ఎక్కడి వలస కార్మికులు అక్కడే ఉండాలి : కేంద్రం

by vinod kumar |
ఎక్కడి వలస కార్మికులు అక్కడే ఉండాలి : కేంద్రం
X

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడం సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ తెలిపింది. బస్సులు, ట్రైన్‌లు, విమాన సేవలు రద్దు కావడంతో వారిని సొంత గ్రామాలకు తరలించడం కుదరదని హోం శాఖ అదనపు కార్యదర్శి గోవింద్ మోహన్ పేర్కొన్నారు. వలస కార్మికులకు సర్కారు అందించిన వెసులుబాటేమిటన్న ప్రశ్నకు సమాధానంగా.. లాక్‌డౌన్ గడువు ముగిసే వరకు వారిని తరలించడం సాధ్యం కాదన్న విషయం స్పష్టమని అన్నారు. అయితే, వారికి ఆహారం, ఆశ్రయాలను రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించాలని చెప్పారు. అందుకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి నిధులను వినియోగించుకోవచ్చునని తెలిపారు.

లాక్‌డౌన్ పొడిగించడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నరన్న వదంతులతో మహారాష్ట్రలోని బాంద్రా రైల్వే స్టేషన్ ముందు సుమారు రెండు వేల మంది వలస కార్మికుల మంగళవారం గుమిగూడిన విషయం తెలిసిందే. తమను స్వస్థలానికి పంపించేయాలని నిరసనకు దిగగా.. రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చించి అక్కడి నుంచి పంపించేసింది. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా పలుచోట్లా ఇటువంటి ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా, ప్రత్యేక ట్రైన్‌ల వదంతుల నేపథ్యంలో ఎటువంటి స్పెషల్ ట్రైన్స్‌ను అరేంజ్ చేయబోదని భారత రైల్వే ఓ ప్రకటన వెలువరించడం గమనార్హం.

Tags: migrant workers, movement, not possible, MHA, lockdown, indian railway, special trains

Advertisement

Next Story