సొంత ఖర్చులకు పంచాయతీ నిధులు.. సర్పంచ్‌పై ఉప సర్పంచ్ ఆరోపణ

by Shyam |
Panchayat Funds
X

దిశ, అనంతగిరి: పంచాయతీ నిధులను సొంత ఖర్చులకు వాడుకుంటున్నాడని సూర్యాపేట జిల్లా అనంతరగిరి మండలం వసంతాపురం గ్రామ ఉప సర్పంచ్ నాగరాజు సర్పంచ్‌పై సంచలన ఆరోపణ చేశాడు. ఈ మేరకు శనివారం ఉప సర్పంచ్ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పల్లె ప్రకృతివనంలో ఏర్పాటు చేసిన మొక్కల సంరక్షణ పనులకు గ్రామ పంచాయతీ ట్యాంకర్‌ను వినియోగించారు. దాని ఖర్చును గ్రామ టెక్నికల్ అసిస్టెంట్ అంజిరెడ్డి రూ.7200 అని రికార్డు చేశారు. అట్టి బిల్లు ఈజీఎస్ అకౌంట్‌కు జమ చేశారు. ఈ నేపథ్యంలో నగదును ఈజీఎస్ అకౌంట్ నుంచి డ్రా చేసిన సర్పంచ్ పులిగండ్ల శ్రీనివాసరావు, గ్రామపంచాయతీ అకౌంట్‌కు జమ చేయకుండా తన సొంత ఖర్చులకు వాడుకున్నాడు. అంతేగాక గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో మట్టికి సంబంధించిన ఎలాంటి పనులు జరుపలేదు. కానీ, దీనికి ఖర్చు అయిందని ఎంబీ రికార్డుల్లో నమోదు చేయించారు. దీనికి మొత్తం రూ.30958 డ్రా చేశారు. ఇలా ప్రతీచోట గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని సర్పంచ్ వాడుకొని పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నాడు. ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలి.’’ అని ఉప సర్పంచ్ భూక్యా నాగరాజు డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలపై సర్పంచ్ శ్రీనివాసరావును వివరణ కోరగా.. పల్లె ప్రకృతి వనం పనులకు గ్రామ పంచాయతీ ట్యాంకర్‌ను ఒకేరోజు వాడుకున్నామని, మిగతా రోజులన్నీ ఓ రైతు బావిలో మోటార్ ద్వారా నీటిని వినియోగించామని స్పష్టం చేశారు. రైతుకు మోటార్ ఖర్చులకు రూ. 7200 ఇవ్వాల్సి ఉండగా, నేటికీ గ్రామపంచాయతీ అకౌంట్‌లో వేయలేదని తెలిపారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి గురులక్ష్మిని వివరణ కోరగా.. పల్లె ప్రకృతి వనానికి గ్రామ పంచాయతీ ట్యాంకర్‌ను వినియోగించిన మాట వాస్తవమే అని అన్నారు. దీనిపై టెక్నికల్ అసిస్టెంట్ అంజిరెడ్డి ఎంబీ రికార్డు కూడా చేశారన్నారు. దీనికి సంబంధించిన చెక్కును సర్పంచ్‌కు అందజేశానని, డ్రా చేసిన నగదును త్వరలో గ్రామపంచాయతీ అకౌంట్‌కి జమ చేయిస్తామని వారు వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed