Federal Reserve: వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధం.. ఫెడ్ చైర్మన్

by Harish |   ( Updated:2024-08-23 15:28:29.0  )
Federal Reserve: వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధం.. ఫెడ్ చైర్మన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికాలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధంగా ఉన్నామని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ శుక్రవారం తెలిపారు. అయితే ఈ తగ్గింపు ఎప్పటి నుంచి ఉంటుందో పేర్కొనలేదు. కానీ సెప్టెంబర్ మధ్యలో జరగబోయే ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్ల కోతపై ప్రకటన చేస్తారని నిపుణులు భావిస్తున్నారు. వ్యోమింగ్‌లోని జాక్సన్ హోల్‌లో జరిగిన ఫెడ్ వార్షిక ఆర్థిక సదస్సులో పావెల్ మాట్లాడుతూ,ఫెడరల్ రిజర్వ్ తన ప్రస్తుత 23 ఏళ్ల గరిష్ట స్థాయి నుండి కీలక వడ్డీ రేటును తగ్గించడానికి సమయం ఆసన్నమైందని అన్నారు.

నాలుగు దశాబ్దాలలో అత్యంత దారుణమైన ధరల పెరుగుదల కారణంగా లక్షలాది కుటుంబాలు ఇబ్బందుల పడ్డాయి. ఇప్పుడు ఆ బాధను కలిగించిన ద్రవ్యోల్బణం చాలా వరకు నియంత్రణలో 2 శాతంకు పైగా స్థిరంగా ఉందని అన్నారు. లెక్కల ప్రకారం ద్రవ్యోల్బణం గత నెలలో 2.5 శాతానికి పడిపోయింది. ఇది రెండేళ్ల క్రితం గరిష్ట స్థాయి 7.1 శాతం కంటే చాలా తక్కువ, సెంట్రల్ బ్యాంక్ 2 శాతం లక్ష్య స్థాయి కంటే కొంచెం ఎక్కువగా ఉంది. దీనిని మరింత తక్కువకు తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఇంతకుముందు అధికారులు ప్రకటించారు.

ఇంకా ఫెడ్ చైర్మన్ నియామకాలు తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగిత రేటు పెరుగుదలను కట్టడి చేయడానికి చేయగలిగినదంతా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రేట్లు తగ్గించడం ద్వారా బలమైన లేబర్ మార్కెట్‌ను కొనసాగిస్తూ ఆర్థిక వ్యవస్థ తిరిగి 2 శాతం ద్రవ్యోల్బణానికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story