కోచింగ్ భూతాలు.. శిక్షణకు వెళ్తే మరణ శిక్షా...!

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-06 23:00:38.0  )
కోచింగ్ భూతాలు.. శిక్షణకు వెళ్తే మరణ శిక్షా...!
X

ఢిల్లీలో భారీ వర్షాలతో కరోల్ బాగ్ ప్రాంతంలోని రాజేంద్రనగర్లో ఓ కోచింగ్ సెంటర్ లోనికి వరద నీరు భారీగా చేరడంతో.. సివిల్స్ చదువుతున్న ముగ్గురు అభ్యర్థులు చనిపోవడం సంచలనం అయింది. నాణ్యతలేని కోచింగ్ సెంటర్లను సరిగా కట్టడి చేయనందునే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని రాజేంద్రనగర్‌ కోచింగ్ సెంటర్ల అడ్డాగా మారింది. అయితే కొన్ని కోచింగ్ సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవని, ఇబ్బందులు పడుతున్నామని, సివిల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం చర్చనీయంగా కూడా మారింది. ఉద్యోగాణ్వేషణలో శిక్షణకు వెళితే మరణశిక్షలు ఎదురవడం విషాదకరం.

రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ మేజర్ సిటీ. ఇక్కడ పర్మిషన్ లేని ఎన్నో కోచింగ్ సెంటర్లు కూడా గుట్టలు గుట్టలుగా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఇవి జిల్లా కేంద్రాల్లో కూడా విస్తరించాయి. కార్పొరేట్ విద్యాసంస్థల మాదిరిగా కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. అకడమిక్ ఇయర్, జాయినింగ్‌తో పాటు గ్రూపు వన్, గ్రూపు 2, కానిస్టేబుల్, నైపుణ్య టాలెంట్ టెస్ట్‌లకు సంబంధించి కోచింగ్ సెంటర్లు ఎక్కువగానే ఉన్నాయి. కోచింగ్ సెంటర్ ద్వారా కొన్ని వేల కోట్లు వ్యాపారం జరుగుతున్నట్లు కేంద్రం అంచనాలు కూడా ఉన్నాయి. కోచింగ్ సెంటర్ల కట్టడి కోసం కేంద్రం కొన్ని మార్గదర్శకాలు చేసిన అమలయ్యే దాఖలాలు లేవు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కోచింగ్ సెంటర్ కోచింగ్ అనగానే అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ లకు సంబంధించి అమీర్పేట్, ఎస్ ఆర్ నగర్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కోచింగ్ సెంటర్ల కంటే జైళ్లు బెటర్

హైదరాబాదులో కొన్ని కోచింగ్ సెంటర్లలో వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. రాష్ట్రంలో అత్యధిక కోచింగ్ సెంటర్లకు ఎటువంటి ప్రమాణాలు ఉండవు. జీహెచ్ఎంసీలో వ్యాపార సంస్థగా నమోదు చేసుకుంటారు. కోచింగ్ సెంటర్ నడుపుతున్న భవనాలకు ఫైర్ శాఖకు సంబంధించి రక్షణ నిబంధనలు పాటించరు. అధికారులు తనిఖీలకు వస్తే వారి జేబులు నింపడం, జరిమానాలతో తప్పించుకుంటున్నారు. కోచింగ్ సెంటర్లో ఎంతమంది ఉన్నారు, ఎంత ఫీజులు ఇస్తున్నారు అనేవి ఏమాత్రం లెక్కలో కనిపించవు. కెపాసిటీకి మించి ఎక్కువ మందిని కూర్చోబెట్టి మరీ కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారు. ఢిల్లీ లోని పేరుపొందిన కోచింగ్ సెంటర్లు కూడా హైదరాబాదులో నడుస్తున్నాయి. వీటిలోని విద్యార్థుల పరిస్థితి చూస్తే కోచింగ్ సెంటర్ల కంటే సెంట్రల్ జైలు బెటర్ అనిపిస్తుంది. జైల్లో బాత్రూంలో వెలుతురు నిబంధనలు బాగానే ఉంటాయి.

ఇష్టారాజ్యంగా ‘కోచింగ్’

తెలంగాణలో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. వాటిలో గ్రూప్స్ కానిస్టేబుల్, ఎస్సై, పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ఇక్కడ చేరే అభ్యర్థులకు ముందుగా ప్రవేశ పరీక్ష పెట్టి.. ప్రతిభ ఆధారంగా సరిపడే సీట్లకు మాత్రమే తీసుకుంటారు. అయితే సీటు రాని వాళ్ళు, స్టడీ సర్కిల్స్‌లో చదవదానికి ఇష్టం లేని వాళ్ళు మాత్రం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తారు. అక్కడ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారు. ప్రభుత్వ స్టడీ సర్కిల్ లలో పరిమిత సీట్లు కేటాయించడం వల్ల ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయించిన వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. దీంతో బిల్డింగులలో సరైన భద్రత ప్రమాణాలు పాటించకుండా రూల్స్‌కు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఫీజులు తీసుకున్నాక వ్యాపారం లాభాలు తప్ప కోచింగ్ సెంటర్‌లో ఉన్న మౌలిక వసతులపై ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదు.

భరతం పట్టాల్సిందే!

అధిక ఫీజులు వసూలు చేసి సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లను.. కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఇటీవల హర్యానా ప్రభుత్వం అక్కడి కోచింగ్ సెంటర్ల నమోదు నియంత్రణ బిల్లు ఆమోదించి... ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కట్టడి చేసింది. అన్ని రాష్ట్రలోనూ ఇలాంటి చట్టం తీసుకొచ్చి, అధిక ఫీజులు నియంత్రించి, నిరుద్యోగులకు మేలు జరిగేలా పాటుపడాలని ప్రజాభిప్రాయం. కోచింగ్ సెంటర్‌లే కాదు ప్రైవేట్‌లో నడుస్తున్న కార్పొరేట్ స్కూల్స్ విద్యాసంస్థల్లో కూడా నియంత్రణ చేయాల్సి ఉంది. ఎప్పటికప్పుడు కోచింగ్ సెంటర్లను తనిఖీ చేసి... విద్యార్థులు, నిరుద్యోగుల భద్రతకు చర్యలు చేపట్టాలి. ఢిల్లీలోని రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘటన మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది.


పట్ట హరి ప్రసాద్

87908 43009

Advertisement

Next Story