- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలుగు సినిమా.. గర్వించగల గొప్ప చిత్రం “అంకురం”
"తల్లులు మాత్రమే భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. తమ పిల్లల ద్వారా ఆ భవిష్యత్తుకి జన్మనిస్తారు కాబట్టి” అంటారు ప్రముఖ రచయిత మక్సిం గోర్కి. ఈ భవిష్యత్తు అన్న పదానికి పరిమితి ఎంతవరకు అన్నది ఆలోచించ వలసిన విషయం. తమ బిడ్డల ద్వారా భవిష్యత్తుని సృష్టించే తల్లి తనకు భవిష్యత్తు నిర్మించుకోవాలా, తన కుటుంబ భవిష్యత్తు నిర్మించాలా, తన ఊరి, దేశ భవిషత్తు గురించి ఆలోచించాలా, లేదా మానవ జాతి భవిష్యత్తు గురించి ఆలోచించాలా అన్నది నిరంతరం స్త్రీలు తమను తాము వేసుకోవలసిన ప్రశ్న. నేను చూసిన తల్లులందరూ తన, లేదా తన కుటుంబం వరకే ఆగిపోయి ఉన్నవారు. తన కుటుంబం, తన బిడ్డలు వరకే స్త్రీ పరిమితం అవడం తప్పు కాదు. కొన్ని సార్లు అదే ఆమె బాధ్యత కూడ కావచ్చు. అయినా మానవజాతి భవిష్యత్తుని గురించి ఆలోచించగల శక్తి ఒక్క తల్లికి మాత్రమే ఉంటుందన్న నిజాన్ని ఒప్పుకోవలసిందే. ప్రస్తుతం పరిమితులు విధించుకున్న మాతృత్వానికి బందీలుగా మిగిలిపోయిన తల్లుల చిన్న మనసులు సృష్టించే భవిష్యత్తు, అంతే అర్ధహీనంగా ఉంటుందని మాత్రం అందరూ అంగీకరించవలసిన వాస్తవం.
కాని తన బిడ్డ ప్రాతినిధ్యం వహించే ఆశయాలు, ఆదర్శాలు, నడిచే మార్గం మీద ఓ తరం భవిష్యత్తు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నదన్న విషయాన్ని తల్లులు విస్మరించకూడదు. అందుకే బిడ్డల ద్వారా సమాజానికి అందే భవిషత్తుపై ఎంతో శ్రద్ద పెట్టవలసిన బాధ్యత తల్లులదే. ఈ మార్గంలో ఎన్ని అవరోధాలెదురయినా తల్లి కొన్ని సార్లు బిడ్డలతో కూడా పోరాడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆమె పిల్లల ద్వారా ఈ సమాజం నడిచే భవిష్యత్తు మార్గంలో ఆమె ప్రమేయం కూడా ఉంటుంది కాబట్టి.
సింధూర పాత్ర ఓ ఆణిముత్యం..
స్త్రీలో ఉండవలసిన ఈ విశాలమైన మాతృత్వపు దృక్కోణాన్ని తట్టి లేపిన చిత్రం “అంకురం”. సింధూర ఓ నవ వివాహిత. తన అత్తవారింటికి పుట్టింటి నుండి చీర సారతో బయలుదేరుతుంది. దారిలో సత్యం అనే ఓ పల్లెటూరి యువకుడు ఏడుస్తున్న తన బిడ్డకు పాలు తీసుకువస్తానని చెప్పి ఎదురు సీట్లో కూర్చున్న సింధూర ఒడిలో బిడ్డను ఉంచి స్టేషన్ లో దిగుతాడు. అంతే ఇక రైలు ఎక్కడు. ఆ బిడ్డతో అత్తగారిల్లు చేరుతుంది సింధూర. కొత్త కోడలు కాపరానికి బిడ్డతో వచ్చి ఆ బిడ్డ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుంటే చూసి తట్టుకునే ఆదర్శవాదులు ఎందరు? ఆమెకు సహజంగా ప్రతిఘటన ఎదురవుతుంది. బిడ్డ తండ్రి గురించి వాకబు చేయడానికి పోలీసుల సహాయం తీసుకుంటారు సింధూర, అమె భర్త. పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళితే, పోలీసులు అదో విషయం కాదని కొట్టిపడేస్తారు.
సత్యం దిగిన స్టేషను దగ్గరకు వచ్చిన సింధూర అక్కడ ఓ బిచ్చగత్తె చేతిలో పాల బాటిల్ చూస్తుంది. ఇది సత్యం తన కొడుకు పాల కోసం కిందికి దిగినప్పుడు అతను తీసుకెళ్ళిన బాటిల్ అని గుర్తు పట్టిన సింధూర ఆ బాటిల్ ఆమెకు ఎక్కడ దొరికిందో చెప్పమని అ బిచ్చగత్తెను అడుగుతుంది. ఆ బాటిల్‌తో ట్రైన్ దిగిన వ్యక్తిని పోలీసులు తీసుకెళుతుంటే అది అతని చేతినుండి జారి పడిపోయిందని చెబుతుంది ఆ బిచ్చగత్తె. ఈ సంగతి పోలీసులకు చెప్తావా అని సింధూర అడిగినప్పుడు ఆమె ఒప్పుకుంటుంది. మళ్ళీ భర్తతో స్టేషన్ కు వెళ్ళిన సింధూర చెప్పింది విని పోలీసులు ఆమెతో స్టేషన్‌కు వస్తారు. అయితే అక్కడ ఆ బిచ్చగత్తె ఉండదు. తమ టైం వేస్ట్ చేసిందని సింధూరని అవమానిస్తారు పోలీసులు.
మళ్ళీ బిడ్డతో వెతుకులాట మొదలెడుతుంది సింధూర. ఆమె భర్తకి ఇది విసుగనిపిస్తుంది. చివరకు ఒక్కత్తే ఆ బిడ్డ తండ్రి కోసం గాలిస్తూంటే ఆ బిడ్డను సత్యం తీసుకురమ్మన్నాడని చెప్పి ఒకామె సింధూర చేతిలో బిడ్డను తీసుకోబోతుంది. సత్యాన్ని కలిసే బిడ్డను ఇస్తానని సింధూర ఎదురు తిరుగుతుంది. సరే అని ఆమెను ఓ ఇంటికి తీసుకుని వెళుతుంది ఆమె. అక్కడే పోలీసులు వ్యభిచారం కేసులో సింధూరను అరెస్ట్ చేస్తారు. కోర్టులో జడ్జి ముందు ఆమెను వ్యభిచారినిగా ప్రవేశపెడతారు. తాను ఏ తప్పూ చేయలేదని ఆ బిడ్డ తండ్రిని వెతకడమే తాను చేసిన తప్పని కోర్టులో బావురుమంటుంది సింధూర. అక్కడే ఉన్న లాయర్ విశ్వం ఆమెను గమనిస్తాడు. అంతకు ముందు భర్తతో సింధూర మొదటి సారి పోలీస్ కంప్లయింట్ ఇవ్వడానికి స్టేషన్‌కి వచ్చినప్పుడు అతను మరో కేసు విషయంలో అక్కడే ఉంటాడు. సింధూర ఓ పెద్ద ఊబిలో చిక్కుకుందని అతనికి అర్ధం అవుతుంది. ఆమెను జామీనుపై విడిపించి ఆమె కేసు తాను తీసుకుంటానని ప్రకటిస్తాడు. సింధూర భర్త పేపర్‌లో వచ్చిన సింధూర అరెస్ట్ వార్తతో ఆమెతో తెగతెంపులు చేసుకుంటాడు. సింధూర తండ్రి పంచన చేరుతుంది. అయినా సత్యం గురించి వాకబు చేయడం మానదు. సత్యం కోసం పోలీస్ స్టేషన్లోని సెల్‌లు వెతికే పర్మిషన్ సంపాదిస్తాడు విశ్వం. ఒక సెల్‌లో గోడపై సత్యం సంతకం చూస్తుంది సింధూర. అతను రైలులో వదిలి వెళ్ళిన సంచిలో ‘మాలపల్లి’, ‘అమ్మ’ పుస్తకాలుంటాయి. వాటి ముందు పేజీలలో సత్యం సంతకం ఉంటుంది. అది గోడ మీద సత్యం సంతకంతో పోలి ఉండడంతో పోలీసుల కుట్ర విశ్వానికి అర్ధం అవుతుంది.
సాక్షిని చితగ్గొట్టిన రాజ్యం..
పోలీసులు అరెస్ట్ చేసిన రోజున సత్యంతో పాటు అదే సెల్‌లో ఓ బ్లాక్ టికెట్ అమ్మే వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యి రాత్రి గడిపాడని విశ్వం తెలుసుకుంటాడు. అతన్ని కలిసి న్యాయాన్ని గెలిపించడానికి కోర్టుకు వచ్చి సత్యాన్ని అ సెల్‌లో తాను చూసానని సాక్ష్యం చెప్పమని కోరతాడు విశ్వం. ఎంతో ఉత్సాహంతో ఓ మంచి పని చేస్తున్నాననే ఆలోచనతో దీనికి ఒప్పుకున్న ఆ వ్యక్తి, చివరికి ఒంటి నిండా గాయాలతో కోర్టుకి వచ్చి ఎవరో ఓ అనామకుడిని ఆ రోజు తాను చూసిన సత్యంగా గుర్తు పడతాడు. అతని సాక్ష్యం వెనుక ఉన్న క్రూరమైన హింసను విశ్వం అర్ధం చేసుకుంటాడు. ఈ క్రమంలోనే సింధూర ఇంటిపై పోలీసులు దాడి చేస్తారు. ఆ కుటుంబం అంతా వెలివేతకు గురయి బతుకుతూ ఉంటుంది. సింధూరకు పూర్తి సహకారం అందించేది ఆమె తండ్రి ఒక్కడే. ఈ సినిమాలో ఈ తండ్రి పాత్ర నిజంగా ఓ అద్భుతం. అతను కూతురిలో నింపే స్ఫూర్తి ప్రేక్షకులనీ తాకుతుంది. సింధూరకు విడాకుల పేపర్లు అందుతాయి. మౌనంగా వాటిపై సంతకం పెట్టి ఒంటరి పోరాటానికి సిద్దపడుతుంది సింధూర.
విశ్వం సత్యం ఊరి గురించి తెలుసుకుంటాడు. ఆ గిరిజన వాడలోని వ్యక్తులపై అధికారం చెలాయించే వ్యక్తులు చేసే జులుం గురించి వివరాలు సేకరిస్తారు. ఆ ఊరిలో గిరిజన వాడను ఈ మధ్యే తగలబెట్టారని తెలుసుకుని ఓ జర్నలిస్టుల బృందంతో వివరాల సేకరణ కోసం ఆ ఊరికి వెళతాడు. ఈ బృందంలో కలిసి సింధూర కూడా ఒక సభ్యురాలిగా బయలుదేరుతుంది. వీరికి ఊరి వారెవ్వరూ సహకారం అందించరు. గిరిజనులు చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీస్ ఆఫీసర్ భార్య మాత్రం వీరికి నిజం చెబుతుంది. ఆ గిరిజన వాడలో ప్రజల డాక్టర్ మిత్ర. గర్బవతి అయిన సత్యం భార్యను పోలీసులు సత్యం గురించి చెప్పమని వీధిస్తూ అరెస్ట్ చేస్తారు. ఆమె నిండు చూలాలని తెలిసి కూడా పెద్ద బిడ్డకు పాలు ఇవ్వడానికి ఆమె అనుమతి కోరిందని ఆమెకు భయంకరమైన శిక్ష విధిస్తాడు ఆ ఆఫీసర్. దానితో సత్యం భార్య మరణిస్తుంది. ఆగ్రహంతో గిరిజన ప్రజలు పోలీసు ఆఫీసర్‌ను చంపేస్తారు. పోలీసులు దీనికి ప్రతీకారంగా క్లినిక్‌లో ఉన్న మిత్రా డాక్టర్‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపేస్తారు. దీన్ని ఓ ఫోటోగ్రాఫర్ ఫొటొలు తీస్తాడు. అతన్ని తరుముతున్న వారినుండి తప్పించుకోవడానికి అతను ఊరూ దాటుతూ తనకు ఎదురొచ్చిన సత్యంకి ఆ రీల్ ఇస్తాడు. ఊరిలోకి వెళితే ప్రమాదమని తండ్రి చెప్పడంతో తన బిడ్డతో సత్యం పారిపోతాడు.
సత్యం పాత్రకు ప్రాణంపోసిన ఓంపురి..
ఊరి రాజకీయాల గురించి సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రారు. ఆ కేసును చూస్తున్న ఎస్. ఐ. కూతురు ఈ బృందానికి ఆశ్రయం ఇస్తుంది. కాలేజీ గొడవల్లో అందరూ చూస్తూ ఉండగానే క్లాస్ రూం లో ఓ అహంకారపు స్టూడెంట్ పెట్రోల్ పోసి ఆమెను తగలబెడతాడు. అందరి ముందు నిస్సహాయంగా కాలిపోయిన తన కూతురుని చూసినప్పుడు కాని ఈ సిస్టంలో తానే వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ ఎస్. ఐ. కి అర్ధం కాదు. చివరకు అతనే సత్యాన్ని కోర్టులో హాజరు పరుస్తాడు. తాము చేసిన ఈ అరెస్ట్ వెనుక పోలీసు రాజకీయాన్ని బయటపెడతాడు. కోర్టులో సింధూరను చూస్తూ అలాంటి తల్లులున్నంత వరకు తమ బిడ్డల భవిష్యత్తుకు బెంగలేదంటూ సత్యం కూలబడిపోయే ఆఖరి సన్నివేశం మర్చిపోలేం.
ఈ సినిమా ఎన్నో వాస్తవ సంఘటనల సమాహారం అని అప్పటి ఉద్యమ అరెస్టుల గురించి సమాచారం ఉన్నవారికి అర్ధం అవుతుంది. వరంగల్‌లో డాక్టర్ రామనాధం గారి హత్య, పోలీసు ఆఫీసర్‌ని గిరిజనులు చంపడం, ఆ రోజులలోని ప్రజా ఉద్యమ స్థితి ఇవ్వన్నీ వాస్తవ సంఘటనలే. ప్యూడల్ పాలనకు విరుద్దంగా గ్రామాలలో లేచిన నక్సల్ గాలులు, పోలీసు బ్యూరోక్రసి వెనుక రాజకీయం, అహంకారం, దోపిడి, మానవ హక్కుల ఉల్లంఘన వీటన్నిటి నేపధ్యంలో పక్కా కథను తయారు చేసుకున్నారు దర్శకులు ఉమామహేశ్వార రావు. కన్నబీరన్ లాంటి లాయర్ల ఉద్యమ స్పూర్తి, రాచకొండ విశ్వనాధ శాస్త్రి లోని “లాయర్ విశ్వం” ని శరత్ బాబు పాత్రలో సృష్టించినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా కథను నడిపిన తీరు ఓ అద్భుతం. ఓ సాధారణ ప్రయాణ కథగా మొదలయి ఎన్నో విషయాలపై చర్చకు సినిమా తెర లేపుతుంది. ముఖ్యంగా ఉద్యమకారుల పట్ల రాజ్యం నడిపే రాజకీయం, మానవ హక్కుల ఉల్లంఘన, గురించి ఆలోచించజేసే అతి గొప్ప సినిమా “అంకురం”
దేశ భవిష్యత్తు పట్ల ఆశాకిరణం..
సింధూర ఓ సాధారణ మధ్యతరగతి వివాహిత. కాని జీవితం పట్ల ఓ స్పష్టత నిజాయితీ ఉన్న స్త్రీ. నిజమైన మాతృత్వానికి ప్రతీక. ఎన్నో సార్లు ఆ బిడ్డను వదిలించుకుని తనలోని అపరాధభావాన్ని కూడా కన్వినీయంట్‌గా దూరం చేసుకునే అవకాశం అమెకు వస్తుంది. కాని నిజం తప్ప మరొకటి స్వీకరించలేని ఆమె వ్యక్తిత్వం కారణంగా ఆమె వైవాహిక జీవిత భద్రతను వదులుకోవలసి వస్తుంది. ఎన్నిటినో వదులుకుంటూ వ్యక్తిగా ఎదుగుతుంది. తల్లిగా నిస్వార్ధపు మాతృత్వానికి, ముఖ్యంగా క్రూరమైన వ్యవస్థలో సర్వం పోగొట్టుకున్న విశ్వం వంటి ఉద్యమకారులకు కూడా ప్రేరణగా, ఈ దేశ భవిష్యత్తు పట్ల ఓ ఆశగా నిలిచిపోతుంది.
ప్రస్తుత తెలుగు సినిమా స్థితి చూస్తూ, ఈ పరిశ్రమలో మళ్లీ ఓ 'అంకురం' స్థాయి సినిమా రాగలదని ఆశ పడలేం. తెలుగు సినిమా ఎప్పటికీ గర్వించగల ఓ గొప్ప చిత్రంగా 'అంకురం' సినీ ప్రేమికుల మదిలో నిలిచిపోతుంది. దీన్ని రచించి తెర కెక్కించిన ఉమామహేశ్వరరావు లాంటి దర్శకుల సామాజిక స్పృహకు వందనాలు అర్పించాలి. “అంకురం” సినిమాను గుర్తుకు తెచ్చుకున్న ప్రతి సారీ తెలుగు సినిమా భవిష్యత్తుపై ఆశ చనిపోయిన ఎందరికో “ఏమో మంచి రోజులు రావచ్చేమో.. గుర్రం ఎగరా వచ్చేమో.. అనిపించే అవకాశం ఉంది. ఆ ఆశను నిలుపుకోవడానికి కొన్ని సందర్భాలలో ఈ సినిమాను మళ్లీమళ్లీ చూడవలసిన అవసరం నాలాంటి వారికి వస్తూ ఉంటుంది.
పి. జ్యోతి
చిత్ర సమీక్షకురాలు
98853 84740