‘కో ఆప్షన్’ పీఠం దక్కేదెవరికో?

by Shyam |
‘కో ఆప్షన్’ పీఠం దక్కేదెవరికో?
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ :
కో- ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో మేడ్చల్ జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది.షెడ్యూల్ ప్రకారం మార్చిలోనే కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ, కరోనా వల్ల ఎన్నికలు నిరంతరంగా వాయిదా పడుతూ వచ్చాయి. ప్రభుత్వం ఇటీవల కో ఆప్షన్ ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేయడంతో కో ఆప్షన్ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా పదవులను దక్కించుకునేందుకు పలువురు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రంలోనే అత్యధికంగా..

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కో- ఆప్షన్ సభ్యుల ఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. ఈ నెలాఖారులోపు ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. నిజాంపేట్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్ నాలుగు కార్పొరేషన్లతో పాటు దమ్మాయిగూడ, దుండిగల్, ఘట్‌కేసర్, కొంపల్లి, మేడ్చల్, నాగారం, పోచారం, తూంకంట ఎనిమిది మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గులాబీ ఖాతాలే ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్‌కు చెందిన నేతలకే కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు జిల్లాకు చెందిన కార్మికా శాఖ మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని వ్యుహాత్మంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను ఏకగ్రీవం చేసి తమ సత్తా చాటారు. ఇదే తరహాలో మిగతా మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించేందుకు సర్వ శక్తులను ఒడ్డుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లతోపాటు స్వతంత్రులను టీఆర్ఎస్‌లోకి ఆహ్వనించి, కో ఆప్షన్ ఎన్నికల్లో ఎదురులేకుండా పావులు కదుపుతున్నారు.

రిజర్వేషన్లు ఇలా..

కో ఆప్షన్ ఎన్నికలను మార్చి 16న ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.57, 58 నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలల్లో రెండు చొప్పున కో-ఆప్షన్ స్థానాలను మైనారిటీలకు కేటాయిస్తారు. వీటిల్లో ఒక్కోస్థానాన్ని మహిళకు రిజర్వు చేస్తారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019ను అనుసరించి కో ఆప్షన్ ఎన్నిక నిబంధనలు 2020లో రూపొందించారు. భారత ప్రభుత్వం ఆమోదించిన ముస్లింలు, క్రైస్తవులు, బుద్ధులు, సిక్కులు, జోరాస్ట్రియన్లు (పార్శీ) లు మైనార్టీలుగా అర్హులు. అదేవిధంగా అనుభవజ్ఞుల కోటాలో మున్సిపాలిటీలో రెండు, కార్పొరేషన్‌లో మూడు కో ఆప్షన్ స్థానాలు ఉంటాయి. ఇందులో ఒకటి మహిళకు రిజర్వ్ చేస్తారు. మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో పనిచేసి, పదవీ విరమణ పొందిన అధికారులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, వైస్ చైర్మన్లు మాత్రమే కో ఆప్షన్ పదవికి పోటీ చేసే అవకాశం ఉంది.

ఎంపిక ఇలా..

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఏడు రోజుల వ్యవధితో దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. దరఖాస్తుల చివరి తేది నుంచి మూడ్రోజుల్లో కమిషనర్ స్క్రూటినీ పూర్తి చేయాలి. దరఖాస్తు దారులు కచ్చితంగా అర్హత పత్రాలు జత చేయాలి. దరఖాస్తు స్వీకరణ, పరిశీలన పూర్తి అయిన తర్వాత మూడ్రోజుల్లో నోటీసులతో మేయర్లు, చైర్మన్లు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. కమిషనర్ అర్హులైన దరఖాస్తు దారుల జాబితాను కౌన్సిల్ ముందు ఉంచాలి. హాజరైన సభ్యుల్లో మెజారిటీ ఆధారంగా కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. మొదటి సమావేశం జరిగిన రెండు నెలల్లోపు కో ఆప్షన్ సభ్యుల ఎంపిక జరపాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కో ఆప్షన్లన్నీ టీఆర్ఎస్‌కే దక్కే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా కారెక్కడంతో పాటు స్వతంత్రులను సైతం మంత్రి మల్లారెడ్డి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇక పోతే బీజేపీ కౌన్సిలర్లు ఉన్నా కో ఆప్షన్ స్థానాలు కమలానికి దక్కే అవకాశాలు తక్కువేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed