రాజకీయం కాదు.. యుద్ధ నీతి కావాలి : సీఎం కేసీఆర్

by Shamantha N |   ( Updated:2020-06-19 09:33:09.0  )
రాజకీయం కాదు.. యుద్ధ నీతి కావాలి : సీఎం కేసీఆర్
X

భారత్-చైనా సరిహద్దులో సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుని 20 మంది జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ(శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలోని 20 పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కేంద్రానికి పలు సూచనలు చేశారు. భారత్-చైనా ఘర్షణ నేపథ్యంలో ఏ మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని తెలిపారు. ఈ విషయంలో కేంద్రానికి పూర్తి అండగా నిలుస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదు.. యుద్ధ నీతి అని, మలేషియా, ఫిలిప్పీన్స్, జపాన్‌ దేశాలతో కూడా చైనా ఘర్షణలకు దిగుతోందని అన్నారు. చైనా వైఖరితో ప్రపంచ వ్యాప్తంగా అపఖ్యాతి పాలైందని, ఇప్పుడు కూడా చైనాలో అంతర్గత సమస్యలు ఉన్నాయని సీఎం కేసీఆర్ కేంద్రానికి తెలిపారు. అంతర్గత సమస్యలు ఉన్నప్పుడు ఘర్షణలు సృష్టించడం చైనాకు అలవాటని, ఎవరైనా మన దేశం మీదికి వస్తే తీవ్రంగా ప్రతిఘటించాలని అన్నారు. దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయం ఇది అని కేంద్రానికి తెలిపారు. అలాగే చైనా నుంచి వస్తువులు దిగుమతి ఆపాలనే చర్య తొందరపాటు అవుతుందని, బ్రిటన్ ప్రతిపాదించిన డీ10 గ్రూపులో కలవాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed