ప్రశ్నించే ప్రతిపక్షం అవసరమే..!

by Ravi |
ప్రశ్నించే ప్రతిపక్షం అవసరమే..!
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 లో ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్‌కు 63 స్థానాలతో ప్రజలు అధికార అవకాశం ఇచ్చారు. అంటే దాదాపు ఇంకా సగం మందికి ప్రతిపక్ష హోదాని తెలంగాణ సమాజం కట్టబెట్టింది. నాడు తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి అవకాశం ఇస్తూనే వాళ్లని ప్రశ్నించేందుకు మిగతా పార్టీలకు కూడా అవకాశం ఇచ్చారు. కానీ కేసీఆర్ అందుకు భిన్నంగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఎస్పీ, సీపీఐ పార్టీల నుంచి నాయకులను పార్టీలో చేర్చుకుంటూ పోయాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రశ్నించే వారి సంఖ్య తగ్గిపోయింది.

అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అలాంటిది రాజకీయాల్లో ప్రశ్నిస్తే తప్ప సమాధానం దొరకని పరిస్థితి. ఎవరూ ఔనన్న కాదన్నా తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నమన్నది వాస్తవం. ఏ రాజకీయ పార్టీ కూడా అడగ్గానే ఇవ్వలేదు. ఇందుకోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది ప్రశ్నించి నిలదీసి ఎదురుతిరిగారు. ఎందరో అమరులయ్యారు. అలాంటి తెలంగాణ సిద్ధించి 10 సంవత్సరాలైనా ఇప్పటికీ బలమైన ప్రతిపక్షం ఉండకుండాపోతోంది. తద్వారా ప్రశ్నించే గొంతుకలు అసెంబ్లీలో లేకుండా పోతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ శాతం ఏపీకి చెందిన ఎమ్మెల్యేలే ఉండేవారు. దాంతో తెలంగాణ తరుఫున ప్రశ్నించే వాళ్ల శాతం తక్కువగా ఉండడంతో అభివృద్ధి, సంక్షేమం విషయంలో కుంటుపడింది. కానీ ఇప్పుడు రాష్ట్రం సిద్ధించిన తర్వాత మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు జరిగింది. అయినా కూడా అసెంబ్లీలో అలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి.

రెండోసారి గెలిపిస్తే.. ఇంత నిర్వాకమా?

దశాబ్దాలుగా నలిగిపోయిన రాష్ట్రాన్ని ఒక్కసారిగా మార్చడం ఎవరివల్ల కాదని మరోసారి తెలంగాణ ప్రజలు 2018 ఎన్నికల్లో కూడా మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే అవకాశం కల్పించారు. పైగా ఈసారి ప్రజలు 88 సీట్లతో అధికారం కట్టబెట్టారు. ఆ గెలుపుతో వేరే పార్టీ నుండి ఎమ్మెల్యేలను చేర్చుకునే అవసరమే లేదు.. అయినప్పటికీ కేసీఆర్ ఎమ్మెల్యేల చేరికలను స్వాగతించాడు. ఏకంగా కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుని మిత్రపక్షమైన ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా కల్పించారు. ఇక అసెంబ్లీలో మిత్రుడే ప్రతిపక్షమైతే అధికార పార్టీని ప్రశ్నించే వాళ్లు లేకపోవడాన్ని ప్రజలు గమనిస్తూ వచ్చారు. కొత్త కొత్త పథకాలు తీసుకువచ్చినా, వివిధ రకాల కారణాల వల్ల ఎమ్మెల్యే ల చేరికలను స్వాగతించడం, పాలనను ఫాంహౌజ్‌కే పరిమితం చేయడం, ఎమ్మెల్యేల పనితీరును ప్రశ్నించకపోవడం, మొదలైన అంశాలను పట్టించుకోకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. పైగా ప్రజలకు అన్నీ చేస్తున్నాం కదా ఇంకా ప్రతిపక్ష అవసరమేం ఉంది అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రశ్నించే వారు లేకపోయేసరికి అన్ని కరెక్టుగానే ఉన్నాయనుకొని తమ తప్పులు తెలుసుకోలేకపోయారు. ప్రజల సమస్యలు పూర్తి స్థాయిలో నాయకుల దగ్గరకు వెళ్లేవి కావు. పోరాడడానికి ప్రతిపక్షం లేదు. ఇక ఓడిన నాయకులు ప్రశ్నిద్దామంటే అధికారం లేని వాళ్లు వేసే ప్రశ్నలకు అంతగా విలువ లేకుండా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. దీంతో ప్రజలు ఈసారి కచ్చితంగా అధికారం మార్చాలని డిసైడయ్యారు. అలాగని మొత్తం ఒకరి వైపు మళ్లలేదు. అధికారం కాంగ్రెస్‌కి అప్పజెప్పి ప్రతిపక్ష పాత్రని బీఆర్ఎస్‌కి అప్పజెప్పారు. ఈ సారి కాంగ్రెస్‌కు 63 స్థానాలు తమ మిత్రపక్షం సీపీఐకి 1 స్థానాన్ని కట్టబెట్టారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఎలాంటి తీర్పునిచ్చారో మళ్లీ ఇప్పుడు అదే తీర్పును ఇచ్చారు. అప్పుడు, ఇప్పుడు ప్రజలు చాలా తెలివిగా వ్యవహారించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా ఉండాలని ఈ విధంగా తీర్పునిచ్చారు.

బలమైన ప్రతిపక్షం లేకుంటే!

అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తమ అధికారాన్ని ఎక్కడ కూల్చేస్తారేమో అనే భయంతో వలసలను ప్రోత్సహిస్తున్నట్లుగా చెబుతుంది. అయితే ఇప్పటికే 10 మంది వరకు చేరారు. కాబట్టి కాంగ్రెస్ బలం 75కి చేరింది. ఇప్పుడున్న ఈ బలం కాంగ్రెస్‌కు సరిపోతుంది. కానీ, అది ఇంతటితో ఆపకుండా గతంలో వాళ్లు చేశారుగా మేం చేస్తే తప్పేముంది? అన్నట్లుగా మిగతా వాళ్లను కూడా చేర్చుకోవాలని, వాళ్లు కాంగ్రెస్‌లోకి రావడానికి ఇష్టపడుతున్నారనే సందేశాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఇది తప్పు. ఇలా చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ పప్పులో కాలేసినట్లే.. గతంలో బీఆర్ఎస్ కూడా విపక్ష సభ్యుల సంఖ్యను భారీగా అసెంబ్లీలో తగ్గించి, ప్రశ్నించే వాళ్లను లేకుండా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడం వల్ల అప్పటి పరిస్థితే మళ్లీ అసెంబ్లీలో ఏర్పడుతుంది. బలమైన ప్రతిపక్షం లేకుండా పోతుంది. దీనిని ప్రజలు సహించరని నాయకులు గుర్తుపెట్టుకోవాలి.

వలసలను ఆపేస్తేనే మంచిది

కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికి చేరికలను ఆపేస్తే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కొంచెం బలంగా ఉంటుంది. వీరికి తోడుగా బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, సలహాలివ్వడం వంటివి చేస్తాయి. రాష్ట్రంలో సమపాళ్లతో కూడిన పాలన ఉంటుంది. బలమైన ప్రతిపక్షం ఎంత అవసరమో కూడా మొన్న జరిగిన లోక్‌సభ సమావేశాల్లో జరిగిన చర్చల ద్వారా దేశ ప్రజలకు అర్థమైంది. కాబట్టి దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా బలమైన ప్రతిపక్షం మంచిదే. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్రంలో ఇంకా 10 సంవత్సరాలు తమదే అధికారం అని చెప్పుకుంటుంది. కాబట్టి గత ప్రభుత్వ తప్పిదాలను చేయకుండా వారు కోరుకున్నట్టే ప్రజాపాలన చేస్తే తప్పకుండా మళ్లీ వాళ్లదే అధికారం అవుతుందనడంలో సందేహం లేదు.

గోపు రాజు

జర్నలిస్టు

99636 65363



Next Story