ఎస్‌బీఐ లోన్‌లు మరింత భారం.. ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్ల పెంపు

by S Gopi |
ఎస్‌బీఐ లోన్‌లు మరింత భారం.. ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్ల పెంపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ లోన్‌లు మరింత భారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం బ్యాంకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్స్(ఎంసీఎల్ఆర్) రుణాల వడ్డీ రేట్లను 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీ రేట్లు సోమవారం(జూలై 15) నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దాని ప్రకారం, అన్ని రకాల రుణాలపై ప్రభావితం చూపే ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్‌ను 8.75 శాతం నుంచి 8.85 శాతానికి పెంచారు. అలాగే, నెల రోజుల ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెంచి 8.35 శాతానికి చేర్చగా, ఆరు నెలల ఎంసీఎల్ఆర్‌ను 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, రెండేళ్ల ఎంసీఎల్ఆర్‌ను 8.85 శాతం నుంచి 8.95 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్‌ను 8.95 శాతం నుంచి 9 శాతానికి పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎస్‌బీఐ వ్యక్తిగత, వాహన రుణాలను ప్రధానంగా ఎంసీఎల్ఆర్ రేటు ఆధారంగా ఇస్తారు. కాబట్టి ఆయా రుణాల ఈఎంఐలు భారంగా మారనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed