ఉత్సవ విగ్రహాలుగా స్థానిక సంస్థలు

by Ravi |   ( Updated:2024-02-20 01:01:09.0  )
ఉత్సవ విగ్రహాలుగా స్థానిక సంస్థలు
X

దేశ స్వాతంత్య్ర ఫలితాలు అందరికీ అందాలంటే ‘గ్రామ స్వరాజ్యం’తోనే సాధ్యమని జాతిపిత మహాత్మా గాంధీ పిలుపిచ్చారు. దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ నియంతృత్వంగా వ్యవహరిస్తూ, స్థానిక సంస్థ నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చివేసి చెక్‌ పవర్‌ ఉన్న సర్పంచులకు ‘పవర్‌’ లేకుండా చేసింది.

దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత కీలకమో గ్రామంలో సర్పంచ్‌ పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రంలో పాలన అంతా తమ కనుసన్నల్లోనే జరగాలనే పోకడలతో దురదృష్టవశాత్తు గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల రెక్కలను విరిచేసింది. రాజ్యాంగబద్ధంగా, న్యాయంగా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన వాటిని కూడా పక్కదారి పట్టిస్తోంది.

దారి మళ్లుతున్న పంచాయతీ నిధులు..

స్థానిక పరిపాలన, పాలనా వికేంద్రీకరణ మూలసూత్రాలను విస్మరిస్తూ గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాలు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల వ్యవస్థలను నూతనంగా ఏర్పాటు చేసి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు అధికారాలు లేకుండా చేసింది.

రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలలోని ప్రజల సంక్షేమం, గామాభివృద్ధి కోసం కేంద్రం సుమరు ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులను 14, 15 ఆర్థిక సంఘం కింద పంపగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని దారి మళ్లించింది. సర్పంచులకు చెప్పకుండా, వారి సంతకాలు లేకుండానే నిబంధనలను ఉల్లంఘించి సి.ఎఫ్‌.ఎం.ఎస్‌ అకౌంట్ల నుండి నిధులను పక్కదారి పట్టిస్తూ వాటిని ఇతర అవసరాలకు, పథకాలకు వినియోగించి పంచాయతీలను వెన్నుపోటు పొడిచింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను కూడా పంచాయతీలకు ఇవ్వకుండా ఎగ్గొట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాల కోసం జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి 2019-2023 వరకు కేంద్రం విడుదల చేసిన రూ.35 వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిధులను మళ్లించింది.

సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో…

గ్రామాభివృద్ధికి నిధులను కేటాయించాల్సిన ప్రభుత్వం తమ బాధ్యతలను మరవడమే కాకుండా గ్రామ పంచాయతీల సొంత నిధులపై ‘ఫ్రీజింగ్‌’ ఆంక్షలను విధించింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై వివక్షతతో రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్‌ నిబంధలను కూడా పాటించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వాన పత్రికలలో, శిలాఫలకాలపై సర్పంచుల పేర్లు వేయకుండా వారి గౌరవాన్ని గేలి చేశారు. పంచాయతీల అభివృద్ధి కోసం 73,74 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 29 ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బందిని, సంబంధిత నిధులను కేటాయించాల్సి ఉన్నా ప్రభుత్వం నిబంధలను అతిక్రమిస్తోంది. పంచాయతీ వ్యవస్థపై సర్కార్‌ ప్రణాళికబద్ధంగా కక్షగట్టింది.

గ్రామాలలో అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా రహదారులు, మౌలిక వసతుల కల్పన, మంచినీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ వంటి కీలక పనులను పంచాయతీ పరిధిలో చేపట్టి పూర్తి చేసుకునేవారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేసే సర్పంచులంటే ప్రజలకు గౌరవ మర్యాదలుండేవి. ప్రస్తుతం నిధులు, అధికారాలు, బాధ్యతలు లేకపోవడంతోపాటు నిధుల లేమితో అభివృద్ధి పనులను కూడా చేపట్టలేకపోతున్నారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం, కంటి ముందుండే స్థానిక సమస్యలపై గ్రామస్తులు నిలదీస్తుండడంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సమాధానాలు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు.

పంచాయతీ వ్యవస్థపై కక్షగట్టి…

రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవినబెట్టడంతో గ్రామాభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని, కేంద్ర నిధులను దారి మళ్లించకుండా నేరుగా పంచాయతీలకే ఇవ్వాలని, పంచాయతీ వ్యవస్థను పరిరక్షించాలని కోరుతూ పార్టీలకు అతీతంగా సర్పంచులు తమ చివరి అస్త్రంగా ఫిబ్రవరి 6వ తేదీన చలో అసెంబ్లీకి పిలుపిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం సర్పంచులు అమరావతికి చేరుకోకుండా అరెస్టులు, గృహనిర్బంధాలకు పాల్పడిరది. పోలీసుల వలయాలను ఛేదించుకొని వచ్చిన వారిని అమానుషంగా అడ్డుకున్నారు. ఇటువంటి ప్రభుత్వ దౌర్జన్యాలను నిలదీయాల్సిన బాధ్యత నాయకులతో పాటు ప్రజలపై కూడా ఉంది.

పంచాయతీ వ్యవస్థపై కక్షగట్టి అధికారాలు లేకుండా చేసిన ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది. నియంతృత్వ ధోరణితో ఉత్సవ విగ్రహాలుగా మార్చబడిన సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటును ఒక వజ్రాయుధంగా మల్చుకొని మన గ్రామాలను మనమే రక్షించుకునే విధంగా, పంచాయతీ వ్యవస్థను బలహీనపర్చిన జగన్‌ సర్కార్‌కు బుద్ధిచెప్పాలి.

- కొణతాల రామకృష్ణ,

అనకాపల్లి మాజీ పార్లమెంట్‌సభ్యులు,

కన్వీనర్‌, ఉత్తరాంధ్ర చర్చావేదిక

Advertisement

Next Story

Most Viewed