ప్రభుత్వ పథకమన్నాడు.. కోట్లు కొట్టేశాడు.. చివరికి

by Shyam |   ( Updated:2021-08-06 03:55:30.0  )
ప్రభుత్వ పథకమన్నాడు.. కోట్లు కొట్టేశాడు.. చివరికి
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్‌/ మ‌హ‌బూబాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రుణాలిప్పిస్తానని చెప్పి మద్దూరి వీరన్న అలియాస్ విక్రమ్ రెడ్డి అనే కేటుగాడు రైతుల నుంచి రూ.కోట్లు వ‌సూలు చేశాడు. ఏజెంట్ల‌కు క‌మీష‌న్ల ఆశ‌చూపి అన్న‌దాత‌లు ద‌ర‌ఖాస్తు చేసుకునేలా మోసానికి తెర‌లేపాడు. ఎక‌రానికి రూ. 50వేల రుణం ఇప్పిస్తామ‌ని, ఇందుకు ద‌ర‌ఖాస్తుకు రూ.6వేలు చెల్లించేలా ఏజెంట్ల ద్వారా నకిలీ వ్య‌వ‌హారం న‌డిపాడు. ఎక‌రానికి రూ.50వేల రుణం ఇప్పిస్తాన‌ని, మంజూరైన రుణంలో బీసీలైతే 50శాత‌మే తిరిగి చెల్లించాల్సి ఉంటుంద‌ని, ఎస్సీ, ఎస్టీల‌కు పూర్తిగా రుణ మాపీ ఉంటుంద‌ని, ఇది కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కమ‌ని, తెలంగాణ ప్ర‌భుత్వ ఆమోదితం పొంది ఉంద‌ని ర‌క‌ర‌కాలుగా న‌మ్మ‌బ‌ల‌క‌డంతో అమాయ‌కులైన రైతులు ప‌దుల సంఖ్య‌లో ఈ కేటుగాడి చేతిలో ద‌గాప‌డిన‌ట్లుగా తెలుస్తోంది.

డ‌బ్బులు క‌ట్టి నెల‌లు గ‌డుస్తున్నా రుణం రాక‌పోవ‌డంతో అనుమానం క‌లిగిన మ‌హ‌బూబాబాద్ ప్రాంతానికి చెందిన రైతులు గురువారం టౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మ‌హ‌బూబాబాద్‌లోని గాయ‌త్రి గుట్ట వ‌ద్ద ఏర్పాటు చేసిన కార్యాల‌యంలో సిబ్బందిని, మ‌ద్దూరి వీర‌న్న అలియాస్‌ విక్రమ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విష‌యం తాజాగా వెలుగులోకి రావ‌డంతో డ‌బ్బులు క‌ట్టిన రైతులు, ఏజెంట్లు పెద్ద సంఖ్య‌లో మ‌హ‌బూబాబాద్ టౌన్ పోలీస్ స్టేష‌న్‌కు చేరుకుంటున్నారు. కొంత‌మంది ఏజెంట్లు ఏకంగా ప‌దుల సంఖ్య‌లో రైతుల‌ను ద‌ర‌ఖాస్తు చేయించ‌డం గ‌మ‌నార్హం.

జ‌న‌గామ జిల్లా ఏజెంటుగా ప‌నిచేసిన వ్య‌క్తి ఏకంగా ఆ ప్రాంత రైతుల నుంచి రూ.3ల‌క్ష‌లు క‌ట్టించిన‌ట్లుగా పేర్కొన‌డంతో పోలీసులు విస్తుపోయారు. ఇప్ప‌టి వ‌రకు మ‌హ‌బూబాబాద్ స్టేష‌న్‌కు చేరుకుంటున్న రైతులు, ఏజెంట్ల‌లో జ‌న‌గామ‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్, భూపాల‌ప‌ల్లి, మ‌హ‌బూబాబాద్‌, హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం ప్రాంతాల‌కు చెందిన రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున వ‌సూళ్లు జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed