మరోసారి యాదాద్రికి కేసీఆర్.. ఈసారి స్వయంగా..

by Anukaran |
మరోసారి యాదాద్రికి కేసీఆర్.. ఈసారి స్వయంగా..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారనే సమాచారంతో యాడా అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే సీఎం పర్యటనకు సంబంధించి తేదీ ఇంకా ఖరారు కాలేదు. సీఎం పర్యటనకు ముందుగా సీఎంవో అధికారి భూపాల్‌రెడ్డి.. ఈ నెల 29న యాదాద్రిని సందర్శించనున్నారు. ఆ మేరకు సీఎం పర్యటన తేదీ ఖరారు కానుందని యాడ వర్గాలు చెబుతున్నాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, ఆలయ పనులు పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ రానున్నారనే సమాచారంతో యాడా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గతేడాది డిసెంబర్ 17న సీఎం యాదాద్రిలో పర్యటించారు. తాజాగా ఆలయ పనులు ఏ మేరకు జరిగాయో స్వయంగా చూడడానికి మరోమారు గుట్టకు రానునున్నట్లు సమాచారం.

సీఎం పర్యటనకు సంబంధించి ఇంకా తేదీ ఖరారు కాలేదు. కానీ వారం రోజుల్లో సీఎం పర్యటన ఉండొచ్చని యాడా నిర్వాహకులు భావిస్తున్నారు. సీఎం పర్యటనకు ముందుగా సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి.. శనివారం యాదాద్రిని సందర్శించనున్నారు. ఇందుకు సంబంధించి వైటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి శ్రావణ మాసంలోనే సీఎం యాదాద్రి రావాలనుకున్నప్పటికీ.. కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ప్రధానాలయంలో శిల్పాల పనులు తుదిదశకు చేరాయి. దీంతో సీఎం కేసీఆర్ మరోసారి యాదాద్రి ఆలయాన్ని సందర్శించే అవకాశాలున్నాయి. అయితే సీఎం పర్యటనకు సంబంధించి ఆలయ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

స్టెబిలైజేషన్ విధానంలో మరమ్మతులు..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల కుంగిపోయిన ఫ్లోరింగ్‌కు సాయిల్ స్టెబిలైజేషన్​ విధానంతో మరమ్మతులు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ప్రధానాలయం, ఉప ఆలయాలను కృష్ణ శిలతో నిర్మించారు. ప్రధానాలయం మహా ముఖ మండపంలో ఆండాళ్ దేవి, రామానుజులు, ఆళ్వారులు, క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి మందిరాలతో పాటు, శయన మండపం పనులు దాదాపు పూర్తయ్యాయి. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా.. ప్రధానాలయం ముందుభాగంలో ఫ్లోరింగ్‌పై ఉన్న మ్యాన్ హోల్ మూతల ఏర్పాటు పనులను ఐటీడీఏ అధికారులు చేపట్టారు. ఇటీవల ఫ్లోరింగ్ కుంగిపోవడం వల్ల.. అప్రమత్తమైన అధికారులు మరమ్మతుల విషయంలో పటిష్ఠమైన చర్యలు తీసుకున్నారు.

తుది దశకు యాదాద్రి పనులు..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ ప్రాకారాల్లో మరమ్మతు పనులు పూర్తికావొచ్చాయి. వర్షం పడ్డప్పుడు కురుస్తున్న ప్రాంతాల్లో గమ్ముతో సరిచేస్తున్నారు. కొన్నచోట్ల డంగు సున్నం తొలగించి కొత్తది వేస్తున్నారు. యాదాద్రీశుడి ఆలయంలోని ప్రాకారాలు, ముఖ మండపంలో వాన పడినప్పుడు కురుస్తుండటం వల్ల అధికారులు వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. వేంచేపు మండపంలో కురవకుండా రసాయనికి గమ్ము పూశారు. ప్రధాన ఆలయ ప్రాకారాల్లో డంగు సున్నం వేశారు. నాణ్యత లోపం వల్ల గట్టిపడలేదు. దీనివల్ల వాననీరు కురుస్తోంది. ప్రస్తుతం సాంకేతిక కమిటీ సూచనల మేరకు మొదట వేసిన డంగు సున్నం తొలగించి మళ్లీ డంగు సున్నంతోనే మరమ్మతు చేస్తున్నారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. దక్షిణ రాజగోపురం మెట్లు కుంగిపోవడం వల్ల వాటిని తొలగించి మరమ్మతు చేస్తున్నారు. ప్రధాన ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీకి అమర్చే పలకలపై శిల్పులు అందమైన బొమ్మలు చెక్కుతున్నారు. ఇప్పటికే శంఖు, చక్ర, తిరుణామాల నగిషీలతో తయారు చేసిన గ్రిల్స్​ను అమర్చారు. ప్రహరీకి మొదట సిమెంట్‌తో ప్లాస్ట్రింగ్ చేసి రంగులు వేయాలనుకున్నారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు కృష్ణ శిలను పోలిన గ్రానైట్ అమర్చాలని నిర్ణయించిన ఐటీడీఏ అధికారులు పనులు వేగవంతం చేశారు. గ్రానైట్‌పై పువ్వుల నగిషీలు చెక్కి, ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రహరీపై రంగురంగుల విద్యుత్ దీపాలు అమర్చడానికి ఎలక్ట్రికల్ పనులు ఇప్పటికే పూర్తి చేశారు.

కృష్ణశిలతోనే శ్రీకృష్ణుడి విగ్రహాలు..

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో శ్రీ కృష్ణుడి విగ్రహాలను కృష్ణ శిలతోనే ఏర్పాటు చేయనున్నారు. ఆలయ అష్టభుజ మండప ప్రాకారాలపై ఉన్న సాలహారాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఈ విగ్రహాలను కృష్ణ శిలతోనే చెక్కాలన్న సీఎం కేసీఆర్ సూచనల మేరకు యాదాద్రి ఆలయ ప్రాధికార సంస్థ (యాడా) నిర్ణయించింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయ అష్టభుజ మండప ప్రాకారాలపై ఉన్న సాలహారాల్లో ఏర్పాటు చేయాలనుకున్న శ్రీ కృష్ణుడి విగ్రహాలను కృష్ణ శిలతోనే చెక్కాలని యాదాద్రి ఆలయ ప్రాధికార సంస్థ (యాడా) నిర్ణయించింది. శ్రీ కృష్ణమహత్మ్యాన్ని వెల్లడించే రూపాలను గులాబీ రంగు రాతితో రూపొందించాలని గతంలో త్రిదండి చినజీయర్​స్వామి సూచించిన విషయం విదితమే. అయితే సీఎం కేసీఆర్​ దిశానిర్దేశంతో కృష్ణశిలతో విగ్రహాలను చెక్కించాలని నిర్ణయించినట్లు యాడా వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story