ఆ గుళ్లో మటన్ బిర్యానీనే ప్రసాదం

by Sujitha Rachapalli |
ఆ గుళ్లో మటన్ బిర్యానీనే ప్రసాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ అనగానే ఫేమస్‌ ధమ్‌ బిర్యానీ గుర్తుకొస్తుంది. రంజాన్ మాసం వచ్చిందంటే హాలీమ్ రుచులు నోరూరిస్తాయి. అలాగే తమిళనాడులోని ఓ గుడి పేరు చెప్పగానే.. ఆ గుడిలో పెట్టే మటన్‌ బిర్యానీ ప్రసాదం గుర్తుకు రాకమానదు. ప్రసాదంగా చికెన్‌ బిర్యానీ? మటన్‌ బిర్యానీయా ? అని ఆశ్చర్యపోకండి! ఇది నిజంగా నిజమే.. ఎక్కడో తెలుసుకోవాలనుకుంటే చదవండి.

సాధారణంగా గుడి పేరు చెబితే.. మనకు లడ్డు, పొంగలి, పులిహోర, దద్దోజనం, వడపప్పు వంటి ప్రసాదాలు గుర్తుకొస్తాయి. దేవున్ని బ‌ట్టి, ప్రాంతాన్ని బ‌ట్టి దేవుడి గుళ్లో పంచిపెట్టే ప్ర‌సాదాలు మారుతుండొచ్చు. ఒక్కో క్షేత్రంలో ఒక్కో ప్రసాదం దేవునికి నైవేద్యంగా సమర్పిస్తుండొచ్చు. కానీ తమిళనాడు రాష్ట్రం, మధురైకి సమీపంలోని తిరుమంగళం తాలుకా, వడక్కంపట్టి గ్రామంలో కొలువైన ‘మునియాండి స్వామి’ దేవాలయంలో పెట్టే ప్రసాదం చూస్తే మాత్రం అవాక్కవుతాం. ఎందుకంటే ఈ ఆలయంలో ప్రసాదాలుగా చికెన్‌, మటన్‌ బిర్యానీ పంపిణీ చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. స్వామి వారికి నైవేద్యంగా బిర్యానీని సమర్పించి.. ఆ తర్వాత దానిని భక్తులకు ప్రసాదంగా పంచి పెడతారు. ఈ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఏమాత్రం వివక్ష చూపకుండా ఈ బిర్యానీ ప్రసాదాన్ని అందజేస్తారు. అక్కడ బిర్యానీని ఇంటికి పార్శిల్‌‌గా తీసుకెళ్లే సంప్రదాయం కూడా ఉండటం గమనార్హం. ఈ బిర్యానీ ప్రసాదం కోసం భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు కూడా అందజేస్తారు. 84 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

ఇంతకీ.. ఈ బిర్యానీని ప్రసాదంగా పంచిపెట్టే సంప్రదాయం ఎలా వచ్చిదంటే, 84 ఏండ్ల కిందట ఎస్పీఎస్ సుబ్బానాయుడు మునియాండీ(మునీశ్వరుడు) అనే పేరుతో ప్రారంభించిన హోటల్‌కు తెగ లాభాలు రావడంతో ఆ హోటల్ యజమాని.. ఆ స్వామికి రెండేళ్ల పాటు మటన్ బిర్యానీని నైవేద్యంగా సమర్పించి భక్తులకు బిర్యానీ పంపిణీ చేశాడు. ఇక అప్పటి నుంచి ఆ ఊరి గ్రామస్తులంతా కలిసి మటన్ బిర్యానీ చేసి భక్తులకు పంపిణీ చేయడం మొదటపెట్టారు. ప్రతి ఏటా జనవరి 24 నుంచి 26 వరకు ఇక్కడ వార్షికోత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా గుడికి వచ్చిన భక్తులకు బిర్యానీని పంచుతారు. ఇందుకోసం దాదాపు 1000 కిలోల బియ్యం, 200 మేకలు, 300 కోళ్లను ఉపయోగిస్తారు. మునియాండీ స్వామికి శ్రీలంక, మలేషియాలోనూ భక్తులున్నారు. ముని అంటే శివుని సేవకుడని అర్థం.

Advertisement

Next Story