- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆవుపేడపై కేంద్రం ఫోకస్.. కిలో రూ.2
ఆవు పేడ కొనుగోళ్లపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ఖరారు కానున్నాయి. కిలో రూ. 2 చొప్పను కొనుగోలు చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పాడి రైతుల నుంచి సేకరించిన పేడను ప్రాసెస్ చేసి వర్మి కంపోస్టు రూపంలో తిరిగి రైతులకు విక్రయించాలని పేర్కొన్నది. చత్తీస్ గఢ్ ప్రభుత్వం గోధన్ న్యాయ్ యోజన పేరుతో ఆవు పేడను కిలో రూ.2 చొప్పను కొనుగోలు చేస్తున్నది. వర్మి కంపోస్టుగా మార్చి రూ. 8కి కిలో చొప్పను రైతులకు విక్రయిస్తున్నది. దీనినే దేశమంతా అమలు చేయాలని కేంద్ర సర్కారు భావిస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : ఇప్పటిదాకా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టుకోవడం ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నది. ఇక ఔషధ గుణాలున్న ఆవు మూత్రాన్ని అనేక రూపాల్లో వినియోగిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆవు పేడ క్రయ విక్రయాలపై దృష్టి పెట్టింది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, ముసాయిదా విధివిధానాలు ఖరారు కానున్నాయి. కేంద్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయం తర్వాత ఈ పథకంపై మరింత స్పష్టత రానుంది. పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేంద్ర పశు సంవర్ధక శాఖ, జలశక్తి మంత్రిత్వశాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత దీనిపై స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోనున్నట్లు వ్యవసాయ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆవు పేడ క్రయ విక్రయాల ద్వారా అనేక రకాల ప్రయోజనాలున్నట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల లోక్‌సభలో సమర్పించిన నివేదికలో పేర్కొంది. రైతుల నుంచి కిలో రెండు రూపాయల చొప్పున ఆవు పేడను చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉన్నదని, ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కొత్త స్కీమ్‌ను తీసుకురావాల్సిందిగా ఆ నివేదికలో సూచించింది. ఈ విధానం ద్వారా బహుళ ప్రయోజనాలున్నాయని పేర్కొంది. దేశంలో సుమారు 15 కోట్ల ఆవులు, మరో ఐదు కోట్ల ఎద్దులున్నట్లు కేంద్ర పశు సంవర్ధక శాఖ రెండేళ్ల క్రితమే అంచనా వేసింది. సుమారు 75% ఆవులే ఉన్నాయని, వీటిపై ఆధారపడి రైతులు పాల విక్రయాల ద్వారా ఎంతో కొంత ఆదాయం సంపాదిస్తూ కుటుంబపోషణకు వినియోగించుకున్నట్లు ఆ శాఖ పేర్కొంది.
ఆర్గానిక్ సేద్యం పెంచడానికి..
దీన్ని దృష్టిలో పెట్టుకున్న పార్లమెంటరీ స్థాయీ సంఘం రైతుల నుంచి ఆవు పేడను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆదాయ వనరుల మార్గంతోపాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పించినట్లవుతుందని స్పష్టం చేసింది. దీనికి తోడు రోడ్లపై తిరుగుతున్న ఎవరికీ చెందని ఆవుల సంరక్షణ మెరుగవుతుందని, సమస్యకు పరిష్కారం కనుగొన్నట్లవుతుందని పేర్కొంది. ఇలా సేకరించిన పేడ ద్వారా ఆర్గానిక్ సేద్యాన్ని పెంపొందించవచ్చని, రైతుల్ని ఆ దిశగా ప్రోత్సహించవచ్చని పేర్కొంది. దేశంలో విస్తృతమైన సంఖ్యలో ఆవులు, ఎద్దులు ఉన్నందున ఈ స్కీమ్ ద్వారా సరికొత్త ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది.
చత్తీస్ గఢ్‌లో ’గోధన్ న్యాయ్ యోజన‘
చత్తీస్‌గఢ్ ప్రభుత్వం గతేడాది నుంచి ‘గోధన్ న్యాయ్ యోజన’ పేరుతో రెండు రూపాయలకు కిలో చొప్పున కొని దాన్ని ప్రాసెసింగ్ చేసి వర్మి కంపోస్టు ఎరువు రూపంలో తిరిగి రూ. 8 చొప్పున రైతులకు విక్రయిస్తూ ఉంది. దాని ద్వారా ఆర్గానిక్ సేద్యం మెరుగుపడడంతో పాటు రైతులకు ఆదాయాన్ని కూడా చూపిస్తున్నది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’, ‘మిషన్ ఆర్గానిక్ వ్యాల్యూ చైన్ డెవలప్‌మెంట్’ పేరుతో ప్రభుత్వమే రైతులకు ఆర్థిక సాయం చేసి ఆవు పేడ సేకరణ చేపడుతోంది. ఇలా సేకరించిన పేడను తిరిగి ఆర్గానిక్ సేద్యం కోసం విక్రయిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పర్వతగౌడ చందన్‌గౌడ్ గడ్డిగౌడర్ నేతృత్వంలోని ముప్పై మంది పార్లమెంటు సభ్యులతో కూడిన వ్యవసాయ సంబంధ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘గోధన్ న్యాయ్ యోజన’ లాంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలంటూ సిఫారసు చేసింది.
పశుసంవర్థకశాఖ ద్వారా అమలు?
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు సైతం ఈ విషయంపై కమిటీకి వివరణ ఇస్తూ, వివిధ మంత్రిత్వశాఖలతో సంప్రదింపులు జరిపి దీనిపై తదుపరి సమావేశానికి స్పష్టత ఇస్తామని, కొత్త స్కీమ్ తీసుకురావడంపై ప్రభుత్వంతో చర్చించి అభిప్రాయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. కేంద్ర పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఆవు పేడ సేకరణ ప్రక్రియకు సంబంధించిన పథకం అమలు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘గోబర్ధన్’ (గోవర్ధన్) పేరుతో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఇప్పటికే ఒక పథకాన్ని అమలుచేస్తున్నదని కమిటీ సభ్యులు వ్యవసాయశాఖ దృష్టికి తీసుకెళ్ళారు. జలశక్తి మంత్రిత్వశాఖ, పశు సంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖల సమన్వయంతో కమిటీ సూచించిన పథకాన్ని త్వరలో ప్రారంభించడంపై స్పష్టమైన విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.