అస్సామీ సాంస్కృతిక బావుటా..భూపేన్ హజారికా

by Ravi |   ( Updated:2024-11-09 01:00:38.0  )
అస్సామీ సాంస్కృతిక బావుటా..భూపేన్ హజారికా
X

'దిల్ హూం హూం కరే ఘబ్ రాయే..', 'విస్తార్ హాయ్ అపార్ ప్రజా దోనో పార్'.. భూపేన్ హజారికా రాసిన నిరుపమానమైన ఈ పాటలు వినగానే దుఖం, వేదన, కోపం, ఆవేశం, ఆలోచన ఒకటేమిటి అనేక భావాలు ఉత్తుంగ తరంగంగా మనలో మెదులుతాయి.. మనసంతా అదుపు తప్పుతుంది. చేతనమయిపోతుంది.. మనసంతా కలి కలి..కలకలం.. ఒక్క మీరూ నేనే కాదు.. మన దేశమే కాదు.. సమస్త ప్రపంచమూ భూపేన్ హజారికా పాటలకూ సంగీతానికీ దాసో హం అన్నది. మైఖేల్ జాక్సన్ ని అభిమానించిన వారు సైతం భూపేన్ స్వరానికి, సంగీతానికీ .. ఊగిపోయారు.

భూపేన్ హజారికా ఈశాన్య భారతావనిలో పుట్టిన వాడు. అక్కడి సంగీతాన్నీ సాహిత్యాన్నీ, జీవితాల్నీ సంగీత ప్రపంచానికి పరిచయం చేసి ఓహో అనిపించారు. మనుషుల్ని వారి మనసుల్నీ ఆయన ఇట్టే పట్టేస్తాడు.. తన పాటల వెంట లాగేసుకుంటాడు.. హజారికా గీతాల్లో అస్సాం కనిపిస్తుంది.. ఆయన పాటల్లో అస్సామీ ప్రజలు వినిపిస్తారు.. ఆ గానంలో ఒంటరితనమూ వుంది.. సామూహిక స్వరమూ ధ్వనిస్తుంది.. భూపేన్ హజారికా కేవలం అస్సాం జానపద పాటలు పాడడు.. మొత్తంగా అస్సామీ సంస్కృతిని ఆ‌వాహనం చేసుకుని హృదయాన్ని ఆవిష్కరిస్తాడు..

మంత్రముగ్ధ సంగీతం

‘సుధాకాంత’, ‘బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు’(బాలడ్ ఆఫ్ బ్రహ్మపుత్ర)గా సుప్రసిద్ధుడైన భూపేన్ హజారికా కవి, రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు, సినిమా దర్శకుడు, జర్నలిస్ట్. అంతే కాదు ఆయనకాయనే తానో జాజాబోర్ (దేశ దిమ్మరి) అని ప్రకటించుకున్న కళాకారుడు. అస్సామ్ జానపద సంగీతానికి కొంత శాస్త్రీయ సంగీతాన్ని మేళవించి ప్రపంచాన్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు. ఆయన రచనల నిండా మానవీయత, మతసామరస్యం, సహానుభూతి నిండి వుంటాయి. అస్సామీ, బెంగాలీ, హిందీ భాషల్లో గానం చేసి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారు. భూపేన్ హజారికా ఈశాన్య భారతంలో అస్సామీ చలనచిత్ర వైతాళికుడు. ఆ రాష్ట్రంలో మొట్టమొదటి ఫిలిం స్టూడియో నిర్మించింది ఆయనే. ప్రపంచానికి అస్సామీ సినిమాను పరిచయం చేసింది కూడా ఆయనే.

ఆదివాసీ ఆటపాటలు అంతర్భాగమయ్యాయి..

భూపేన్ హజారికా 1926 సెప్టెంబర్ 8న అస్సాం లోని సదియా గ్రామంలో జన్మించాడు. ఆయన పుట్టిన ప్రాంతమంతా ఆదివాసీలు నివసించే ప్రాంతం. అక్కడి మహిళలు గొప్పగా నృత్యం చేస్తూ పాటలు పాడేవాళ్లు. బాల్యంలోని ఆ సంగీతం పాటలు భూపేన్ మనసులో నాటుకు పోయాయి. బాల్యంలోనే ఒక రోజు ఆదివాసీ మహిళలతో కలిసి వెళ్లిపోయాడు. భూపేన్ తల్లిదండ్రులు ఆందోళనతో అంతటా వెతికి వేసారి దొరక్కపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందారు. మర్నాడు ఉదయం ఆ మహిళలే పిల్లాన్ని తెచ్చి అప్పగించడంతో. ‘వీడు తల్లి పాలు తాగేవాడు కదా రాత్రంతా ఎట్లా వున్నాడు’ అని అడిగితే ఆదివాసీల మహిళలే తమ పాలిచ్చి పడుకో బెట్టామని చెప్పారు. అట్లా చిన్ననాటినుండే ఆదివాసీ ఆట పాటలు భూపేన్‌లో అంతర్భాగమయిపోయాయి.

భూపేన్‌కు చిన్న‌తనం నుండే పాటలు రాయడం పాడడం స్వభావ సిద్ధంగా అబ్బింది. ఆరవ తరగతి చదువుతూ ఉండగానే తన తొలి పాట రాశాడు. దానికి అవార్డును కూడా గెలుచుకున్నాడు. అదంతా విన్న ప్రముఖ సంగీతజ్ఞులు జ్యోతిప్రసాద్ ఆగర్వాల్, విష్ణు రాఖాలు హజారికాను కలకత్తా తీసుకెళ్ళి సంగీతంలో శిక్షణ ఇప్పిస్తామని తీసుకెళ్ళారు. అప్పుడే బెంగాలీ సినిమాలో పాటలు పాడించారు. అట్లా మొట్టమొదటి సారి హజారికా ‘జాయ్ మతి’, ‘శోనిత్ కున్వారీ’ సినిమాల్లో పాటలు పాడి బాల ప్రతిభాశాలిగా పేరు తెచ్చుకున్నాడు.

సంగీతం, దర్శకత్వం

కొలంబియా వర్సిటీలో పరిశోధన ముగిసిన తర్వాత ఇండియా వచ్చిన భూపేన్ హజారికా క్రమంగా బెంగాలీ సినిమాలకు సంగీతం అందించడం మొదలు పెట్టాడు. ‘ఎరా బతుర్ సుర్’, ‘శకుంతల’, ‘ప్రతిధ్వని’, ‘లోతి ఘోటి’, ‘చిక్మిక్ బిజిలీ’, ‘మొన్ పతి’, ‘స్వికరోక్తి’, ‘సిరాజ్’ లాంటి అనేక సినిమాలకు సంగీతంతో పాటు పాటలూ పాడారు. తానే స్వయంగా ‘మాహుత్ భండూరే’ లాంటి సినిమాల్ని రూపొందించాడు. ఇంకా అరుణాచల్‌ప్రదేశ్‌లో మొట్ట మొదటి హిందీ కలర్ సినిమా ‘మేరా ధరం మేరి మా’ సినిమాను నిర్మించడంతో పాటు దర్శకత్వం సంగీత దర్శకత్వ బాధ్యతల్నీ తీసుకున్నారు. అరుణాచల్ రాష్ట్రం కోసం ఆదివాసీ నృత్య సంగీ తంతో కూడిన ‘హూం ద సన్ శైన్స్’ అన్న డాక్యుమెంటరీ తీశారు.

చరిత్ర సృష్టించిన 'రుడాలి'

ఇక “రుడాలి” చిత్రం భూపేన్ హజారికా సంగీత జీవితంలో అత్యంత ప్రభావంతమయినదిగా పేరొందింది. అందులో ఆయన అందించిన సంగీతంలో భైరవి రాగంతో కలిపి అయిదు రాగాల్ని జానపద సంగీతంతో సమ్మిళితం చేసి సృష్టించారు. ఇందులో మొత్తం జైసల్మేర్‌కు చెందిన సంగీత వాయిద్యకారులనే ఉపయోగించారు. రుడాలికి కల్పనా లాజ్మీ, గుల్జార్‌లు స్క్రీన్ ప్లే రాసారు. ఆ స్క్రీన్‌ప్లేను ముందుంచుకుని ఆ సినిమాకు సినిమాటోగ్రఫీ‌ని నిర్వహించిన సంతోష్ శివన్‌తో ఒక్కో సీన్‌నూ చర్చిస్తూ దానికి తగ్గట్టుగా సంగీతాన్ని రూపొందించారు. అందుకే ఆ సినిమాలో ఏ పాటా సినిమాకు గానీ, కథకు గానీ, కథనానికి దృశ్యానికే గానీ వేరుగా అనిపించదు. అన్నీ సమ్మిళితమయిపోయి ప్రేక్షకుల్ని వాటిల్లో మమేకం చేస్తాయి. అందుకే రుడాలి పా టలు అప్పటికీ ఇప్పటికీ ‘సమయ్ ఓ దీరే చలో ’ అంటూ శ్రోతల్ని మమేకత్వంలో నింపేస్తున్నాయి. రుడాలిలో డింపుల్ కపాడియా, రాఖీ, రాజ్ బబ్బర్, అమ్జద్ ఖాన్‌లు ప్రాధాన పాత్రల్ని పోషించారు. ఆ సినిమా జాతీయ అవార్డుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు గడించింది.

అవార్డుల వెల్లువ..

సంగీతమే తన మొదటి ప్రాముఖ్యత ‘మై ఫస్ట్ లవ్’ అని చెప్పిన భూపేన్ హజారికా సినిమా సంగీతం, పాటలతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ తో శ్రోతల్ని విశేషంగా ఆకర్షించాడు. భూపేన్ హాజారికా అమెరికాలో ఉన్నప్పుడే పాల్ రాబ్సన్‌ని కలిసాడు. అప్పుడే ఆయనకు భారతీయ జానపద పాటలకు గాను అమెరికాలో బంగారు మెడల్ లభించింది. భూపేన్ హజారికా అందుకున్న అవార్డులకు లెక్కేలేదు.ఆయనకు 1961 లో అస్సామీ సినిమా ‘శకుంతలకు’ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డు, 1967లో ఉత్తమ సంగీతానికి గాను ‘చమేలీ మేమ్సాబ్’కు, అవార్డులు లభించాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’, లభించాయి. మరణానంతరం ఆయనకు కేంద్రం ‘భారతరత్న’ అవార్డు ఇచ్చి గౌరవించింది.

బాలడ్ ఆఫ్ బ్రహ్మపుత్ర

భూపేన్ హజారికా అనేక ఆరోగ్య సమస్యలతో 2011‌వ సంవత్సరంలో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చేరారు. అదే సంవత్సరం నవంబర్ 5న మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో తుదిశ్వాసను విడిచారు. భూపేన్ హజారికా అంత్యక్రియలలో అయిదు లక్షల మంది పాల్గొన్నారు. ఆయన ఈశాన్యభారతం అందించిన ‘బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు’(బాలడ్ ఆఫ్ బ్రహ్మపుత్ర). ఆయన గురించీ ఆయన అందించిన సంగీతం గురించీ ఎంతచేప్పుకున్నా కొంత మిగిలే వుంటుంది.

- వారాల ఆనంద్

94405 01281

Advertisement

Next Story

Most Viewed