.
రథయాత్రతో కీలక మలుపు
అయోధ్యలో రామమందిర నిర్మాణం పేరుతో అడ్వానీ చేపట్టిన రథయాత్ర భారతదేశ రాజకీయాలనే మలుపుతిప్పింది. అడ్వానీని కమలదళ రథసారథిని చేసింది రథయాత్రే. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు తలపెట్టిన అడ్వానీ రథయాత్రకు అనూహ్య మద్దతు లభించింది. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ ఘటన తర్వాత అద్వానీని అరెస్ట్ చేశారు. పదివేల కిలోమీట్ల మేర ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ బీహార్‌లో ఆయన యాత్రకు అప్పటి లాలూప్రసాద్ యాదవ్ ప్రభుత్వం అవరోధాలను కలిగించింది, అయినా అయోధ్య కోసం ఆయన పోరాటం ఆగలేదు. అలాగే పార్టీ కోసం ఆయన నిరంతరం శ్రమించేవారు.
దూరమైన ప్రధాని పదవి
వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రి పదవి చేపట్టిన అద్వానీ, 2009లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా దేశమంతా పర్యటించారు కానీ అప్పుడు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన ప్రధాని పదవి చేపట్టలేకపోయారు. పార్టీని అధికారంలోకి తేవాలన్న తపన ఆయన తనువంతా ఉండేది. 1974 నుంచి 76 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 4 సార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన అద్వానీ, గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం వరసగా ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయగా, అద్వానీ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1977 నుంచి 79 వరకు ఆ పదవిలో కొనసాగినారు. 1996లో తొలిసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ మెజారిటీ లేక 13 రోజులలోనే అధికారం కోల్పోయింది. 1998లో కేంద్రంలో పగ్గాలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వంలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా, అద్వానీ హోంమంత్రిగా పదవులు చేపట్టారు. అవిశ్వాస తీర్మానం నెగ్గలేక పడిపోయిన బీజేపీ 1999లో స్పష్టమైన మెజారిటీ సాధించి నాలుగేళ్ల పాటు అధికారం చలాయించింది.
భారత రత్నమే…!
జర్నలిస్టు నుంచి దేశ ఉపప్రధానిగా స్పూర్తి వంతమైన ప్రయాణం కొనసాగించారు. రాజకీయ విలువలను పాటిస్తూ పార్లమెంట్ సభ్యునిగా హుందాగా వ్యవహరిస్తూ తనదైన శైలి చలోక్తులు మాటలతో ప్రసంగాలను రక్తి కట్టిస్తూ ప్రతిపక్షానికి సమాధానమిచ్చే వైనం వల్ల అద్వానీని ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1999లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డుతో ప్రదానం చేసింది. ఉత్తమ పార్మమెంటేరియన్‌గా గౌరవాన్ని పొందిన అద్వానీ నిజంగా భారత రత్నమే.
-వాడవల్లి శ్రీధర్
99898 55445