పాకిస్తాన్‌లో బస్సు బ్లాస్ట్.. చైనీయులు సహా 13 మంది

by vinod kumar |   ( Updated:2021-07-14 06:41:09.0  )
Bus blast in Pakistan
X

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో బస్సులో పేలుడు సంభవించి లోయలో పడిపోయిన ఘటనలో 13 మంది మృతి చెందారు. ఉత్తర పాకిస్తాన్‌లోని కైబర్ పక్తుంఖ్వా రీజియన్‌లో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారిలో తొమ్మిది మంది చైనా పౌరులున్నారు. ఇద్దరు పాకిస్తాన్ జవాన్లు, మరో ఇద్దరు సాధారణ పౌరులున్నట్టు తెలిసింది. పేలుడు తీరుపై ఇంకా అనుమానాలున్నాయి. బస్సు లోపలే పేలుడు పదార్థాలు అమర్చారా? లేక రోడ్డుపై పాతిన బాంబు పేలిందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కాగా, పాకిస్తాన్ మాత్రం ఈ అనుమానాలను కొట్టేసింది. బస్సులో మెకానికల్ ఫెయిల్యూర్ కారణంగా గ్యాస్ లీక్ అయిందని, తద్వారా పేలుడు సంభవించినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వివరించింది. ఎగువ కొహిస్తాన్‌లోని దసు డ్యామ్ ప్రాజెక్టు పనికోసం 30 మంది చైనా ఇంజినీర్లను తీసుకెళ్తున్న ఈ బస్సులో పేలుడు సంభవించి పక్కనే ఉన్న లోతైన లోయలో పడిపోయిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

దక్షిణ పాకిస్తాన్‌లోని గ్వాదర్ సీపోర్ట్‌తో పశ్చిమ చైనాను కలుపడానికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా 65 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను చైనా నిర్మిస్తున్నది. దీనికోసం చైనా ఇంజినీర్లు, స్థానిక కార్మికులు కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. పాకిస్తాన్‌లో చైనా పౌరులకు భద్రత అంశంపై కొంతకాలంగా చర్చ జరుగుతున్నది. తాజా పేలుడుపై చైనా తీవ్రంగా స్పందించింది. దీన్ని చైనా పౌరులపై దాడిగా అభివర్ణించింది. దోషులను కఠినంగా శిక్షించాలని చైనా ఎంబసీ కోరింది.

Advertisement

Next Story

Most Viewed