పునురుత్తేజ భారత్ జోడో యాత్ర

by Ravi |   ( Updated:2022-11-03 18:45:17.0  )
పునురుత్తేజ భారత్ జోడో యాత్ర
X

1942లో భారత్‌లో కొనసాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో 2022లో రాహుల్‌గాంధీ 'భారత్ జోడో యాత్ర' ను ప్రారంభించారు. కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర కాశ్మీర్ వరకు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఐదు నెలల పాటు కొనసాగనుంది. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, వివిధ కులాలు, మతాలతో భిన్నత్వంలో ఏకత్వంలా కలిసి జీవించే దేశం మనది. నేడు పాలకులుగా ఉన్న మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని విడిపించి ప్రజలను ఐక్యం చేసి వారి మధ్య సోదర భావం పెంచడం ఈ యాత్ర ఉద్దేశ్యం.

మత, ప్రాంతీయ, విద్వేష రాజకీయాల వలన తన నాయనమ్మను, తండ్రిని కోల్పోయిన రాహుల్ దేశంలో ఎవరికి ఇలాంటి పరిస్థితి రావద్దని పరితపిస్తూ ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. దేశ సౌఖ్యం కోసం అట్టడుగు వర్గాల సంక్షేమం కుల మత ప్రాంతం, మహిళలు, పురుషుల భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు రావాలని, తన పార్టీలోనే సంస్కరణలు రావాలని ఆయన ఆశిస్తున్నారు.

ఆశా కిరణంగా

దేశంలో అసహన, మతోన్మాద, విభజన రాజకీయాలు పెరిగిపోతున్నాయి. నిరుద్యోగం ప్రబలుతోంది. ధరలు చుక్కలనంటుతున్నాయి. వ్యవస్థల నిర్వీర్యం, విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ అన్ని అంశాల మీద ప్రజలను చైతన్య పరుచుకుంటూ యాత్ర ముందుకు సాగుతున్నది. ప్రజల ఇబ్బందిని గుర్తించి అప్రమత్తం చేయడంతోపాటు ప్రజా మద్దతుతో శాంతియుత మార్గంలో విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కొవడానికి బయలుదేరినట్లుగా ఉంది. ప్రజల మనసులను అర్థం చేసుకోని పాలకులను ఎండగడుతూ, ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ, ప్రజాసంఘాలు, మేధావి వర్గాలతో సమావేశమవుతూ రాహుల్ కొత్త ఆశలను రేకెత్తిస్తున్నారు.

యాత్రలో కులమతాలకు అతీతంగా పాల్గొంటున్న చిన్న,పెద్ద ధనిక, పేద ప్రజలను చూస్తుంటే దేశాన్ని ఇక ఏ శక్తులూ ఏమీ చేయలేవనే నమ్మకం కలుగుతోంది. రాజ్యాంగ మూల సూత్రాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలకు విరుద్ధంగా, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా 'ఒకే దేశం-ఒకే భాష-ఒకే పన్ను' నినాదంతో పాలిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా వికసించిన ఆశాకిరణంగా ఈ యాత్రను ప్రజలు విశ్వసిస్తున్నారు.

Also read: కాంగ్రెస్ పునర్ వైభవానికి ఒకప్పుడు వాడిన ఫార్ములా! నేడు అవసరమేనా?

ఆ పాలనకు తీసిపోని విధంగా

తన పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నా, దేశంలో మార్పు రావాలని అనునిత్యం పరితపించే నాయకులలో రాహుల్‌గాంధీ ఒకరు. అందుకే పార్టీని ప్రక్షాళన గావిస్తున్నారు. పాత, కొత్త తరం నాయకుల ఆశలకు ఆశయాలకు వారధిగా నడుస్తున్నారు. అందరి ఆప్యాయతలు పొందుతున్న యాత్ర కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో సాగుతోంది. 60 యేళ్ల పోరాటం తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో మోడీకి తీసిపోని విధంగా పాలన ఉంది.

నియంత పాలనతో విసుగు చెందిన ప్రజలు ప్రత్యామ్నాయ నాయకుడి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.అందుకే ఈ యాత్రలో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తెలంగాణ ప్రజలలో ఉన్న ఆకాంక్షను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గుర్తించాలి. అంతర్గత సమస్యలను పరిష్కరించుకొని ప్రజా శ్రేయస్సు కోసం ఐక్యంగా ఉండాలి.


వలిగొండ నరసింహ

పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్

ఓయూ, హైదరాబాద్

9160961717

Advertisement

Next Story

Most Viewed