తొలిసారి ప్రజల సందర్శనకు.. బకింగ్‌హామ్ ప్యాలెస్ గార్డెన్

by Shyam |
Buckingham-Palace
X

దిశ, ఫీచర్స్ : బ్రిటన్‌ రాజకుటుంబం నివాసముండే భవనమే ‘బకింగ్‌హామ్ ప్యాలెస్’ అన్నది తెలిసిన విషయమే. వాస్తవానికి ఇది ‘డ్యూక్ ఆఫ్ బకింగ్‌హామ్’ కోసం 1703లో నిర్మించిన ఒక పెద్ద టౌన్‌హౌస్. దాదాపు 150 ఏళ్లు ప్రైవేట్ యాజమాన్యంలో ఉండగా, దీన్ని 1761లో కింగ్ జార్జ్ III స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇది క్వీన్ షార్లెట్ ప్రైవేట్ నివాసంగా, ది క్వీన్స్ హౌస్‌గా ప్రసిద్ది చెందింది. 1837లో విక్టోరియా రాణి ప్రవేశించిన తర్వాత బకింగ్‌హామ్ ప్యాలెస్ బ్రిటిష్ చక్రవర్తికి లండన్ నివాసంగా మారిపోయింది. ఇక ఆ నాటి నుంచి బ్రిటన్ రాజకుటుంబం అక్కడ నివాసముంటోంది. అయితే తొలిసారి ఈ భవనంలోని గార్డెన్‌ను ప్రజల సందర్శనార్థం తెరుస్తుండటం విశేషం.

బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో 775 గదులు ఉండగా, ఇందులోని ఉద్యానవనం లండన్‌లో అతిపెద్ద ప్రైవేట్ గార్డెన్‌గా పేరొందింది. ప్యాలెస్ గార్డెన్‌లో వెయ్యికి పైగా చెట్లు, గులాబీ తోటలు, నేషనల్ కలెక్షన్ ఆఫ్ మల్బరీ చెట్లతో పాటు 320 వివిధ వైల్డ్ ఫ్లవర్స్, గడ్డిజాతి మొక్కలున్నాయి. 3.5 ఎకరాల్లో విస్తరించి లేక్ పక్కనున్న ఈ గార్డెన్ సందర్శకులకు ఓ మధురజ్ఞాపకంగా నిలుస్తుందని రాయల్ హౌస్ ప్రతినిధులు చెబుతున్నారు. మొత్తంగా 39 ఎకరాల ప్యాలెస్ గార్డెన్‌ను 1820లో నిర్మించారు. లండన్‌లో చాలా అరుదుగా కనిపించే అనేక స్థానిక మొక్కలు ఇందులో ఉన్నాయి. ‘ఉద్యానవనాల్లోకి ప్రజలు వచ్చి పిక్నిక్ చేసుకోవచ్చు. ఇది మేము ఇంతకు ముందెన్నడూ ఇవ్వని ఆఫర్. తోటల్లో అన్వేషించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అవకాశమిస్తున్నాం. ఇది చాలామంది చూడని ప్రదేశం. ప్రజలకు చెప్పడానికి మాకు చాలా రహస్యాలు ఉన్నాయి’ అని రాయల్ వర్గాలు తెలిపాయి

సందర్శకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉన్నాయి. కప్‌కేక్స్, సీతాకోకచిలుకలు, పువ్వులు, ఎరుపు రంగు ట్యూనిక్స్, బేర్‌స్కిన్ టోపీలతో కూడిన శాండ్‌విచ్ బ్యాగ్ ధర 7.95 పౌండ్లు కాగా, రెండు పూల స్ప్రేలతో పాటు, మావీ కిరీటమున్న హ్యాండ్ శానిటైజర్ ధర 3.95 పౌండ్లు, పిక్నిక్ రగ్ 35 పౌండ్లుగా నిర్ణయించారు. రాయల్ కలెక్షన్ విక్రయిస్తున్న ట్రీట్ ప్యాకేజ్‌లో స్ట్రాబెర్రీ, షాంపైన్ జామ్, బట్టీ షార్ట్ బ్రెడ్ బిస్కెట్లు ఉన్నాయి. ఇక ఈ భవనం గగనతలంలో నో–ఫ్లయ్‌ జోన్స్‌ అమల్లో ఉంది. రాణిగారి కుటుంబ సభ్యుల భద్రత, రక్షణల కోసం వీటిపై విమానాలు ఎగరకుండా ఏళ్ల నుంచే నిషేధాజ్ఞలు ఉన్నాయి.

Advertisement

Next Story