సమస్యలు పరిష్కరించాలని కామ్రేడ్లు పోరుబాట

by Shyam |
సమస్యలు పరిష్కరించాలని కామ్రేడ్లు పోరుబాట
X

దిశ, మహబూబ్ నగర్ :
అమరచింత మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పోరుబాట పట్టింది. శనివారం సీపీఐ నాయకులు అమరచింత మున్సిపాలిటీ ఎదురుగా బెఠాయించి నిరసన తెలుపుతుండగా వారికి కాంగ్రెస్, టీడీపీ నేతల మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..2019-20లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను 2020-21 సంవత్సరానికి గానూ ఆమోదించండంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు.అలాగే మునిసిపాలిటీ ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా నేటికీ కమిషనర్, టౌన్ ప్లానర్, అకౌంటెంట్, ఇంజినీర్ లాంటి తదితర రెగ్యులర్ అధికారులను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు.మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేసి, పట్టణ అవసరాల నిమిత్తం స్థానిక నిరుద్యోగులతో కొత్త సిబ్బంది నియమించాలని వారు డిమాండ్ చేశారు. అదే సమయంలో డీటీసీపీ అనుమతి లేకుండా మున్సిపాలిటీ పరిధిలో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న రియల్ దందాపై కమిషనర్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. 3వ వార్డులోని మోడగడ్డ గుంతను పూడ్చమని జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రివర్యులు, ఎమ్మెల్యే ఆదేశించినా ఎందుకు వారి హామీ అమలు కాలేదని మండిపడ్డారు. కొత్త కల్వర్టులు నిర్మించకుండా, మంచిగా ఉన్నవాటిని కూల్చి నిధులు ఎందుకు వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.అమరచింతలో మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, అలాగే పట్టణ ప్రగతిలో విద్యుత్ అధికారులు గుర్తించిన ఇనుప స్తంభాలు మార్చడం, 11 కెవీ లైన్లను ఇండ్ల మీద నుంచి తొలగించడం, స్తంభాలు లేని చోట కొత్త లైన్లు వెయ్యడం ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్నారు. అమరచింత మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి ఎంత కేటాయించారో బహిర్గతం చేయాలన్నారు.కార్యక్రమంలో సీపీఐ వనపర్తి జిల్లా కార్యదర్శి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కె. విజయ రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అయ్యూబ్ ఖాన్, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పి.తిరుమలేష్, సీపీఐ మండల కార్యదర్శి ఎ.అబ్రహం, ఏఐవైఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్ ఉన్నారు.

Advertisement

Next Story