ఇక నుంచి డిపోల వారీగా జీతాలు

by Shyam |   ( Updated:2021-09-17 08:42:46.0  )
ఇక నుంచి డిపోల వారీగా జీతాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీలోనూ విడతలు వారీగా వేతనాలు ఇవ్వడం మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు జిల్లాల వారీగా జీతాలు ఇస్తున్నారు. ముందుగా హెచ్​ఓడీ విభాగాలకు, ఆ తర్వాత హైదరాబాద్​లోని ఉద్యోగులకు, అనంతరం రంగారెడ్డి, మేడ్చల్​ ఇలా జిల్లా వారీగా విడుదల చేస్తుండగా.. ఆర్టీసీ కూడా అదే బాటను ఎంచుకుంది. కానీ గ్రేటర్​ పరిధిలోని కార్మికులకే ఆలస్యంగా విడుదల చేస్తోంది. ఇక ఈ నెలలో ఇంకా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు జమ కాలేదు.

డిపోలు.. జిల్లాల వారీగా

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులంతా ఒకేసారి వేతనాలు తీసుకునే పరిస్థితులు లేవు. ఒకవేళ నిధులున్నా.. జీతాలిచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం జాప్యం చేస్తోంది. నెలలో సగం రోజులు గడిచినా జమ చేయడం లేదు. ప్రతినెలా ఇదే తంతు నెలకొంది. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి డిపోలు, జిల్లాల వారీగా వేతనాలు చెల్లించనున్నారు. ప్రస్తుతం అమల్లోకి తీసుకువచ్చారు. దీనిలో భాగంగా ఆర్టీసీ పరిధిలోని కొన్ని డిపోల్లో శుక్రవారం కొంతమంది కార్మికులకు జీతాలు జమ అయ్యాయి. ఒక్కో డిపో పరిధిలో మొత్తం కార్మికులకు రాలేదు. కొంతమందికి మాత్రం ఖాతాలో పడినట్లు బ్యాంకుల నుంచి సమాచారం వచ్చింది. అయితే కొన్ని జిల్లాల్లో శనివారం, మరిన్ని డిపోల పరిధిలో సోమవారం తర్వాత వరకు కూడా వేతనాలు సర్దుబాటు అవుతాయంటూ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

గ్రేటర్​లో జీతం రాలే

గ్రేటర్​ పరిధిలోని ఆర్టీసీ కార్మికులకు ఈ నెల వేతనాలు ఇంకా అందలేదు. ప్రతినెలా కనీసం 15వ తేదీ వరకు వేతనాలు విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు మరింత ఆలస్యమవుతున్నాయి. శుక్రవారం రాత్రి వరకు కూడా కార్మికులకు జీతం జమ కాలేదు. కొన్ని డిపోల్లో వేతనం కోసం అడిగితే హెచ్చరికలే సమాధానమవుతున్నాయి. అసలు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆర్టీసీలో ఇప్పటికే సిబ్బందిని తరలించుకునే ప్రక్రియను మొదలుపెడుతున్నారు. వీఆర్​ఎస్​ వైపు కార్మికులకు మళ్లించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు వేతనాలు సకాలంలో ఇవ్వకుండా మరింత ఆర్థిక కష్టాల్లోకి నెడుతున్నట్లు కార్మికులు పేర్కొంటున్నారు. ప్రతినెలా ఇలా వేతనాలను ఆలస్యంగా ఇస్తే సొంతంగా వెళ్లిపోయేందుకు నిర్ణయం తీసుకుంటారనే ప్లాన్​లో ఆర్టీసీ యాజమాన్యం ఉందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

హడావుడికే కొత్త ఎండీ

ఆర్టీసీ ఎండీగా ఈ నెల 3న ఐపీఎస్​ అధికారి సజ్జనార్​ విధుల్లోకి చేరారు. అప్పుడే కార్మికుల వేతనాలపై ప్రకటన చేశారు. ప్రతినెలా 1వ తారీఖునాడే వేతనాలిస్తామంటూ ప్రకటించారు. కానీ తొలి నెలలోనే జీతాలు ఆలస్యమవుతున్నాయి. అయితే ఇటీవల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం, బస్టాండ్లను పరిశీలించడం వంటి కార్యక్రమాలతో సజ్జనార్​ హడావుడి చేస్తున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి అదే పర్యటనలో ఉంటున్నారు. కానీ వేతనాల విషయంలో మాత్రం ముందడుగు వేయడం లేదు. కనీసం ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా చెప్పడం లేదు. దీంతో హడావుడి సరే.. వేతనాలు ఏవీ అంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

డిపోల వారీగానే సర్దుబాటు

మరోవైపు జీతాల కంటే ఎక్కవగానే నిధులున్నా వాటిని వాడుకోవడంలో ఆర్టీసీ యాజమాన్యం వెనకాముందాడుతోంది. వచ్చిన ఆదాయాన్ని కూడా వేతనాల కోసం సర్దుబాటు చేసే అధికారం తమకు లేదంటూ చేతులెత్తేస్తోంది. వాస్తవానికి ఆర్టీసీ ఆదాయం ఇటీవల పెరిగింది. దాదాపు రూ. 400 కోట్ల రాబడికి చేరింది. అటు బ్యాంకు నుంచి ఇచ్చిన అప్పు కూడా ఆర్టీసీ ఖాతాల్లో భద్రంగా ఉంది. అయినప్పటికీ జీతాలకు రూ. 120కోట్లను వాడుకునేందుకు సాహసించడం లేదు. దీంతో డిపోల వారీగా సర్దుబాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed