- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడిలో ‘రో’ కు ఓ రూల్! ... ఉపాధ్యాయుడే ఫూల్!!
"ఉపాధ్యాయులు ఇకపై స్వేచ్ఛగా పాఠ్యాంశాలు బోధించలేరు. వారికి తరగతి గదిలో స్వాతంత్ర్యం ఉండదు." ఉపాధ్యాయులు అసలు మనిషి కాదు.. మార్కెట్లో దొరికే భౌతిక వస్తువు. మారిన సమాజం, మారుతున్న పాలకులు, అక్కడే కొలువుంటున్న అధికారులు నైతికతకు ముగింపు పలికి శ్రమ దోపిడీకి తెరలేపారు.
వారే కృత్రిమ చలనత్వం సృష్టించి అవులు, బర్రెల నుంచి పాలు పితుక్కొంటున్న సులభంగా ఉపాధ్యాయుడిలో భయం పెట్టి ప్రేరణలు పరికల్పించి ఇద్దరి పనిని ఒక్కరితోనే చేయించాలనే వైఖరిని అధికారులు అందిపుచ్చున్నారు. ఈ దౌష్ట్యం ఇకపై ఎదురు లేకుండా కొనసాగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ప్రతిస్పందించే వారు లేరు. ప్రతిఘటించే వారు అసలే లేరు. ప్రభుత్వం ద్వారా సంక్రమించిన అధికారంతో పెట్రేగే అధికారులు తమ మౌఖిక ఆదేశాలను కఠిన శాసనాలుగా అమలు చేసే స్థితికి చేరారు."
ఉపాధ్యాయుల బోధనా సమర్ధతకు కొలమానాలా?
యంత్రాల సామర్థ్యాన్ని అశ్వసామర్థ్యంతో గణిస్తారు. కానీ మానవుడి మానసిక, శారీరక పని సామర్థ్యాన్ని కూడా అంతే స్థాయిలో గుణించడం వ్యవస్థలకు పరిపాటిగా మారింది. శారీరక, మానసిక సమర్థతను లెక్కించడంలో అధికారులు మానవ విలువలపై స్పృహ కోల్పోతున్నారు. మనిషిని కనీసం ఒక మనిషిగా చూడకుండా గొడ్డు లాగా చూసే సంస్కృతి ప్రారంభమైంది. జీతం తీసుకుంటున్న మనిషిని (ఉపాధ్యాయుడిని) బానిసగా చూసే వ్యవస్థలు బలోపేతమవుతున్నాయి. మానవ పరిణామ క్రమాన్ని, అభివృద్ధి దశలను పక్కన పెడితే ఆధునిక యుగం దాటిన దశాబ్దాల తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలు కుదురుకున్న తర్వాత ఈ మానవ శ్రమ దోపిడీ వికృతరూపం దాల్చింది. అధికార కరవాలంతో మనిషిని కూడా జంతు సమూహంలో చేర్చి అదుపులో పెట్టుకునే విషసంస్కృతి ఆరంభమైంది.
ఈ నిర్వహణ బరువు కాదు ..ఒక బాధ్యత!
ప్రాథమిక విద్యారంగంలో ముఖ్యంగా పిల్లల విద్యాబోధనను కూడా ప్రభుత్వాలు భారంగా మోస్తున్న దశలో అసలు ఒత్తిడి ఉపాధ్యాయుడిపై పడింది. అది రాజ్యాంగం ద్వారా ప్రజలకు వచ్చిన అవకాశం, దాన్నొక బాధ్యతగా భావించాలి. బడ్జెట్‌తో బేరీజు వేయకూడదు. సరళమైన రీతిలో ప్రభావవంతమైన బోధనా సాగించే రోజులు పోయాయి. విద్యార్థుల్లో శక్తివంతమైన వివేచన పాదుకోల్పే తరగతి గది ఆనవాళ్లు కోల్పోయింది. పిల్లల ఎదుగుదల, అభ్యాసం వారిలో ఆలోచనలు వెలికితీసే ప్యారామీటర్ల స్థానే ఉపాధ్యాయుడి బోధనకు కొత్త కొలమానాలు ప్రతిపాదిస్తున్నారు. భారతదేశంలోని వలసవాద విద్యా విధానం స్థానంలో ఒక హేతుబద్ధ విధానం తేవలసిన అవసరాన్ని తొక్కిపెడుతున్నారు. వారిలో కొత్త ఆలోచనలు రాకుండా విద్యార్థులో అభ్యాసనా శక్తిని పెంపొందించే విధంగా మార్పులు తీసుకురావడానికి తగిన కృషి లేదు. కనీస పరిశోధన లేకుండా విద్యావ్యవస్థలో నియమాలు, సరికొత్త నిబంధనలు వస్తున్నాయి. అంతే కాకుండా తల్లిదండ్రులకు కూడా ప్రమేయం ఉండట్లేదు. ఉత్తమ భావిపౌరుల సృష్టికర్తలైన ఉపాధ్యాయులకు సృజ నాత్మక స్వేచ్ఛ అనేది కనుమరుగైంది. నాణ్యమైన విద్యను అందించడానికి వారికి ఎటువంటి స్వేచ్ఛ లేదు. కార్యకారణ సంబంధం పేలవమైన స్థాయికి దిగజారిపోవడానికి ఈ నిబంధనల రూపకర్తల ఇరుకు చట్రాల మధ్య బిగించిన బోధనా సూత్రాలే! పిల్లల చదువుకు సంబంధించి ఏది సరళమైనది ఏది క్లిష్టమైనది, ఈ విద్యార్థికి ఎలా బోధించాలనే వైయక్తిక భేదాలపై ఉపాధ్యాయులకు మాత్రమే అవగాహన ఉంటుంది. బోధనేతర కార్యక్రమాలు, పెరిగిన సిలబస్, అధికారులు రూపొందించిన సూక్తిముక్తావళి ఉపాధ్యా యులకు బోధన పట్ల వెగటు పుట్టిస్తున్నాయి.
ప్రధానోపాధ్యాయులకు 9 రోజుల శిక్షణ!
ప్రతిరోజూ ప్రధానోపాధ్యాయులు తన పరిధిలో పనిచేసే ఉపాధ్యాయుల బోధనను గమనించాలి. నిమిష నిమిషానికి వారి ముఖ కవళికలు, విద్యార్థుల సంగ్రహక శక్తి, నోట్స్ రాయడం, వాటిని దిద్దడం, దృశ్య శ్రవణ మాధ్యమమైన ఐఎఫ్‌పి వినియోగం, బోధనాభ్యాసన సామాగ్రి, స్లీప్ టెస్టులు, వీటన్నింటినీ రికార్డుల్లో బంధించడం, కొన్నింటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం! ఉపాధ్యాయులు కళ్లు మూసినా తెరిచినా రిమార్కులు నమోదవుతాయి. మధ్యలో డైరీ రాయాలి, లెసన్ ప్లాన్ కౌంటర్ సైన్ చేయించడం. ఏమిటి బాదరాయణం? ఎందుకీ బ్రహ్మ పదార్థ విశ్లేషణ!
బోధనకు ఎన్ని రోజులు?
ఈ సందర్భంగా నేను ఒకే తరగతి సిలబస్ గురించి ప్రస్తావించదలచుకున్నాను. సబ్జెక్టు, తొమ్మిదో తరగతి ఆంగ్లం. సప్లిమెంటరీ రీడర్లో పాఠాలు, వర్కుబుక్ ఒక్కో యూనిట్‌లో మొత్తం 9 యూనిట్లు ఉన్నాయి. పేరాగ్రాఫ్‌లో నిడివిని బట్టి ఒక పీరియడ్లో 2 నుంచి 5 వరకు పేరాలు పూర్తి చేయవచ్చు. రీడర్లో ఒక పాఠం (రీడర్, పద్యం, సప్లిమెంటరీ రీడర్) వివరించి, కాంప్రహెన్షన్‌తో పాటు వర్క్ బుక్ ఎక్సర్ సైజులు పూర్తి చేయడానికి 25 రోజుల వ్యవధి అవసరమవుతుంది. అంటే 225 రోజులకు సరిపడా ప్రతి సబ్జెక్టుకు, ప్రతి టీచర్‌కు ఈ స్థాయి క్లిష్ట పరిస్థితులున్నాయి.
ముక్కు నేలకేసి గీక్కున్నా...
ప్రభుత్వం విడుదల చేసిన విద్యా సంవత్సరం కేలండర్‌లో 233 పనిదినాలుగా పేర్కొన్నారు. అందులో క్షేత్రస్థాయిలో వాస్తవ బోధనా కాలమెంతో, ఆ సమయంలో సిలబస్ పూర్తి చేయగలరా? అనే విషయాలను పరిశీలిద్దాం! నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు, రెండు సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు, ఇతరత్రా పరీక్షలకు 24 రోజులు రిజర్వ్ అవుతాయి. అలాగే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు నెలకు ఒకరోజు చొప్పున ప్రతి ఉపాధ్యాయుడు 8 రోజుల పాటు వెళ్లి తీరాలి. మీదు మిక్కిలి ఉపాధ్యాయుల వ్యక్తిగత సెలవులు 22 (మహిళా టీచర్లకు మరో 5 అదనం) వెరసి 44రోజుల పాటు ఉపాధ్యాయులు బోధనకు దూరంగా ఉంటారు. అంటే 233 రోజుల్లో 44 రోజులు పోతే 189 రోజులు మాత్రమే ఉపాధ్యాయుడి చేతిలో ఉంటాయి. మరి అలా తరగతుల బోధనను కోల్పోయి న సిలబస్ పూర్తి చేయడమెలా? ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల్లో కనీసం 50 శాతం మంది అవగాహన స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. హాజరు శాతం కూడా తక్కువే! ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ముక్కు నేలకేసి గీక్కున్నా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి.
అనధికారిక డిప్యూటేషన్లతో...
పూర్వం ఒక రాజు దేశంలోని గొర్రెలకు చలికోట్లు కుట్టిస్తామని ప్రకటించాడు. రాజుగారి వదాన్యతకు, తమ జాతి మీద కురిపిస్తున్న అవ్యాజమైన వాత్సల్యానికి మురిసిపోయి, సంబురాల్లో మునిగితేలాయి. అన్ని గొర్రెలకు కోట్లు కుట్టించడానికి అవసరమైన ఉన్ని ఎక్కడ నుంచి తెస్తారనే సూక్ష్మాన్ని గ్రహించలేకపోయాయి. మరుసటి రోజే దేశంలోని గొర్రెల శరీరాల నుంచి బొచ్చు కత్తిరించడం మొదలైంది. ఇక ఇంతకంటే వివరణ అక్కర్లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి ఆచార్యులు చేపట్టాలి. అలాకాకుండా ప్రాప్తకాలజ్ఞత లోపించిన అధికారులు 50 రోజులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, తీరా పాఠశాలలు తెరిచాక జుట్టు పీక్కోవడం షరా మామూలే! ఒకవైపు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిపై రోజుకో నిర్వచనం చెబుతూ, సంఖ్యను కుదిస్తూ సర్దుబాట్లు, అనధికారిక డిప్యూటేషన్లతో విద్యారంగం కుదేలైంది. పాఠశాల నిర్వహణ కుంటుపడకూడదనే సాకుతో బేల్దార్ మేస్త్రీ కూలీలను పంపినట్లు ఉపాధ్యాయులను రోజుకో పాఠశాలకు తరుముతున్నారు. అలా విద్యాబోధన కుంటు పడడానికి ప్రత్యక్ష కారణమవుతున్నారు. ఒక్కో తరగతి ఒక్కో రోజు ఒక్కో రకం పాఠశాలకు ఒక్కో రకం కేడర్ స్ట్రెంత్. పై పెచ్చు 117 జీఓ ద్వారా సంక్రమించిన చేసాను తొలగించకుండా, సమాంతర మాధ్యమం ఊసులేకుండా ముందుకు సాగుతుండటం గమనార్హం! ప్రణాళికాబద్ధమైన కృషికి ఆటంకం కలిగించే చర్యలివి. రాష్ట్రంలో పెద్దయెత్తున ఉపాధ్యాయ నిరుద్యోగిత, అదే సమయంలో అంతే స్థాయిలో తరగతి గదిలో కొరత వుంది. గత ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని చిన్నచూపు చూసింది. ఉపాధ్యాయులను పురుగుల్లా యేరిపారేసింది. వారి శక్తి సామర్థ్యాలను కరివేపాకులా తీసి పారేసింది.
పిచ్చి ముదరడమంటే ఇదేనేమో!
పిల్లలకు చదువు రావాలా వద్దా అనేది ప్రశ్న కాదు, తాము తెస్తున్న సంస్కరణలు అమలవుతున్నాయా? లేదా అనేదే అసలు ప్రశ్న. ఉపాధ్యాయులను గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఇరుకున పెట్టామా లేదా, పని భారం పెంచామా లేదా అనేవే అధికారుల ముందున్న కర్తవ్యాలు. విద్యపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సమాజం లేవనెత్తిన అసంఖ్యాకమైన ప్రశ్నలకు సరైన సమాధానమివ్వడానికి ఉత్తమ బోధన, విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమస్యలు పరిష్కరించగలిగే సమర్ధత పెంపొందించడం. వీటి నుంచి తప్పించుకుంటూ ఉపాధ్యాయ వర్గాన్ని చాకిరేవులో ఏకిపారేసే చర్యలు విద్యారంగాన్ని సంస్కరిస్తాయా? సామాజిక చైతన్యంపై తగిన దృక్పథం లేని పాలకులు కేవలం ఉపాధ్యాయుల జవసత్వాలను కుంగదీసే చర్యలు ఏమాత్రం సమంజసం కాదు.
మోహన్ దాస్,
ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు
94908 09909