- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, ప్రతినిధి,మేడ్చల్ : అత్యాధునిక సమీకృత(ఇంటి గ్రేటెడ్) మార్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. మున్సిపాలిటికీ ఒక మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మేడ్చల్ జిల్లాలో ఉన్న నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలలో మార్కెట్లను నిర్మించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తవ్వగా, మరికొన్ని చోట్ల స్థలాల అన్వేషణ కొనసాగుతోంది. మార్కెట్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను మాత్రం నెల రోజుల క్రితమే పూర్తిచేసింది.
రూ.34 కోట్ల వ్యయంతో..
జిల్లాలో బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట కార్పొరేషన్ల తోపాటు ఘట్ కేసర్, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, తూంకుంట, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్, దుండిగల్ మున్పిపాలిటీలలో సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు జనాభా ప్రాతిపదికన నిధులను కేటాయిస్తున్నారు. నాలుగు కార్పొరేషన్లకు ఒక్కోదానికి రూ.4 కోట్లు కేటాయించగా, మున్సిపాలిటీలలో రూ.2 కోట్ల చొప్పున కేటాయించింది. ఈ మార్కెట్ల నిర్మాణానికి టీఐఎఫ్ఐడీసీ, 14వ ఆర్థిక సంఘం(ఎఫ్ సీ)లు సంయక్తంగా రూ.34 కోట్లు కేటాయించాయి. కొన్ని మున్సిపాలిటీలలో స్థలాల గుర్తింపు పూర్తవ్వగా, ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే పనులను ప్రారంభిస్తారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఆనుకొని ఉండడంతో స్థలాల సేకరణ కష్టతరంగా మారింది. కొన్ని చోట్ల ఎంపిక చేసిన స్థలాలు వివాదాల్లోకి వెళ్లగా, మరో చోట స్థలాలను పరిశీలిస్తున్నారు. అయితే మున్సిపాలిటీలలో రెండు ఎకరాలు, కార్పొరేషన్లలో నాలుగు ఎకరాల చొప్పున స్థలాలను ఎంపిక చేయాలని నిర్ణయించినప్పటికీ, ఆయా చోట్ల స్థలాలు దొరకడంలేదని సమాచారం. మార్కెట్ల నిర్మాణానికి అనువైన స్థలాలు దొరకకపోతే అందుబాటులో ఉన్న తక్కువ స్థలాల్లోనే అన్నీ వసతులు ఉండేలా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. జవహర్ నగర్ లో ఇప్పటికే నాలుగు చోట్ల స్థలాలను పరిశీలించగా, ఇంకా కొలిక్కి రాలేదు. ఘట్ కేసర్3లో ముందు పరిశీలించిన స్థలం కోర్టు వివాదంలో ఉండడంతో నగరానికి దూరంగా స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఆ స్థలంలో రాళ్లు రప్పలు ఉండడంతోపాటు పట్టణానికి దూరంగా ఉండడంతో ఆ మార్కెట్ కు ఏ మేరకు ఆదరణ లభిస్తుందోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అన్ని ఒకే చోట లభ్యం..
జిల్లాలో సమీకృత మార్కెట్లు అందుబాటులోకి వస్తే మాంసం, కూరగాయాలు, చేపలు, పండ్లు తదితర వస్తువులన్నీ ఒకేచోట లభిస్తాయి. ఇప్పటికే ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కూరగాయలు, మాంసం, చేపల అమ్మకాలు రోడ్లపైనే సాగుతున్నాయి. ఆదివారం వచ్చిందంటే రోడ్లపైనే చిరు వ్యాపారులు చేపల విక్రయాలు చేపడుతుంటారు. దీంతో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటికి తోడు రద్దీగా ఉన్న ప్రాంతాలలో పండ్లు, పూల వ్యాపారులు రోడ్లపైనే అమ్మకాలు సాగిస్తుండడంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లపై దృష్టిసారించారు. వెజ్, నాన్ వెజ్, పండ్లు తదితర వస్తువులన్నీ ఒకే చోట లభించేలా మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వినియోగదారులు, వ్యాపారులకు ఇబ్బందులు తలేత్తకుండా మార్కెట్లలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
వచ్చె నేలలో పనులు ప్రారంభం- జాన్ శ్యాంసన్
సమీకృత మార్కెట్ల పనులను డిసెంబర్ నెలలో ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. స్థలాల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమీషనర్లతో సమీక్ష జరిపాం. కొన్ని చోట్ల స్థలాల ఎంపిక పూర్తి అయింది. ఎంపిక చేసిన స్థలాల జాబితాను ప్రభుత్వానికి నివేధిస్తాం.. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సమీకృత మార్కెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.
– జాన్ శ్యాంసన్, అదనపు కలెక్టర్ మేడ్చల్