నిరంతర అధ్యయన శీలి బి.ఎస్. రాములు

by Ravi |   ( Updated:2023-08-27 00:00:17.0  )
నిరంతర అధ్యయన శీలి బి.ఎస్. రాములు
X

సామాజిక తత్వవేత్త బి. ఎస్ రాములు సామాజిక ఆర్థిక సాంఘిక సాహిత్య రంగాల్లో విస్తృతమైన అధ్యయనం చేశారు. ఆయన నిరంతర అధ్యయన శీలి. హెగెల్ డైలెక్టిక్స్ శాస్త్రాన్ని సాకల్యంగా చదివారు. దాన్ని భారతదేశానికి అన్వయించి మనదేశంలో ప్రధానమైనది కులం అని తేల్చారు. ఈయన రాసిన 'గతి తర్క తత్వ దర్శన భూమిక' గతి తార్కిక చారిత్రక భౌతిక వాద పరిశీలనలో అత్యున్నత గ్రంథాల్లో ఒకటిగా నిలిచింది. స్టాలిన్ 'గతి తార్కిక భౌతికవాదం' మీద ఒక గ్రంథం రాశారు. మావో వైరుధ్యాలు అనే గ్రంథం ప్రాతిపదికగా డైలెక్టికల్ మెటీరియలిజం మీద రాశారు. కార్న్‌ఫోర్త్ 'డైలెక్టికల్ మెటీరియలిజం' ఆధారంగా సామాజిక అంశాలను పరిశీలించి ఒక మహత్తర గ్రంథం రాశారు. అది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.

కులమే వైరుధ్యానికి కారణమని…

ఆ స్థాయిలో బిఎస్ రాములు గతి తార్కిక భౌతికవాదం, కుల సమస్య మీద రాయగలిగారు. కారణం ఏమిటంటే ఆయన బేసికల్‌గా ఫిలాసఫర్. జర్మన్ ఫిలాసఫర్స్ లో కాంట్, హెగెల్, కారల్ మార్క్స్ సమాజ వైరుధ్యాల మీద చాలా కృషి చేశారు. భారతదేశంలో ఇటువంటి కృషి తక్కువగా జరిగింది. నిజానికి సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ ఆచార్య నాగార్జున , దిగ్నాగుడు , ధర్మకీర్తి రచనలు కూడా డైలెక్టిక్స్ ‌తోనే నడిచాయి. భావ వైరుధ్యాలు, భౌతిక వైరుధ్యాలు, మానసిక వైరుధ్యాలు, సామాజిక వైరుధ్యాలు చర్చించడం ద్వారానే తత్వశాస్త్రం నిగ్గు తేలుతుంది. అది భారతదేశంలో ప్రధాన వైరుధ్యం కులం అని మహాత్మా జ్యోతిరావు ఫూలే 'గులాంగిరి'లో, అంబేద్కర్ 'కుల నిర్మూలన' గ్రంథంలో చెప్పారు. దాన్ని భారతీయ కమ్యునిస్టు సిద్ధాంత కర్తలు నిర్లక్ష్యం చేశారు.

బి. ఎస్. రాములు 'గతి తర్క తత్వ దర్శన భూమిక'పై అంబేద్కర్ 'కుల నిర్మూలన' గ్రంథ ప్రభావం ఉంది. ఈయన కొండపల్లి సీతారామయ్య గ్రూపులో తాత్విక భావజాల నిర్మాణంలో ప్రధానంగా పాల్గొన్నారు. కేజీ సత్యమూర్తి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి వీళ్లంతా కూడా నక్సల్ బరి ఉద్యమ ప్రతినిధులుగా భారతదేశంలో సాయుధ పోరాటం గూర్చి చాలా చర్చలు సాగించారు. కానీ ఈ చర్చల్లో ఎక్కడ కూడా ఫూలే, అంబేద్కర్‌ల ప్రస్తావన రాకపోవడం ఆశ్చర్యమే. వీరందరూ కూడా చారుమజుందార్, కానూ సన్యాల్, రణధివే భావజాలాలకే పరిమితమయ్యారు. బి ఎస్ రాములు నక్సల్బరీ ఉద్యమం నుండి బయటకు వచ్చాక లోతుగా అధ్యయనం చేసి ప్రధాన వైరుధ్యం కులం అని తేల్చారు. అది చాలా కొత్త పరిణామానికి దారి తీసింది.

ఎంతో అధ్యయనం చేసి..

కారంచేడు ఉద్యమ ప్రభావం నక్సల్ బరీ అన్ని గ్రూప్‌ల నుండి బయటకు వచ్చిన వారందరి మీద ఉంది. బిఎస్ రాములు లాగా గతి తార్కిక చారిత్రక భూమిక అనే గ్రంథాన్ని ఎవరూ రాయలేదు. ఈ గ్రంథం ఆంధ్రదేశంలో సంచలనాలు కలిగించింది. బిఎస్ రాములుపై హెగెల్ ప్రభావం బలంగా ఉంది. బౌద్ద ప్రతీతి సముత్పాద ప్రభావం ఉంది. హెగెల్ ప్రభావానికి గురికాని జర్మన్ తత్వవేత్తలు ఎవరూ లేరు. ముఖ్యంగా మార్క్స్, ఏంగిల్స్ కూడా చాలాకాలం ఆయన ప్రభావం లోనే ఉన్నారు. బి ఎస్ రాములు మీద మహాత్మా ఫూలే, అంబేద్కర్ ప్రభావాలు కూడా బలంగా పడ్డాయి. ఆ తర్వాత ఆయన బుద్ధుడిని, మహాత్మ పూలేని, అంబేద్కర్‌ని సాకల్యంగా అధ్యయనం చేశారు. బి ఎస్ రాములు ఎన్నో సంస్థల నిర్మాత. సామాజిక విప్లవకారుడు. నాతో, దళిత ఉద్యమంతో కలిసి నడిచారు. అనేక సందర్భాల్లో ఆయన మమ్మల్ని ఉత్తేజపరిచారు. ముఖ్యంగా నా పుస్తకాలకు పీఠికలు ఆయన రాయడమే కాక ఆ పీఠికలను సంకలనంగా కూర్చి యుగకర్త డాక్టర్ కత్తి పద్మారావు అనే పుస్తకాన్ని నా 70వ జన్మ దినోత్సవానికి తీసుకురావడం ఆయన సౌహార్ధతకు నిదర్శనం.

ముఖ్యంగా 75 ఏళ్లు వచ్చినా ఆయన నిరంతరం చెబుతూ, రాస్తూ, ఎన్నో కార్యక్రమాలకు హాజరవుతూ తపస్విలా ఆయన జీవించారు. కొన్ని వందల మంది పుస్తకాలకు పీఠికలు రాసి ప్రోత్సహిస్తున్నారు. నిజానికి పుట్టక నిర్మాణంలో ఆయనది ఒక కొత్త బాట. ఆయనే స్వయంగా కర్షక్ చరిత, అనుపమ వంటి ప్రెస్‌లకు హాజరై పుస్తక ముద్రణలో పాల్గొంటారు. ఆయనే గొప్ప ప్రూఫ్ రీడర్. తన పుస్తకాలన్నీ తానే ప్రూఫ్ చూసుకోగలరు. ఆయన ఎన్నో సంస్థలను నిర్మించడమే కాక వాటికి ప్రణాళికలు రచించారు. తెలంగాణపై విస్తృత అధ్యయనం చేసి ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు తీసుకొచ్చి తెలంగాణ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విప్లవం కోసం ఆయన ఇంకా పోరాడుతున్నారు.

బిఎస్ రాములు గొప్ప స్నేహితులు. మానవతావాది. గొప్ప మనిషి. సౌశీల్యవంతులు. హెగెల్ డైలెక్టిక్స్‌లో విస్తృతాధ్యయనం దాగి ఉంది. ముఖ్యంగా ఆయన రీజన్, తర్కం, విశ్లేషణ సామర్ధ్యాన్ని బీఎస్ రాములు తన గ్రంథాల్లో వెలువరించారు. ఇంకా భారతదేశంలో హెగెల్ డైలెక్టిక్స్ మీద కృషి జరగాల్సి ఉంది. నేనొక విద్యార్థిగా నిరంతరం జర్మన్ ఫిలాసఫర్స్‌ను చదువుతూనే ఉంటాను. బిఎస్ రాములుతో 33 ఏళ్లుగా రోజూ ఏదో ఒక సమయంలో చర్చిస్తూనే ఉన్నాను. ఆయనలో ఇండెప్త్ నాలెడ్జ్ ఉంది. అభివ్యక్తి సామర్థ్యం, ముద్రణ సాంకేతికత ఉంది. మన తరంలో ఆయనతో స్నేహితునిగా మనము ఉన్నామని చెప్పుకోవడం ఓ గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఆయన మా కుటుంబ స్నేహితులు. ఉద్యమ స్నేహితులు. నా రచనా క్రమానికి ప్రోత్సాహకులు, ప్రేరకులు. వారి 75వ జన్మదినం సందర్భంగా వారి జన్మదినోత్సవానికి శుభాభినందనలు తెలుపుకుంటున్నాను.

( బి.ఎస్. రాములు 75వ జన్మదినోత్సవం)

డా. కత్తి పద్మారావు

98497 41695

Advertisement

Next Story

Most Viewed