పెద్దపల్లి ఎమ్మెల్యేకు కరోనా.. కార్యకర్తల్లో కలవరం

by Anukaran |
పెద్దపల్లి ఎమ్మెల్యేకు కరోనా.. కార్యకర్తల్లో కలవరం
X

దిశ, ఓదెల: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల్లో కలవరం మొదలైంది. తమకు ఎక్కడ కరోనా వ్యాధి అంటుకుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి పలువురిని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్‌ను గెలిపించేందుకు ఆయన గడపగడపకు తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

గత సోమవారం ఓదెల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భూమిపూజ చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జీల కుంటలో సీసీ రోడ్లు ప్రారంభం, మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, ఇందూర్తి, గుండ్లపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గుండ్లపల్లి సర్పంచ్ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆయన భోజనం చేశారు.

ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన ఎమ్మెల్యే కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకోగా, పాజిటివ్ వచ్చింది. దీంతో దాసరి మనోహర్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యేతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే, పలు సందర్భాల్లో కరోనా నిబంధనలు పాటించక పోవడం వల్లనే ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కరోనా ఉధృతి తగ్గడంతో తమకు ఏమీ కాదులే అనే ధీమాతో కరోనా నిబంధనలు పాటించకుండా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఇప్పుడు కలవరపడుతున్నారు. తమకు కూడా కరోనా వచ్చి ఉంటుందా అనే అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం పరుగులు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed