ప్రజారంజక బడ్జెట్!

by Ravi |   ( Updated:2024-11-12 00:31:24.0  )
ప్రజారంజక బడ్జెట్!
X

ఆంధ్రప్రదేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వంపై అనేక ఆశ‌లు, ఆకాంక్ష‌లు ఉన్నాయి. ప్రభుత్వం పలు అంశాల‌ను ప‌రిష్క‌రించాల్సి ఉంది. ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న‌, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు న‌డిపించ‌డం వంటివి కీల‌కంగా మారాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అధ్యయనానికే 4 నెలలకు పైగా సమయం పట్టింది. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రంలో అసలు ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో తెలుసుకునేందుకు ప్రభుత్వం మొదటగా ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం వెలువరించింది. ఈ పరిస్థితుల వల్లే పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వానికి ఇంత సమయం పట్టింది.

జులైలో కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ సమర్పించాల్సి ఉన్నా ఆర్థిక పరిస్థితులపై అవగాహన, కోసం ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ఇన్నాళ్లు ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నా ఇక మిగిలింది 4 నెలల వ్యవధి మాత్రమే.

సూపర్ సిక్స్ అమలుచేసేందుకు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,94,427.25 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను రూపొందించింది. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ.25,916.99 కోట్లుగా పేర్కొంది. అలాగే మూలధన వ్యయం అంచనా రూ.32,712.84 కోట్లు, ఇదే కాలానికి రెవెన్యూ లోటు 34,743.38 కోట్లు, ద్రవ్యలోటు 68,742.65 కోట్లుగా ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 4.19 శాతంగానూ, ద్రవ్యలోటు 2.12 శాతంగానూ ఉండవచ్చు. ఈ బడ్జెట్‌ సంక్షేమానికి సముచిత స్థానం ఇచ్చింది. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు పరిచేందుకు తగ్గట్టుగానే పథకాలకు బడ్జెట్‌లో నిధులను కెటాయించింది. అలాగే అభివృద్ధి పనులకు సైతం పెద్దపీట వేసింది. రాష్ట్రంలో ప్రధానంగా పోలవరం, అమరావతి పనులు వేగం అందుకోనున్నాయి. రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పంచాయతీరాజ్‌ రోడ్లతో పాటు ఆ శాఖ పరిధిలోని పనులపై దృష్టి సారించింది. విద్య, ఆరోగ్య పథకాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులకూ బడ్జెట్లో సముచిత స్థాయిలో నిధులను కేటాయించింది.

లక్ష్యానికి అనుగుణంగా కేటాయింపులు..

2024-25 పూర్తిస్థాయి బడ్జెట్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిపింది. నైపుణ్యాభివృద్ధి మౌలిక సదుపాయాల రూపకల్పన గ్రామీణ పట్టణాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, రైతు కేంద్రాలు, మద్దతు ధర యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ- అభివృద్ధికి రూ.322 కోట్లు పోలీసు శాఖ- రూ. 8,495 కోట్లు, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ - రూ. 687 కోట్లు, రవాణా, రోడ్లు, భవనాల శాఖ- రూ. 9,554 కోట్లు, ఇంధన శాఖ - రూ. 8,207 కోట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ- రూ. 3,127 కోట్లు, జలవనరుల శాఖ- రూ 16,705 కోట్లు, గృహ నిర్మాణ శాఖ- రూ. 4,012 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ- రూ. 11,490కోట్లు, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ. 16,739 కోట్లు, వైద్యారోగ్య శాఖ - రూ. 18,421 కోట్లు, ఉన్నత విద్యాశాఖ- రూ. 2,326 కోట్లు, పాఠశాల విద్యాశాఖ- రూ. 29,909 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శాఖ- రూ.1,215 కోట్లు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ- రూ. 4,285 కోట్లు, షెడ్యూల్‌ కులాల సంక్షేమం- రూ. 18,497 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమం- రూ. 7,557 కోట్లు, బీసీల సంక్షేమం - రూ. 39,007 కోట్లు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం- రూ. 4,376 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు- రూ. 11,855 కోట్లు కేటాయించింది.

పారదర్శకతతో ఉండాలి!

అమరావతి నిర్మాణానికి కేంద్ర నిధులతో పాటు ప్రపంచబ్యాంకు, అసియా అభివృద్ధి బ్యాంకు నిధులను కేటాయించటం శుభ పరిణా మం. అయితే ఈ కేటాయింపులు కాగితాలకు మాత్రమే పరిమితం కారాదు. కార్యాచరణ సైతం అమలు కావాలి. బడ్జెట్ కేటాయింపులు కొన్ని శాఖలు పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేని పరిస్థితి. నిధుల కేటాయింపు నిధుల వినియోగంపై పారదర్శకతతో ఎప్పటికప్పుడు నివేదికలను ప్రజల ముందు ఉంచాలి. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక ప్రగతి రథానికి రెండు చక్రాలు అన్నది ప్రభుత్వ సారధులు గుర్తించి పారదర్శకతతో ఖర్చుపెడితే అభివృద్ది వేగవంతమౌతుంది.

వాడవల్లి శ్రీధర్

99898 55445

Advertisement

Next Story