Silver: వెండికి భారీ డిమాండ్.. రెట్టింపుకు చేరువలో దిగుమతులు

by Harish |
Silver: వెండికి భారీ డిమాండ్.. రెట్టింపుకు చేరువలో దిగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీదారుల నుండి వెండికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో వెండి దిగుమతులు ఈ సంవత్సరం దాదాపు రెట్టింపుకు చేరుకునేలా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద వెండి వినియోగదారు అయిన భారత్‌లో దిగుమతులు ఎక్కువ కావడం వలన గ్లోబల్‌గా దీని ధర కూడా పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రముఖ వెండి దిగుమతి దారు ఆమ్రపాలి గ్రూప్ గుజరాత్ సీఈవో చిరాగ్ ఠక్కర్ మాట్లాడుతూ, భారత్ గతేడాది 3,625 మెట్రిక్ టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్‌ కారణంగా ఈ ఏడాది 6,500 నుంచి 7,000 టన్నుల వరకు పెరగవచ్చని అన్నారు.

బంగారం కంటే మెరుగైన రాబడిని ఇస్తుందని ప్రజలు ఎదురుచూసి వెండిని కొనుగోలు చేయడంతో ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో పెట్టుబడి డిమాండ్ అద్భుతంగా ఉందని చెప్పారు. మేలో స్థానికంగా కిలో వెండి రూ.96,493 రికార్డు స్థాయికి చేరుకుంది. ఇది 2024లో ఇప్పటివరకు బంగారం ధర 13 శాతం పెరుగుదలను మించిపోయి 14 శాతం పెరిగింది. భారతదేశం ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, చైనా నుండి వెండిని దిగుమతి చేసుకుంటుంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2024 ప్రథమార్థంలో భారతదేశపు వెండి దిగుమతులు ఏడాది క్రితం 560 టన్నుల నుంచి 4,554 టన్నులకు పెరిగాయి. స్మగ్లింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా, ప్రభుత్వం జులైలో వెండిపై దిగుమతి సుంకాలను 15 శాతం నుండి 6 శాతానికి తగ్గించింది.

Advertisement

Next Story

Most Viewed