దారి దోపిడీ దొంగలు రిమాండ్​

by Sridhar Babu |
దారి దోపిడీ దొంగలు రిమాండ్​
X

దిశ, కూకట్​పల్లి : అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని దారి దోపిడీకి పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాను కేపీహెచ్​బీ పోలీసులు శుక్రవారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్​ రావు, కేపీహెచ్​బీ సీఐ వెంకటేశ్వర్​ రావుతో కలిసి వివరాలు వెల్లడించారు. జగద్గిరిగుట్టకు చెందిన మురహరిశెట్టి అంకమ్మరావు (31) ఆర్​ఎస్​ బ్రదర్స్​ షోరూంలో క్యాషియర్​గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో కైత్లాపూర్​ నుంచి కేపీహెచ్​బీ కాలనీ బ్రాండ్​ ఫ్యాక్టరీ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లోదా అపార్ట్​మెంట్​ ఎదురుగా ఉన్న నిర్మాణుష్య ప్రదేశంలో కొంత మంది హిజ్రాలు ఎదురు పడి అడ్డుకున్నారు. అదే సమయంలో వెనుక నుంచి రెండు బైకులపై వచ్చిన నలుగురు తమ చేతిలో ఉన్న కత్తులను చూపించి బెదిరించి అంకమ్మరావు మెడలో ఉన్న 1.5 తులాల బంగారు గొలుసు, ఐక్యూ 12 సెల్​ ఫోన్​ను లాక్కుని వెళ్లి పోయారు.

దీంతో బాధితుడు అంకమ్మరావు కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్​ ఈస్ట్​ గోదావరి జిల్లా కపిలేశ్వరం​నకు చెందిన వెంకట సురేష్​ (28) గత కొన్నిరోజుల క్రితం నగరానికి వచ్చి మోతీనగర్​లోని తన మిత్రుడు జగదీశ్​ వద్ద ఉంటూ నగరంలోని టూరిజం ప్లేస్​లను సందర్శిస్తున్నాడు. గురువారం రాత్రి బ్రాండ్​ ఫ్యాక్టరీ నుంచి నాలుగవ ఫేజ్​ రోడ్డులో వారు ఇద్దరు తమ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లోదా అపార్ట్​మెంట్​ వద్ద రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు వారిని బెదిరించి వారి వద్ద నుంచి సెల్​ ఫోన్​ లాక్కుని అక్కడి నుంచి వెళ్లి పోయారు. దీంతో బాధితులు సురేష్​, జగదీశ్​ కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకే రోజు అందిన రెండు ఫిర్యాదులతో కేసు నమోదు చేసి కేపీహెచ్​బీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీఎస్​, కేపీహెచ్బీ లా అండ్​ ఆర్డర్​ విభాగం ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

గండిమైసమ్మ పరిధిలోని డబుల్​ బెడ్​ రూం ఇళ్ల సముదాయంలో నివాసం ఉంటున్న బీర్బల్​ సింగ్​ బీబాను (25), భాగేందర్​ సింగ్​ అలియాస్​ బబ్లు సింగ్​ (29), రవి సింగ్​ బౌరి(20), దండు నాగేష్​ అలియాస్​ బబ్లు(20)లుగా పోలీసులు గుర్తించారు. రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్​గా చేసుకుని ఇద్దరుగా రెండు గ్రూపులుగా విడిపోయి దారి దోపిడీలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం రిమాండ్​కు తరలించారు. వారి వద్ద నుంచి 6 మొబైల్​ ఫోన్​లు, రెండు బైక్​ను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన కేపీహెచ్​బీ సీఐ వెంకటేశ్వర్​ రావు, డీఐ రవికుమార్​, డీఎస్సై సమద్​, క్రైం సిబ్బందిని ఏసీపీ శ్రీనివాస్​ రావు అభినందించారు.


Advertisement

Next Story