- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'స్వస్తిక్' గుర్తు లేకున్నా ఓటే..!
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ మీద పోలింగ్ సిబ్బంది ఇచ్చిన ‘స్వస్తిక్’ గుర్తును మాత్రమే కాక ఇతర ఏ ముద్ర వేసినా చెల్లుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కౌంటింగ్ లో అలాంటి వాటిని వ్యాలిడ్ ఓట్లుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. నిర్దిష్టంగా ఒక పార్టీ అభ్యర్థి పేరు లేదా ఎన్నికల చిహ్నం దగ్గర స్వస్తిక్ ముద్రకు బదులుగా ఎలాంటివి వేసినా అభ్యంతరం లేదని వివరించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ఎస్ఈసీ కార్యదర్శి అశోక్ కుమార్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. కౌంటింగ్ పరిశీలకులు సందేహాలు లేవనెత్తడంతో ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నామని పేర్కొన్నారు. స్వస్తిక్ గుర్తుకు బదులుగా ఇతర ముద్రలు వేసినా (పెన్నుతో టిక్ చేయడం లాంటివి) సదరు ఓటరు ఉద్దేశం ప్రతిబింబిస్తూ ఉంది కాబట్టి ఆ బ్యాలట్ పేపర్‌ను లెక్కింపుకు అనువైనదిగానే పరిగణించాలన్నారు. 2005 నాటి ఎలక్షన్ కండక్ట్ రూల్స్ లోని 51(హెచ్) నిబంధన ప్రకారం పోలింగ్ సిబ్బంది పొరపాటుగా భావించి స్వస్తిక్ ముద్రకు బదులుగా ఏ తరహా మార్కు (ముద్ర) ఉన్నా దాన్ని లెక్కింపుకు అర్హత కల్గినదిగానే పరిగణిస్తామని వివరించారు.
దీనికి చట్టబద్ధత లేదు..
ఎస్ఈసీ జారీ చేసిన సర్క్యులర్ మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో షెడ్యూలు ప్రకటన మొదలు ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగడుగునా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగే వ్యవస్థగానే వ్యవహరించిందని ఆక్షేపించారు. రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆయన జూమ్ కాన్ఫరెన్సులో మీడియాతో మాట్లాడారు. ఈ సర్క్యులర్‌కు చట్టబద్ధత లేదని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఎన్నికల నిర్వహణపై పోరాటం చేస్తామన్నారు. కౌంటింగ్ ప్రక్రియను అడ్డుకోబోమని, అయితే కోర్టు ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోడానికి అన్ని రకాల పద్ధతులను ఎంచుకుంటామన్నారు. పోలింగ్ ఛాంబర్‌కు పెన్నును కూడా తీసుకెళ్ళరాదనే నిబంధనలు ఉన్నప్పుడు స్వస్తిక్ ముద్రకు బదులుగా పెన్నుతో టిక్ పెట్టినా చెల్లుబాటవుతుందనే నిబంధన హఠాత్తుగా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి ఈ ఉద్దేశమే ఉన్నట్లయితే పోలింగ్ కంటే ముందే ఈ విషయాన్ని స్పష్టం చేసి ఉన్నట్లయితే ఓటర్లు కూడా ఆ పద్ధతినే అనుసరించేవారుగదా అని ఎద్దేవా చేశారు.
అధికారులు, టీఆర్ఎస్ కుట్ర
పోలింగ్ రోజున ప్రతీ రెండు గంటలకు ఒకసారి బులెటిన్ రూపంలో పర్సంటేజీ వివరాలను వెల్లడించిన ఎన్నికల అధికారులు సాయంత్రం ఐదు–ఆరు గంటల మధ్య జరిగిన వివరాలను వెల్లడించడానికి ఒక రోజు సమయం ఎందుకు తీసుకున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందితో కుమ్మక్కయిన టీఆర్ఎస్ నాయకులు భారీ స్థాయిలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, కొన్ని బూత్‌లలో ఏజెంట్లను లోబర్చుకున్నారని ఆరోపించారు. రిగ్గింగ్ చేసిన తమ అనుమానాలకు ఇప్పుడు అర్ధరాత్రి పూట ఎన్నికల సంఘం జారీచేసిన సర్క్యులర్ బలం చేకూరుస్తోందన్నారు. టీఆర్ఎస్‌ను గెలిపించడానికి ఎన్నికల సంఘం తన శక్తివంచన లేకుండా సహకారం అందిస్తోందన్నారు. ప్రగతి భవన్ నుంచి అందుతున్న ఆదేశాల ప్రకారం మార్పులు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రశ్నార్థకం చేయడంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా మార్చివేసిందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం పూర్తయిన తర్వాత అర్ధరాత్రి ఈ సర్క్యులర్ జారీ కావడం వెనక పథకం ప్రకారం అధికార పార్టీ కుట్ర ఉందన్నారు. కోర్టుకు పోయి కౌంటింగ్ ప్రక్రియకు స్టే తెచ్చుకునే ఆస్కారం కూడా లేకుండా అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకున్నారని ఆరోపించారు. పోలింగ్ సిబ్బందిగా ప్రైవేటు వ్యక్తులను వాలంటీర్ల పేరుతో నియమించడం నుంచే అధికార పార్టీ కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, జ్యుడిషియల్ విచారణ కోరుతామన్నారు. బీజేపీ ఏ రకమైన యుద్ధం చేస్తుందో రానున్న కాలంలో తేలుతుందన్నారు. ఓటమి తప్పదని గ్రహించిన టీఆర్ఎస్ దొంగ ఓట్లతో అడ్డదారిన గెలిచే ప్రయత్నం చేస్తోందని, తాము మాత్రం ఇది జీహెచ్ఎంసీ ఎన్నికలకు మాత్రమే కాక మొత్తం ప్రజాస్వామ్యాన్నే కాపాడుకునే ప్రయత్నంగా భావిస్తోందన్నారు. చంబల్ వ్యాలీ దొంగల ముఠా తరహాలో అధికార పార్టీ నేతలు, ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని సంజయ్ ఆరోపించారు. పోలింగ్ బూత్‌లనే టీఆర్ఎస్ క్యాప్చర్ చేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అన్ని చట్టబద్ధ, న్యాయ పోరాటాలను చేస్తుందని స్పష్టం చేశారు.