ఓ సీపీఎస్ ఉద్యోగీ.. మేలుకో!

by Ravi |   ( Updated:2023-06-28 00:15:55.0  )
ఓ సీపీఎస్ ఉద్యోగీ.. మేలుకో!
X

దేశంలో, కొన్ని రాష్ట్రాలలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీలు సీపీఎస్ రద్దుపై మల్లగుల్లాలు పడుతున్నాయి. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విజయం సాధించాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే సీపీఎస్‌ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్త ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీపీఎస్ రద్దు అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆలోచనలో పడ్డ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన సీపీఎస్‌ని మెరుగు పర్చేందుకు ఒక కమిటీని నియమించి, ఆ కమిటీ సిఫారసుల మేరకు సీపీఎస్‌ను, జీపిఎస్‌గా మార్చడంపై ఆలోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే, అందులో నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వివరణ ఇచ్చినప్పటికి, కేంద్ర(బీజేపీ) ఆర్థిక విధానాలు తెలిసిన ఎవ్వరూ సీపీఎస్ స్థానంలో జీపీఎస్ కన్న మంచి ముగింపు(ఓపిఎస్) కేంద్రం ఇస్తుందని ఆశించలేరు.

రాష్ట్రంలో మౌనమేల

వాస్తవంగా రాష్ట్రంలో సీపీఎస్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో సీపీఎస్ రద్దు కోసం ఏర్పడిన సంఘాలు ఉద్యమం ప్రారంభించాయి, కానీ ఆ తర్వాత అన్ని సంఘాలు ఆ పల్లవి అందుకున్నాయి. క్రమంగా 2018 సాధారణ ఎన్నికల ముందు ఈ పోరాటం ఉధృతంగా సాగి, ఆ ఉద్యమం ఫలితంగానే గ్రాట్యూటి, ఫ్యామిలీ పెన్షన్ సాధించాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు 5 నెలల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, ప్రధాన పార్టీలు జీవన్మరణ సమస్యగా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, డిమాండ్ల సాధనకు అనుకూలమైన సమయంలో రాష్ట్రంలో ఎందుకో సీపీఎస్ ఉద్యోగి మౌనంగా ఉన్నాడు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జీపీఎస్‌ను కూడా ఒప్పుకునేది లేదని సీపీఎస్ ఉద్యోగులు కరాఖండిగా చెపుతూ ఉద్యమాలు చేస్తుంటే, మన రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగిలో చలనం రావడం లేదు. ఆ మౌనం వెనుక అర్థం ఏమిటి? ఒక ప్రక్క రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీలు ఇస్తుంటే కనీసం ఎన్నికల సమయంలోనైనా సీపీఎస్ ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తేలేరా? ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రాష్ట్రంలో కూడా సీపీఎస్ కు బదులు జీపీఎస్ ఇస్తామంటే సీపీఎస్ ఉద్యోగుల స్పందన ఏమిటి?

జీపీఎస్‌తో నష్టమే .

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్, కేంద్రం ప్రభుత్వం ఆలోచిస్తున్న జీపీఎస్ ఇంచుమించు ఒకే రకంగా ఉండొచ్చు. కానీ అది ముమ్మాటికీ సీపీఎస్ ఉద్యోగికి నష్టదాయకమే. ఓపీఎస్ ఉద్యోగి జీతంలో ఎటువంటి కట్టింగ్ లేకుండా చివరి బేసిక్‌లో 50% పెన్షన్‌గా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏ కూడా పెంచుతుంది. పీఆర్సీ కమిషన్ సిఫార్స్ ప్రకారం ఫిట్మెంట్ కూడా ఉంటుంది. కానీ సీపీఎస్ ఉద్యోగికి 10% లేదా14% జీతంలో కట్టింగ్ ఉంటుంది. ఇది పెన్షన్ రూల్-1980 కి విరుద్ధం. కానీ కట్ చేస్తున్నారు. ఉద్యోగి జీతం నుంచి కట్ చేసి ఉద్యోగికి ఇచ్చేదాన్ని పెన్షన్ ఎలా అంటారు? కొత్తగా వినిపిస్తున్న జీపీఎస్‌లో ఉద్యోగి నెల జీతం నుంచి 10, 14 శాతం కటింగ్ ఉంటేనే చివరి బేసిక్ లో 30, 40 శాతం మధ్య పెన్షన్‌కు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకుల వల్ల పెన్షన్ తగ్గితే, తగ్గిన మేరకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే జీపీఎస్ విధానంలో డీఏ ఉంటుందా? భవిష్యత్తులో పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏ పెంచుతారా? పీఆర్సీ సిఫారసుల మేరకు పెన్షన్ ఫిట్మెంట్ ఉంటుందా? ఇటువంటి విషయాలలో క్లారిటీ రావలసి ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వలె సీపీఎస్ స్థానంలో జీపీఎస్‌ని ముందుకు తెస్తే సీపీఎస్ ఉద్యోగి స్పందన ఏమిటి? అందుకే జీపీఎస్‌ని ముమ్మాటికి వ్యరేకించాలి. ఓపిఎస్‌కు ప్రత్యామ్నాయం లేదని కరాఖండిగా డిమాండ్ చేయాలి. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలకే మా మద్దతు అని ప్రకటించాలి. ఓపీఎస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనాలు వివరించాలి.

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి

రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షల సీపీఎస్ ఉద్యోగులు మరో రెండు లక్షల ఓపీఎస్ ఉద్యోగులు ఉంటారు. ప్రస్తుతం అన్ని సంఘాల ప్రధాన డిమాండ్ సీపీఎస్ రద్దే. అందుకే ముందుగా సీపీఎస్ సంఘాలు మౌనం వీడి, అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని తక్షణమే దశల వారీగా ఉద్యమ కార్యాచరణకు పూనుకోవాలి. సీపీఎస్ ఉద్యోగులు వారి కుటుంబాలతో సహా రద్దు ఉద్యమం ప్రారంభించాలి. మరో రెండు లక్షల ఓపిఎస్ ఉద్యోగులను ఉద్యమంలో భాగస్వాములను చేయాలి. సీపీఎస్ రద్దు ఎజెండాగా అన్ని రాజకీయ, ప్రజా సంఘాల మద్దతు కూడగట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. ఆ దశగా ఉద్యమం ఉండాలి. గతంలో జరిగిన ఆర్టీసీ, వీఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఉద్యమాన్ని విశ్లేషించుకొని, ఉద్యమ కార్యాచరణ తప్పుదోవ పట్టడానికి అవకాశం ఇవ్వకుండా ఉద్యమిస్తే సీపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉంది. అది ఈ 5 నెలల కాలంలోనే సాధ్యపడాలి. లేదంటే మరో ఐదు సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది. ఓ సీపీఎస్ ఉద్యోగి మేలుకో..

జుర్రు నారాయణ యాదవ్,

తెలంగాణ టీచర్స్ యూనియన్,

94940 19270

Advertisement

Next Story