ఇంట్లోనే ఉంటే కరోనా రాదు: డైరెక్టర్ (హెల్త్) డాక్టర్ శ్రీనివాసరావు

by sudharani |   ( Updated:2020-03-25 07:41:36.0  )
ఇంట్లోనే ఉంటే కరోనా రాదు: డైరెక్టర్ (హెల్త్) డాక్టర్ శ్రీనివాసరావు
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ప్రజలంతా రోడ్లమీదకు వచ్చారు. అప్పుడు రోడ్లమీదకు రావడం ఒక అవసరం. ఇప్పుడు అదే ప్రజలు రోడ్ల మీదకు రావద్దనే అవసరం ఏర్పడింది. అప్పుడు ఇల్లు వదిలి రోడ్లనే ఇల్లుగా మార్చుకున్నారు. ఇప్పుడు రోడ్లను వదలి ఇళ్ళకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పట్టుదలను మరోసారి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. సరిగ్గా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రజల నుంచి అదే తెగువను కోరుకుంటున్నారు. మొత్తానికి లాక్‌డౌన్ విజయవంతంగా అమలవుతోంది. ప్రజలు రోడ్లమీదకు రాకుండా ఇళ్ళకే పరిమితమై కరోనాను ఏ విధంగా కట్టడి చేయవచ్చో రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ‘దిశ’కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో వివరించారు.

కరోనా పాజిటివ్ కేసులు డబుల్ డిజిట్‌కు చేరుకున్నాయి గదా!

కరోనా పాజిటివ్ కేసులు రెండంకెలకు పెరగడం బాధాకరం. నిజానికి రెండు మూడు కేసులు మినహా మిగిలినవారంతా విదేశీ ప్రయాణం చేసి వచ్చినవారే. క్వారంటైన్‌లో ఉంచినప్పటికీ కొద్దిమంది స్వచ్ఛందంగా ‘హోమ్ క్వారంటైన్’లో ఉంటామని చెప్పి వెళ్ళిపోయారు. వారు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లమీదకు రావడం మమ్మల్ని ఆందోళనకు గురిచేసింది. దీంతో మార్చి నెల 1వ తేదీ నుంచి విదేశీ ప్రయాణం చేసివచ్చినవారి వివరాలను సేకరిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఎన్ఎం నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నాం. వారి తాజా ఆరోగ్య స్థితితో పాటు వారి ఇంట్లోనివారి ఆరోగ్య స్థితిగతుల గురించి కూడా తెలుసుకుంటున్నాం. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. చాలా పకడ్బందీగా ఈ పనులు జరుగుతున్నాయి.

మూడు ‘ట్రాన్స్‌మిషన్’ కేసులు కూడా నమోదయ్యాయెందుకు?

నిజానికి వాటిని ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్’ కేసులుగా పరిగణించలేం. కారణం, పాజిటివ్ పేషెంట్‌తో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నందున పక్కనున్నవారికి సోకాయి. అంతేగాని రోడ్లమీదకు రావడంవలన అంటుకున్నవి కావు. ‘హోమ్ క్వారంటైన్’లో ఉంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రోడ్ల మీదకు వచ్చినందువల్ల పక్కనున్నవారికి అంటుకోవడం మొదలైతే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యల వలన ఆ ప్రమాదం మనకు రాలేదు. ఇకపైన వస్తుందన్న ఆందోళన కూడా వైద్య శాఖ సిబ్బందిగా మాకు లేదు. ఎందుకంటే ఆ పరిస్థితులకు తావు లేకుండా లాక్‌డౌన్ కొనసాగుతోంది.

స్వీయ నియంత్రణ ప్రాధాన్యతను ప్రజలు గుర్తించినట్లేనా?

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఎప్పుడూ వంద శాతం ఫలితాలు రాకపోవచ్చు. కానీ మెజారిటీ ప్రజలు పాటిస్తే అది విజయవంతమైనట్లే. ఇప్పుడు స్వీయ నియంత్రణ విషయంలోనూ అదే జరుగుతోంది. జనతా కర్ప్యూ మరుసటి రోజు రాష్ట్రంలో అది కంటిన్యూ అయినా రోడ్లమీద మామూలు రోజుల్లో ఉన్న తీరులోనే ట్రాఫిక్, ప్రజల కదలికలు ఉన్నాయి. ఇది ప్రమాదం కొనితెస్తుందని ముఖ్యమంత్రి భావించారు. అందుకే చాలా సీరియస్‌గా వ్యవహరించాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. అత్యవసరమైతేనే రోడ్లమీదకు వస్తున్నారు. ఇది కూడా మేం ఆశించిన తీరులో నిజమైన కర్ఫ్యూ తరహాలో అమలైతే రాష్ట్రానికి కరోనా వ్యాప్తి ప్రమాదం ఉండదని దీమాగా ఉండేవాళ్ళం. ప్రజలే స్వీయ నియంత్రణతో ఉన్నట్లయితే ప్రభుత్వం ఇంత కఠినంగా ఉండాల్సిన అవసరం వచ్చేది కాదు. నిజంగా చెప్పుకోవాల్సి వస్తే ప్రజల్లో పూర్తిస్థాయిలో స్వీయ నియంత్రణ రాలేదు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే రోడ్ల మీదకు రావద్దనే ప్రాధాన్యతను గుర్తించలేదనే భావించాలి.

వైరస్ మరింత పెరిగితే ఆసుపత్రులు తట్టుకుంటాయా?

వైరస్ వ్యాప్తి చెందవచ్చన్న భయంతోనే చాలా ముందుజాగ్రత్తలు తీసుకున్నాం. వైద్యారోగ్య శాఖ సిబ్బది సెలవుల్ని పూర్తిగా రద్దు చేశాం. తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ వారికి పటిష్టమైన ప్లానింగ్ ఇచ్చి వీలైనంత ఎక్కువ పనిచేయిస్తున్నాం. ఇలాంటి విపత్తుల సమయంలో అది జరగాల్సిందే. అయితే మొత్తం పనిని ప్రభుత్వం మాత్రమే చేయడం సాధ్యం కాదు. ప్రజల సహకారం ఉంటే ఫలితాలు ఇంకో రకంగా ఉండేవి. వైరస్ వ్యాప్తి చెందవచ్చన్న అనుమానంతోనే ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆరోగ్యశ్రీ లాంటి విభాగాలు చర్యలు తీసుకున్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా నీరుగారిపోకుండా గరిష్ట స్థాయిలో ఎదుర్కోడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం. ఒకవైపు విదేశీ ప్రయాణం చేసినవారి వివరాలను సేకరించడంతో పాటు వారి నుంచి లక్షణాలు ఇంకెవరికైనా అంటుకున్నాయేమో ఆరా తీస్తున్నాం. ఐసొలేషన్ వార్డుల్ని సిద్ధం చేశాం. వెంటిలేటర్లను సిద్ధం చేసి మరికొన్నింటిని కొంటున్నాం. మందుల స్టాక్ సంతృప్తికరంగా ఉంది.

క్వారంటైన్ కేంద్రాలు ఎందుకు పనిచేయడంలేదు?

క్వారంటైన్ కేంద్రాలు బాగానే పనిచేస్తున్నాయి. కానీ వివిధ రకాల జీవితాలకు అలవాటుపడినవారు ఈ కేంద్రాలకు వచ్చిన తర్వాత సౌకర్యాల పట్ల సంతృప్తిగా లేరు. అన్ని స్థాయిలవారికి తగినట్లుగా స్వల్ప వ్యవధిలో ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదు. వారివారి జీవన అలవాట్లకు సరిపడే తీరులో ఆహార పదార్ధాలను, లగ్జరీ ఏర్పాట్లను చేయడం వీలు పడదు. ఇమడగలిగినవారు ఉంటున్నారు. లేనివారు స్వంత ఇండ్లకు వెళ్ళి క్వారంటైన్‌లో ఉంటున్నారు. ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారితో ఏ ఇబ్బందీ లేదు. కానీ ‘హోమ్ క్వారంటైన్’లో ఉన్నవారే నియంత్రణలో ఉండడంలేదు. అందుకే పక్కనున్నవారికి వైరస్ వ్యాపిస్తోంది. అందుకే హోమ్ క్వారంటైన్‌లో ఉన్నవారి మొబైల్ నెంబర్ల సిగ్నళ్ళ ఆధారంగా వారి ప్రతీ కదలికను నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రభుత్వ సిబ్బంది వారిని నీడలా వెంటాడుతున్నారు. ఆ రకంగానే కొద్దిమందిని పట్టుకుని ఆసుపత్రికి తరలించాం.

వైద్యారోగ్య డైరెక్టర్‌గా మీపైన పని ఒత్తిడి ఎలా ఉంది?

నా ఒక్కడిపైనే కాదు మొత్తం వైద్యారోగ్య సిబ్బందికీ పని ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఏ ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా దానికి వెనక ఉన్న లింకు, పూర్వాపరాలను లాగడం చాలా ముఖ్యం. సిబ్బందిలో చాలా మంది రోజుకు 12 గంటల నుంచి 16 గంటల పాటు పనిచేస్తున్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న నేను అర్ధరాత్రి వరకూ ఆఫీసులో ఉండాల్సి వస్తోంది. ఏక కాలంలో జిల్లాల వైద్యాధికారులతో సమన్వయం, కాల్ సెంటర్‌తో అనుసంధానం, వర్క్ డివిజన్‌లో భాగంగా అధికారులకు కేటాయించిన పనులను పర్యవేక్షించడం, మంత్రికి, ప్రభుత్వానికి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి తాజా పరిస్థితులను వివరించడం… ఇలా చాలా పనులు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎవరి స్థాయిలో వారు పనిచేస్తున్నట్లుగానే నాపై కూడా వత్తిడి ఉంది. అత్యవసర సేవలందించే విభాగంగా ఇది తప్పదు. పైగా మొత్తం ప్రపంచమే కరోనా మహమ్మారికి వణికిపోతున్నప్పుడు ప్రజలకు భరోసా కలిగించి దీమాగా ఉండే మా లాంటి అధికారులు భారంగా ఫీలైతే ఫలితాలు సానుకూలంగా ఉండవు.

కరోనా కట్టడి అయ్యేదెట్లా?

ప్రభుత్వం వైరస్ తీవ్రతను గుర్తించింది. వ్యాపించకుండా చర్యలు తీసుకోవడం ద్వారా కట్టడి చేయవచ్చని భావించింది. అందుకే ఇప్పుడు ఈ ఆంక్షలు. ఇప్పుడు చాలా కీలకమైన దశలో ఉన్నాం. ఈ సమయంలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించడం చాలా అవసరం. ప్రజలు లోతుగా ఆలోచించి ఇండ్లకే పరిమితమైతే ఆందోళన పడాల్సింది లేదు. కరోనాకు మందు లేదని అందరికీ తెలుసు. అయితే దాని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే సరైన మందు. ఆ దిశగా ప్రజలంతా స్వీయ నియంత్రణలో ఉంటూ ప్రభుత్వానికి సహకరిస్తే అదే పదివేలు. ప్రభుత్వం కోరుకుంటోంది కూడా ప్రజలు ఇళ్ళకు పరిమితం కావాలనే. పద్నాలుగు రోజుల క్వారంటైన్, 21 రోజుల లాక్‌డౌన్ తర్వాత తెలంగాణలోని పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయన్న విశ్వాసం ఉంది.

tags : Telangana, Corona, Director of Health, Dr Srinivasa Rao, Preventive, LockDown

Advertisement

Next Story

Most Viewed