లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ : మార్చి 23, 2023 ( గ్రూప్స్ 1,2,3,4..ఎస్ఐ/కానిస్టేబుల్)

by Vinod kumar |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ : మార్చి 23, 2023 ( గ్రూప్స్ 1,2,3,4..ఎస్ఐ/కానిస్టేబుల్)
X

ప్రపంచ నెంబర్‌వన్ బౌలర్‌గా అశ్విన్:

టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ బౌలర్‌గా నిలిచాడు. ఈ మేరకు ప్రకటించిన ఐసీసీ టెస్టు బౌలింగ్ జాబితాలో అశ్విన్ 869 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకు సాధించాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఆరు వికెట్లు తీయడంతో అశ్విన్ కు 10 రేటింగ్ పాయింట్లు లభించాయి.

రాయ్‌బరేలీలోని స్టేడియానికి రాణీ రాంపాల్ పేరు:

భారత మహిళల హాకీ స్టార్ రాణి రాంపాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాయ్‌బరేలీలోని ఓ స్టేడియానికి ఆమె పేరు పెట్టారు. ఇకపై ఈ స్టేడియాన్ని ‘రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్’ పేరిట పిలవనున్నారు. హాకీలో ఈ ఘనత సాధించిన తొలి మహిళ రాణీనే.

హ్యాపీనెస్ ర్యాంకుల్లో మరోసారి ఫిన్లాండ్‌కు అగ్రస్థానం:

ఫిన్లాండ్ ఎప్పటి మాదిరిగానే ప్రపంచంలోనే అత్యంత సంతోకరమైన దేశాల్లో అగ్రభాగాన నిలిచింది. ఆరు దఫాలుగా అదే స్థానంలో కొనసాగుతుంది. అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా యూఎస్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ తాజా ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోనే 150కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకునే గ్లోబల్ సర్వే డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఈ నివేదికలో భారత్ 125వ స్థానంలో నిలిచింది.

సంతోష సూచీల్లో తొలి మూడు ర్యాంకులు:

1. ఫిన్లాండ్

2. డెన్మార్క్

3. ఐస్ లాండ్

తెలుగు రాష్ట్రాల నుంచి తొలి భారత్ గౌరవ్ రైలు ప్రారంభం:

దేశంలోని విశిష్ఠ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు సికింద్రాబాద్ నుంచి తొలిసారిగా బయలుదేరిన భారత్ గౌరవ్ రైలును దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు. ఐఆర్‌సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజా, ఇతర సీనియర్ రైల్వే అధికారులతో కలిసి జీఎం అరుణ్‌కుమార్ జైన్ యాత్రికులకు స్వాగత కిట్‌లు అందజేశారు.

‘మిషన్ కర్మయోగి’అమలు కమిటీ:

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల శిక్షణకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ కర్మయోగి కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలోని ఈ కమిటీలో పీఎంవో నుంచి ఒక సీనియర్ అధికారి, వివిధ శాఖల నుంచి ఏడుగురు కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ (ఎన్‌పీసీఎస్‌సీబీ) లేదా మిషన్ కర్మయోగి కింద నిర్దిష్ట విధానాన్ని రూపొందించే ప్రక్రియలో భాగంగా కేబినెట్ సెక్రటేరియట్ సమన్వయ విభాగాన్ని (సీఎస్‌సీయూ) ఏర్పాటు చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

‘గవర్నర్ పేట టు గవర్నర్స్ హౌస్ - ఎ హిక్స్ ఒడిస్సీ’ పుస్తకావిష్కరణ:

రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలో మార్పులు, చేర్పులు చేసి అసెంబ్లీలో చదివిన ధైర్యం తమిళనాడు మాజీ గవర్నరు పీఎస్ రామమోహనరావుదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రశంసించారు. ఆర్టికల్ 176 కింద అసెంబ్లీని ఉద్దేశించి గవర్నరు ప్రసంగించేటప్పుడు రాష్ట్రప్రభుత్వం ఏదిస్తే అది చదవాలి. కానీ రామమోహనరావు ప్రభుత్వం పంపిన ప్రసంగంలో మార్పులు చేయొచ్చా అని సీఎంకు లేఖ రాసి అనుమతి తీసుకుని మరీ మార్పులు చేశారని అన్నారు. ‘గవర్నర్ పేట టు గవర్నర్స్ హౌస్ - ఎ హిక్స్ ఒడిస్సీ’ పేరుతో రామమోహనరావు రాసిన పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నరు దత్తాత్రేయలతో కలిసి ఢిల్లీలో ధన్‌ఖడ్ విడుదల చేశారు.

మహిళ హక్కుగా నగదు:

తమిళనాడు రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇంటి బాధ్యతలు చూసే మహిళలకు మగళిర్ ఉరిమై తొగై (మహిళ హక్కుగా నగదు) పథకాన్ని ప్రకటించారు. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ప్రతినెలా రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేసేలా ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అర్హులైన వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed