- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కార్మిక సంక్షేమం బహుదూరం..!
విద్యా హక్కు చట్టం లాగే కార్మిక సంక్షేమానికి ఉద్దేశించిన చట్టాలను సంబంధిత అధికారుల సహకారంతో, కార్మిక సంఘాల నిష్క్రియాపరత్వంతో, యాజమాన్యాలు, నీరు గారుస్తున్నాయి. కర్మాగారాల చట్టం, 1948 ప్రకారం కార్మికుల పనిగంటలు వారానికి 48 మించరాదు. ఏ రోజైనా 9 గంటల కంటే అధికంగా పని చేయించరాదు. అంతకు మించి పనిచేయించవలసి వస్తే, ఆ కాలానికి అధిక వేతనం (ఓవర్ టైమ్) చెల్లించాలి. అలాగైనా, ఒక వారంలో (6 రోజులలో) మొత్తం పని గంటలు 62కి మించరాదు.
కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన ‘దుకాణాలు, సంస్థల చట్టాల' ప్రకారం కూడా దుకాణాలు, సంస్థలలో పనిచేసే కార్మికుల పనిగంటల విషయమై ఇంచుమించు ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. కానీ నేడు పలు సంస్థలు, దుకాణాలలో, అసంఘటిత, అనిబద్ధ (informal) రంగాలలోని కార్మికులకే కాదు, భారీ పరిశ్రమలలో ఒప్పంద కార్మికుల పనివేళలు కూడా ఎనిమిది గంటలకు మించే ఉంటున్నాయి. వీరంతా అధిక వేతనం ఊసే లేకుండా 62 గంటలకు పైగా ఒక వారంలో పనిచేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఈనాటికి కూడా కొన్ని సంస్థలలో ఉద్యోగుల నుండి ‘మేము మా ఇష్టపూర్వకంగా రోజులో 12 గంటల వరకు పనిచేస్తామ’ని రాయించుకుని మరీ ఉద్యోగం ఇస్తున్నారు.
కనీస వేతనాలు లేక..
భారీ కర్మాగారాలలో, పెద్ద పెద్ద బ్రాండ్‌ల వస్తు వులు విక్రయించే మాల్స్‌లోనూ, గొలుసు దుకాణాలలోనూ కొందరు కార్మికుల పేర్లు చట్టాల ప్రకారం నిర్వహించాల్సిన దస్త్రాలలో ఉండవు. అనధికారిక చిట్టాపుస్తకాలలోనో, హాజరు పట్టీ- 2లోనో ఉంటాయి. వీరికి ఓచర్ల ద్వారా జీతాల చెల్లింపు జరుగుతుంది.వారికి కనీస వేతన చట్టం-1948 వర్తిస్తుంది. ఆ చట్ట ప్రకారం నిర్ణయించబడిన వేతనాల కంటే తక్కువ వేతనాలు చెల్లించడానికి వీలు కానీ, ఇతర విధాలుగా చట్ట నిబంధనలకు విరుద్ధంగా కానీ, యజమానులు కార్మికులతో చేసుకున్న ఒప్పందాలు చెల్లవని, ఆ చట్టంలోనే ఉంది. అయితే కనీస వేతనాలు ఎంతవరకు చెల్లించబడుతున్నాయనేది అందరికీ ఎరుకే. ఇక సాంఘిక భద్రత కల్పించే కార్మిక రాజ్య బీమా చట్టం, 1948, ఉద్యోగ భవిష్యనిధి చట్టం, 1952 అమలు గతీ ఇందుకు భిన్నం కాదు.
భవన నిర్మాణ రంగంలో..
ఇక 'భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ సెస్ చట్టం, 1996'. ఆ చట్టం ప్రకారం వివిధ రాష్ట్రాల్లో ఆ కార్మికుల సంక్షేమ మండలులు ఏర్పాటయ్యాయి. ఒక ఏడాదిలో కనీసం 90 రోజులు భవన లేదా ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న, 18 నుండి 60 ఏళ్ల మధ్య ఉండి, సభ్యత్వ రుసుము సంవత్సరానికి రూ.62 చెల్లించిన స్త్రీ, పురుష కార్మికులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. వీరు ప్రమాదం వల్ల మృతి చెందితే, వారి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు, శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి బీమా సదుపాయం, 50% అంగవైకల్యం కలిగితే లక్ష రూపాయలు, సాధారణ మరణానికి 30 వేల రూపాయలు, మరికొన్ని ఆర్థిక సహాయాలు ఈ చట్టం ప్రసాదిస్తుంది. ఇందుకు నిధులను భవన నిర్మాతల నుండి సెస్(Cess) రూపంలో వసూలు చేస్తారు. అయితే, ఈ రంగాలలో పనిచేసే కార్మికులలో అధిక సంఖ్యాకులు నమోదు చేసుకోకపోవడం వలన వివిధ రాష్ట్రాల సంక్షేమ మండలుల వద్ద ఈ నిధులు పేరుకు పోతున్నాయి. 1-11-22 నాటికి ఆ నిధులు రూ. 38,209 కోట్లకు చేరుకున్నాయి. ఇక సమాన ప్రతిఫల చట్టం- 1976 లో అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలంలో ఈ చట్టం తొలుత ఆర్డినెన్స్‌గా వచ్చింది. ఈ చట్టం ప్రకారం స్త్రీ, పురుషులకు సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలి.
సమాన పనికి సమాన వేతనం లేదు..
సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పులో [State of Punjab v. Jagjit Singh, 2016) తాత్కాలిక ఉద్యోగుల హక్కులకు సంబంధించి 'సమాన పనికి సమాన వేతనం' అనే రాజ్యాంగ సూత్రాన్ని గుర్తించింది. తాత్కాలిక ఉద్యోగులు, సాధారణ ఉద్యోగులు ఒకే విధమైన విధులను నిర్వర్తిస్తున్నందున, కరువు భత్యంతో పాటు అన్ని భత్యాలకు వారు కూడా అర్హులని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఇక చట్టాల అమలు విషయంలో తరచూ వినబడే మాట "ఇన్స్పెక్టర్ రాజ్". ఇందుకు రెండు కారణాలు. చట్టాలు అమలుపరిచే బాధ్యతగల ప్రభుత్వ ఉద్యోగులలో అత్యధికులకు స్వలాభమే ప్రధానం. సుసంఘటితమైన ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ అవినీతి కారణంగా కార్మికుల హక్కులను, ప్రయోజనాలను కాలరాస్తున్న సభ్యుల ను ఉపేక్షిస్తున్నాయి. ఇందుకు తోడు కార్మిక హక్కుల పరిరక్షణ, శ్రేయోసాధన లక్ష్యంగా ఏర్పడిన కార్మిక సంఘాలు ఆ లక్ష్యానికి దూరమై, వారికి తల్లివేరైన రాజకీయ పక్షాల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. పర్యవసానం, చట్ట ప్రకారం లభించవలసిన ప్రయోజనాల నుండి కార్మికులలో అధిక సంఖ్యాకులు వంచితులవుతున్నారు. అందుకే కార్మిక చట్టాల అమలు విషయమై కర్మాగారాలు/సంస్థలు తనిఖీ చేసే ప్రభుత్వోద్యోగుల విస్తృతాధికారాలు "సులభతర వాణిజ్య విధానం" ప్రకారం రద్దు చేయబడినా, ఇప్పటిలా చట్టాల అమలు బాధ్యత చాలావరకు ఆయా కర్మాగారాల/ సంస్థల దయాదాక్షిణ్యలకే విడిచిపెట్టక "సామాజిక తనిఖీ" వంటి ప్రత్యామ్నాయం అన్వేషించాలి.
మల్లాప్రగడ రామారావు
99898 63398
- Tags
- Labor welfare