సఫాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

by Sridhar Babu |
సఫాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మహిళా సఫాయి కార్మికుల కోసం అంతరంగిక కమిటీలను ఏర్పాటు చేసి వారికి ఏమైనా వేధింపులు, సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ, సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేషన్ కోరారు. శనివారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో సఫాయి కర్మచారి జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి హాజరైన ఆయన్ని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్ పుష్ప గుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ సఫాయి కర్మచారీలు ఏవైనా సమస్యలు ఉంటే ముందుగా అధికారులకు తెలియజేయాలని, సమస్యలు పరిష్కారం కాకుంటే యూనియన్ వారి దృష్టికి తేవాలన్నారు. అక్కడ కూడా పరిష్కారం కాకుంటే కమిషన్ కు (01124648924) ఫోన్ చేసి తెలపాలన్నారు.

జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీ సఫాయి కర్మచారీలను వేదిక వద్దకు పిలుచుకొని వారికి జీతం సరిగా వస్తుందా, ఏమైనా కోతలు విధిస్తున్నారా అని అడిగి వారి ఫోన్లలో జీతం పడిన తేదీలను పరిశీలించారు. కొంతమంది కర్మచారీలకు తక్కువ జీతం పడడంతో సదరు మున్సిపల్ కమిషనర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సఫాయి కర్మచారీలకు యూనిఫాం, ఐడీ కార్డులు, నెలలో 4 రోజుల సెలవులు వంటి వారి హక్కులను తెలియజేస్తూ, నెలకోసారి వారిని కలుసుకొని సమస్యలను తెలుసుకోవాలని లేబర్ కమిషనర్ ను ఆదేశించారు. అంతే కాకుండా వారికి సబ్బులు, నూనె, గ్ల్రౌజులు వంటి కనీస అవసరాలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్​ఛార్జి ఆర్డీఓ శంకర్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మోసిస్ బాబు, సంబంధిత అధికారులు, సఫాయి కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed