- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
10 కోట్ల ఖాతాల్లోకి డబ్బులు..!
– కరోనాతో కుదేలైన ఎకానమీకి ఒకటిన్నర లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ
– సీరియస్ గా యోచిస్తున్న కేంద్రం
– భారీ పతనం తర్వాత దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు
దిశ, న్యూస్‌బ్యూరో: ఒకటిన్నర లక్ష కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించనుందా..దీనిలో భాగంగా దేశంలోని 10 కోట్ల మంది పేదల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు వేయనుందా… అంటే అవుననే అంటున్నాయి బుధవారం దూసుకుపోయిన ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి ప్రకటించిన లాక్‌డౌన్‌లతో కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనుందని రాయిటర్స్ బుధవారం ఒక కథనం ప్రచురించింది. ఈ ప్యాకేజీ ఎలా ఉండాలన్న దానిపై ప్రధాన మంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య సీరియస్‌గా చర్చలు జరుగుతున్నట్టు అది తెలిపింది. దీంతో బుధవారం భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఎన్ఎస్ఈ నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా 516,1861 పాయింట్లు ఎగబాకి చెరొక 6.5 శాతం లాభపడ్డాయి. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్ని ఎదుర్కొంటుండగా భారత్‌లోనూ దాని ప్రభావం పడింది. దీనికి తోడు తాజాగా దేశీయంగా సైతం వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి లాక్ డౌన్ ప్రకటించడంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఒక్క నిత్యావసర వస్తువులు తప్ప ప్రజలు మరే వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితిలో లేని పరిస్థితిలోకి ఆర్థిక వ్యవస్థ వెళ్లిపోయింది. మరోవైపు ప్రజలెవరు బయటికి వచ్చే అవకాశం లేకపోవడంతో దేశంలో తయారీ, సేవ రంగాల్లో జీడీపీ పూర్తిగా నిలిచిపోయింది. ఉన్న వస్తువులు అమ్ముకోలేక, కొత్త వస్తువులు తయారీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగులకు జీతాలివ్వడానికి సైతం బ్యాంకులను ఆశ్రయించే యోచనలో కంపెనీలున్నాయి. దీంతో దేశంలో ఆర్థిక వ్యవస్థకు జీవం పోసి వినియోగాన్ని పునరుద్ధరించాలంటే లాక్ డౌన్ ముగిసేలోపు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తుందనేది రాయిటర్స్ కథనం సారాంశం. పేదల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేయడంతో పాటు బ్యాంకింగ్, ఆటో, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా లాంటి వివిధ రంగాల్లోని కంపెనీలకు పలు ఇన్సెంటివ్స్‌ను కేంద్రం ప్రకటిస్తుందని తెలుస్తోంది.
ఆర్బీఐకి బాండ్లు ఇచ్చే అవకాశం..
కరోనాతో బాధపడుతున్న ప్రపంచంలోని మిగతా దేశాల ప్రభుత్వాల లాగానే కేంద్ర ప్రభుత్వం కూడా భారత సెంట్రల్ బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను ఆశ్రయించనుందని తెలుస్తోంది. ఆర్బీఐకి ప్రభుత్వ బాండ్లు ఇచ్చి మనీ ప్రింటింగ్‌కు తెరతీసి డబ్బు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. లేదా ఆర్బీఐ దగ్గర అందుబాటులో ఉన్న నగదును అప్పుతీసుకునే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో అంచనా వేసిన వచ్చే ఆర్థిక సంవత్సర(2020-21) ద్రవ్యలోటు లక్ష్యాన్ని సైతం 3.8 శాతం నుంచి భారీగా సవరించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యతను పెంచడానికి ఆర్బీఐ ఇప్పటికే బ్యాంకుల వద్ద నుంచి భారీగా ప్రభుత్వ బాండ్ల కొనుగోలును ప్రకటించింది.
tags : corona, global recession, lockdown, centre, bailout package